నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీ మోహన్‌రావు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి గ్రామం జోహర్‌బట్టి ప్రాంతానికి చెందిన ఎండీ ఫిరోజ్ అలియాస్ ఎండీ రహమాన్ అనే యువకుడు కొంతకాలంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలు చేస్తున్నాడు.
తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి అభరణాలు అపహరించేవాడు. ఇతనిపై జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు, రెండో టౌన్‌లో నాలుగు కేసులు, మూడో టౌన్ లో ఒక కేసు నమోదై ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసులో అరెస్టు అయి శిక్ష అనుభవించాడు.
మొత్తం ఎనిమిది కేసులలో 30 తులాల బంగారం దొంగతనం చేశాడు. పలు బంగారం దుకాణాల వద్ద నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం నిజామాబాద్ అజాం రోడ్డులో పట్టుకున్నారు. నిందితుడిని నుంచి రూ. 6లక్షల విలువ గల 18 తులాల బంగారు అభరణాలు, 65 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
Published Tue, Oct 22 2013 6:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement