
అఖిల్ మృతిపై అనుమానాలు
విజయవాడ (లబ్బీపేట) : 'మా అబ్బాయికి ఎటువంటి అనారోగ్యం లేదు. మెడికల్ రికార్డు చాలా బాగుంది. పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ మృతి విషయంలో కాలేజీ యాజమాన్యం ఏవేవో అభూత కల్పనలు ప్రచారం చేస్తూ రకరకాల కథలు చెపుతున్నారు' అంటూ విజయవాడ సమీపంలోని నిడమానూరులోని నారాయణ కాలేజీలో శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందిన నర్రా అఖిల్‌తేజ్‌కుమార్ రెడ్డి తండ్రి సింగారెడ్డి అంటున్నారు. అసలు మృతిపైనే అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం అఖిల్‌తేజ్‌కుమార్ రెడ్డి మృతదేహానికి పంచనామా నిర్వహించే సమయంలో సింగారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారన్నారు. అనంతరం 6.15కు ఫోన్ చేసి మృతి చెందినట్లు చెప్పారన్నారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకే అఖిల్ మృతి చెందినట్లు సహచర విద్యార్థులు గుర్తించారని తెలుసుకున్నామన్నారు.
మధ్యాహ్నం రెండు గంటలకు క్లాసుకు వెళ్తూ కడుపునొప్పి వస్తోందని తిరిగి రూమ్‌కు వచ్చాడని చెపుతున్నారని, రూమ్‌కు తాళం వేసి ఉంటే కిటికీలో నుంచి రూమ్‌లోకి వెళ్లినట్లు యాజమాన్యం చెబుతోందని వివరించారు. సహచర విద్యార్థులు సాయంత్రం 4.30 గంటలకు రూమ్‌కు వచ్చే సరికి ప్యాంట్‌తో ఫ్యాన్ కొక్కేనికి ఉరివేసుకుని కాళ్లు నేలకు ఆనుతున్నట్లు ఉన్నాడని చెబుతున్నారని, ఆ పరిస్థితుల్లో హ్యాంగింగ్ చేసుకుని మృతి చెందాడంటే నమ్మశక్యంగా లేదన్నారు.
మృతిపై కాలేజీ యాజమాన్యం అనేక అపోహలు సృష్టిస్తూ అభూత కల్పనలు సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణ మంత్రిగా ఉండటంతో ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, న్యాయం చేస్తే చేయండి లేకుంటే లేదని, ఇవే విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నట్లు సింగారెడ్డి మీడియాతో పేర్కొన్నారు. వినాయకచవితి పండుగకు ఇంటికి వస్తే ఈ నెల 20న తిరిగి కళాశాలకు పంపించామని, బుధవారం చివరిసారిగా తనతో పది నిమిషాలు మాట్లాడాడని కన్నీరు మున్నీరవుతూ వివరించారు.