‘హోదా’గళాలపై అసహనం
‘యువభేరి’కి బస్సులిచ్చారని 3 విద్యాసంస్థలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవారిపై ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే సభలు, సమావేశాలకు సహకరిస్తున్నారంటూ సంస్థలు, వ్యక్తులపై వేధింపు చర్యలకు దిగుతోంది. ఈనెల 19న విజయనగరంలో జగన్ నిర్వహించిన యువభేరి సదస్సుకు ప్రజలను తరలించేందుకు బస్సులు సమకూర్చారంటూ మూడు స్కూళ్లకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. విజయనగరంలోని భాష్యం స్కూల్, శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం స్కూలు, ద సన్ స్కూళ్లకు జిల్లా విద్యాధికారి షోకాజ్ నోటీసులు జారీచేశారు.
ప్రయివేటు విద్యాసంస్థలకు సంబంధించి విద్యాశాఖ జారీచేసిన జీవో నెంబర్ 1కి ఇది వ్యతిరేకమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందున ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపును ఎందుకు వెనక్కు తీసుకోరాదో తెలపాలంటూ ఆయా సంస్థలకు ఈనెల 20వ తేదీన నోటీసు జారీచేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తమ దగ్గరున్న ఆధారాలతో చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి ఆ నోటీసుల్లో హెచ్చరించారు.