బేస్తవారిపేట: నేటి మానవ జీవనం అస్తవ్యస్తంగా.. ఉరుకులు పరుగులతో సాగిపోతోంది. పాశ్చాత్య పోకడలతో, నవ్యత పేరిట మనిషి జీవన విధానంలో అసంబద్ధత చోటుచేసుకుంది. దీనివల్ల ఆరోగ్యం కూడా దూరం అవుతోంది. అందుకే ప్రస్తుతం యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం వచ్చింది. పురాతన భారతీయ ఆచార వ్యవహారాల్లో ముఖ్యంగా యోగాలోని సూర్యనమస్కారాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయని గ్రమించి మళ్లీ వాటిని అనుసరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సనాతన సంప్రదాయం నిత్య నూతన మనడానికి నేటి పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయనడంలో సందేహంలేదు.
తెల్లవారుజామున, తిరిగి సాయంత్రం వేళ సూర్యునికి ఎదురుగా నిలబడి దండం పేరిట కాసేపు నిలబడితే మంచే జరుగుతుందని నిరూపితమైన సత్యం. ఇలా చేయడం వల్ల సూర్యుని కాంతి నుంచి ప్రసరించే డి విటమిన్ సహజ సిద్ధంగా శరీరానికి అందుతుంది. తద్వారా ఎముకల పటుత్వం పెరిగి శారీరక బలం చేకూరుతుంది. చర్మం తేజోవంతం అవుతుంది. 12 భంగిమల్లో సూర్యనమస్కారం చేయడంతో దృఢత్వం రావడంతో పాటు అనేక రోగాలు మాయమవుతాయి.
సూర్యనమస్కారాలు అంటే..
సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయడం సూర్య నమస్కారం అంటారు. ఈ భంగిమ వల్ల మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
పాద హస్తాసనం
రక్తప్రసరణలో లోపాలు తగ్గి నాడీ మండల వ్యవస్థ ఉత్తేజితమై కడుపులోని అవయవాల సామర్థ్యం పెరుగుతుంది.
చతురంగ దండాసనం
కాళ్లు, చేతులు, భుజ కండరాలు దృఢపడి శరీర సౌష్టవం పెరుగుతుంది.
సాష్టాంగ నమస్కారం
గుండె కండరాలు బలోపితమై గుండె పనితీరు మెరుగై, హృదయ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
హస్త ఉత్తవాసనం
చేతులు, భుజంలో ఉండే కండరాలు బలోపితం అవుతాయి. వెన్నెముక నరాలు ఉత్తేజితమై ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. శ్వాస సంబంధిత రోగాలు తగ్గు ముఖం పడుతాయి.
ఏకప్రాద ప్రసరణ ఆసనం
కాళ్ల కండరాలు బలోపితమై నాడీమండలం అందించే సూచనలు ఆటంకాలు లేకుండా సంబంధిత ప్రదేశాలకు నిరాటంకంగా చేరుతాయి.
భుజంగాసనం
ఈ ఆసనం వల్ల వెన్నునొప్పి, ఉబ్బసం, సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి అనోరోగ్యాలు దూరమై ఆరోగ్యం కుదుటపడుతుంది.
పర్వాతాసనం
చేతులు, భుజాన్ని బలోపితం చేసి మెన్నెముక కండరాన్ని శక్తివంతం చేసి నడుం చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. మిగిలిన 4 ఆసనాలు తిరిగి మొదటి నుంచి ప్రారంభమవుతాయి. ఇలా 12 రకాల సూర్యనమస్కారాలను ఉదయం సూర్యోదయ సమయంలో చేయడం వలన భక్తితో పాటు ఆరోగ్యం కలుగుతుంది.
యోగా మనదే..
ఒంగోలు కల్చరల్: శరీరం, మనస్సుపై నియంత్రణ సాధించగలిగిన వారిని యోగులుగా వ్యవహరిస్తారు. ప్రాణాయామం, యోగాసనాలు, «ధ్యానంవంటి వాటిని భారతదేశం వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి కానుకగా అందచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కృషివల్ల ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుంచి పలు దేశాలు యోగ డే నిర్వహిస్తున్నాయి. ప్రపంచానికి యోగాను మరోసారి కానుకగా ఇచ్చిన ఘనత ఆధునిక కాలంలో మన దేశానికి కలిగింది. మోక్షసాధనకు,
భగవత్సాక్షాత్కారానికి యోగాభ్యాసం దోహదం చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్యపై పడిపోయిన భీష్ముడు చివరకు యోగమార్గంలో తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఏ మతానికి చెందిన వారైనా యోగాభ్యాసం, యోగాసనాలు సాధన చేయవచ్చని దీనిలో హిందుత్వాన్ని సూచించే ఓంకారాన్ని పలకవలసినవసరం లేదంటూ యోగాను అంతర్జాతీయంగా పరిచయం చేసేందుకు కొందరు కృషి చేశారు.
పలు శిక్షణ సంస్థలు
జిల్లాలో యోగ శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి. పతంజలి యోగ భారత్‌స్వాభిమాన్ ట్రస్ట్‌తో పాటు అరవింద సొసైటీ, వివేకానంద హఠయోగ కేంద్రం వంటి పలు సంస్థలు యోగ శిక్షణను అందచేస్తున్నాయి.
నేటి కార్యక్రమాలు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని గురువారం ఉదయం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే గురువారం సాయంత్రం 6 గంటలకు వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తాతా కల్యాణ మండపంలో యోగ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. వేద విజ్ఞాన పీఠం నిర్వాహకులు కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పతంజలి యోగ విశిష్టత గురించి ప్రసంగిస్తారు. పతంజలి యోగ సాధకులచే యోగాసనాల ప్రదర్శన, మనోన్మని విద్యార్థు«లచే నృతప్రదర్శనలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment