పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తా..! | Internal Fights in Prakasam TDP | Sakshi
Sakshi News home page

పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తా..!

Published Sun, Oct 14 2018 11:31 AM | Last Updated on Sun, Oct 14 2018 11:34 AM

Internal Fights in Prakasam TDP - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో ముఠా పోరు తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమ ప్రకాశంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇప్పుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టార్గెట్‌గా మారారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలోని పలు నియోజకవర్గాల అభ్యర్థులను మారిస్తేనే పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేస్తానని ఎమ్మెల్సీ మాగుంట ముఖ్యమంత్రి చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, కొండపి తదితర నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని మాగుంట సూచించినట్లు సమాచారం. అలా అయితేనే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పోటీ ఇవ్వగలమని మాగుంట అధినేతకు వివరించినట్లు తెలుస్తోంది.

 ఆలస్యం చేయకుండా ఇప్పటికిప్పుడు అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టాలని కూడా మాగుంట ఒత్తిడి పెంచినట్లు ప్రచారం సాగింది. ఇందుకు ముఖ్యమంత్రి సైతం అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీని ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు సైతం అధికార పార్టీ నేతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి మాగుంట మినహా అభ్యర్థి కనిపించలేదు. మాగుంటను ఒప్పించి ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించాలనేది సీఎం నిర్ణయంగా తెలుస్తోంది. ఇదే అదునుగా ఎమ్మెల్సీ మాగుంట తన సొంత ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం మాగుంట ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసే అవకాశం అధికంగా ఉంది.

మాగుంటపై సిట్టింగ్‌ల గరం..గరం
మాగుంట ప్రతిపాదన పశ్చిమ ప్రకాశం పరిధిలోని అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు మింగుడు పడడం లేదు. వారంతా ఆయనపై గరం..గరంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మాగుంటతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మాగుంట ప్రతిపాదనలకు సీఎం ఓకే చెప్పే పక్షంలో అందుకు వ్యతిరేకంగా పనిచేయాలని సిట్టింగ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాగుంట ప్రతిపాదనలు అధిష్టానం వద్ద తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.

 మరి కొందరు నేతలు మాగుంట ప్రతిపాదనలపై మండిపడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన టీడీపీ అభివృద్ధి కోసం పనిచేయాలేదన్నది పలువురు అధికార పార్టీ ముఖ్యనేతల వాదన. మాగుంట ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుందని ఓ ఎమ్మెల్యే మాగుంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు మాగుంట సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వాన్ని వాడుకున్నారని, తద్వారా వేల కోట్లలో లబ్ధి పొందారని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.

 వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సరైన వ్యక్తి లేకపోవడంతో ముఖ్యమంత్రి మాగుంటను బుజ్జగిస్తున్నారని, అదే అవకాశంగా మాగుంట సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే  మాగుంటకు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున  మద్యం కొనుగోళ్లు చేపట్టిందని, దీని వల్ల మాగుంటకు వందల కోట్లలో లాభం చేకూరిందని వారు పేర్కొంటున్నారు. దీంతో పాటు మాగుంట సంస్థలకు సంబంధించిన విలువైన భూములను ప్రభుత్వం ద్వారా పొందినట్లు కూడా అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. 

 ఎమ్మెల్సీ ప్రొటోకాల్‌ ఇచ్చినా మాగుంట  క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను ముందుకు నడిపించలేదని, పాత క్యాడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లి పోయారని,  పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అనంతరం మౌనం దాల్చకుండా మాగుంట మొదటి నుంచి క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలిచి ఉంటే పశ్చిమ ప్రకాశంలోనూ టీడీపీ కొంతమేర నిలదొక్కుకుని ఉండేదని సదరు నేత విశ్లేషించారు.  క్యాడర్‌ను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాగుంట సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇచ్చారన్నది పలువురు అధికార పార్టీ నేతల వాదన. 

ఈనెల 15న సీఎం రివ్యూ :
ఈనెల 15న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే రోజు సాయంత్రం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పై స్థానిక ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో రివ్యూ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మాగుంట ప్రతిపాదనలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే మాగుంట ప్రతిపాదనలకు అధికార పార్టీ సిట్టింగ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement