పీవీ రమణను సస్పెండ్ చేయాలని పట్టణ పార్టీ తీర్మానం
అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నిర్ణయం
ద్వితీయశ్రేణికి చెందిన ముగ్గురు నాయకుల ఫోను సంభాషణ బయటపడటమే కారణం
ఒకరినే సస్పెండ్ చేయాలని తీర్మానించడంపై కార్యకర్తల అభ్యంతరం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పీవీ రమణను సస్పెండ్ చేయాలని శ్రీకాకుళం పట్టణ పార్టీ తీర్మానం చేయడమే దీనికి కారణం. సస్పెండ్‌కు సంబంధించిన తీర్మానాన్ని అధినాయకుని దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన వెంట తీర్మాన ప్రతిని తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది. ఇటీవల పట్టణస్థాయి సమావేశం జరగ్గా.. దీనిపై ముగ్గురు నాయకులు ఫోన్‌లో చేసుకున్న సంభాషణ వాట్సాఫ్‌లో హల్‌చల్ చేసింది. పీవీ రమణ, గుమ్మా నాగరాజు, మావూరి శ్రీనివాసరావులు చేసుకున్న సంభాషణ జిల్లా వ్యాప్తంగా వాట్సాఫ్‌లో ప్రత్యేక్షమైంది. సమావేశంలో జామి భీమశంకర్ తనకు ఏయూ పాలకమండలి సభ్యునిగా నియమించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, ఇతర పార్టీల నుంచి ఎవరైనా టీడీపీలోకి రావాలని యోచిస్తే వారిని అడ్డుకునేలా పార్టీయే తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు మాదారపు వెంకటేష్ తనతో చెప్పినట్లు పీవీ రమణతో గుమ్మా నాగరాజు చెప్పినట్టు సమాచారం.
ఇదే సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు.. మున్సిపల్ మాజీ చైర్మన్ వరంను గాని, వారి కుటుంబ సభ్యులనుగాని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే భయపడుతున్నారని కూడా రమణతో నాగరాజు అన్నట్టు సమాచారం. ఏప్రిల్ మాసాంతంలో, మే మొదటి వారంలోగాని శ్రీకాకుళం నగరపాల సంస్థకు ఎన్నికలు జరుగుతాయని, ఈలోగా మున్సిపాలిటీకి మంజూరైన రూ. 28 కోట్లు ఖర్చు చేయాలని, పనులన్నీ పార్టీ కార్యకర్తలతోనే చేయించాలని నిశ్చయించినట్లు ఎమ్మెల్యే సమావేశంలో తెలిపారని కూడా రమణ దృష్టికి నాగరాజు తీసుకొచ్చారు. అయితే ఈ నిధులు మంజూరైనట్లు సమావేశం ముందురోజునే తాను మీ దృష్టికి తీసుకువచ్చాను కదా అని నాగరాజును రమణ ప్రశ్నిస్తూ తనకు ఈ విషయాన్ని మంత్రి ముందురోజే చెప్పారని రమణ అనడం కూడా ఆ సంభాషణలో ఉంది. దీనికి నాగరాజు బదులిస్తూ మంత్రి ప్రస్తావననే ఎమ్మెల్యే తీసుకురాలేదని, తానే మున్సిపల్ మంత్రి నారాయణను, ముఖ్యమంత్రిని అడిగి మంజూరు చేయించానని చెబుతున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కొందరు గ్యాంగ్‌గా తయారయ్యారని, అలాంటి వారిని పెట్టుకొని వెళితే నగరపాలకసంస్థ ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా నాగరాజు సంభాషణలో అభిప్రాయపడ్డారు. నాన్నకు ప్రేమతో తరహాలో కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి అమ్మకు ప్రేమతో అన్నట్లుగా పనిచేయాలని గ్యాంగ్ సభ్యులంతా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ కౌన్సిలర్ మావూరి శ్రీనివాసరావు.. రమణతో అన్నారు. నాగరాజు చెప్పిన వివరాలను కూడా ఆయన ధ్రువీకరించారు. ఇలా ముగ్గురి మధ్య సంభాషణ జరగ్గా పీవీ రమణను మాత్రమే సస్పెండ్ చేయాలని తీర్మానించడంపై కార్యకర్తలు అభ్యంతరం చెబుతున్నారు. సమావేశంలోని నాయకులు, కార్యకర్తలంతా ముగ్గురినీ సస్పెండ్ చేయాలని పట్టుబట్టగా, త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తన మాటను ఏ ఒక్కరూ కాదనవద్దని ఎమ్మెల్యే చెప్పినట్లు భోగట్టా. గుమ్మా నాగరాజు, మావూరి శ్రీనివాసరావులు ఎమ్మెల్యేకు అనుచరులు కావడం, తొలినుంచీ పీవీ రమణను ఎమ్మెల్యే దూరంగా ఉంచడమే ప్రస్తుత నిర్ణయానికి కారణమని టీడీపీలో చర్చ జరుగుతోంది. కారణమేదైనప్పటికీ సంభాషణలో ఎక్కువగా ఆరోపణలు చేసింది నాగరాజు, శ్రీనివాసరావులు కాగా రమణను సస్పెండ్ చేయడంపై టీడీపీలోని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో.. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఓ నాయకుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నానా దుర్భాషలాడటం, ఈ సంభాషణ కూడా అప్పట్లో రికార్డు చేసి సీడీల ద్వారా ప్రచారం జరగడాన్ని ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అటువంటి వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, ఓ సమావేశంపై ముగ్గురు చర్చించుకొని తమ అభిప్రాయాలను చెప్పుకుంటే ఒకరిని సస్పెండ్ చేయాలని తీర్మానం చేయించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. కాగా విషయాన్ని ఇప్పటివరకు పార్టీ జిల్లా నేతలు, మంత్రి, శాసనసభ్యుల దృష్టికి తీసుకురాకుండా తీర్మానం చేసి రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని నిశ్చయించడం పట్ల పలువురు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.