సర్కారుపై దండయాత్ర | Invasion of government | Sakshi
Sakshi News home page

సర్కారుపై దండయాత్ర

Published Thu, Aug 27 2015 2:05 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

సర్కారుపై దండయాత్ర - Sakshi

సర్కారుపై దండయాత్ర

ధర్నాతో శ్రీకారం
♦ రాజధాని ప్రాంత రైతులకు కొండంత భరోసా
♦ బలవంతపు భూసేకరణ తగదన్న వైఎస్ జగన్
♦ ఉద్వేగంగా ఉరకలెత్తించిన రైతులు,నేతల ప్రసంగాలు
♦ 29న ప్రత్యేక హోదా బంద్ జయప్రదం చేయాలంటూ జగన్ పిలుపు
 
 వేల ఎకరాలు సమీకరించినా భూదాహం తీరని బాబు సర్కారు భూసేకరణకు దిగడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా ధర్నాతో దండయాత్రకు దిగారు. ఇటీవల ఆందోళనలకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారిన విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ముంగిట చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. తద్వారా రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా భూసేకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి హెచ్చరిక పంపినట్టయింది.
 
 సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని ప్రాంతంలో రైతుల కాళ్ల కింద భూమిని సర్కారు కనికరం లేకుండా లాగేసుకుంటోంది. కూలీలు, పేదల చేతిలో అన్నం ముద్ద భవిష్యత్‌లో ఉంటుందో లేదోనన్న భయందోళనకు టీడీపీ ప్రభుత్వం కారణమవుతోంది. ఇటువంటి కష్టకాలంలో మీకు అండదండగా నేనున్నానంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టిన ధర్నా ప్రభుత్వంపై దండయాత్రకు రాజధాని ప్రాంత వాసుల్ని సన్నద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వంపై పోరుకు వేలాది మంది సైనికుల్లా తరలివచ్చారు.

 రాజధాని ప్రాంత రైతులకు కొండంత భరోసా...
 గతంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో స్వయంగా పర్యటించి బాధితుల బాధలు, వ్యథలు తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల మంగళగిరి వేదికగా రెండు రోజులు సమరదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా బృందాలుగా పర్యటించి రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికే ప్రభుత్వం వేలాది ఎకరాలు సేకరించి మళ్లీ భూసేకరణకు పూనుకోవడంతో జగన్‌మోహన్‌రెడ్డి ధర్నాకు దిగి రాజధాని ప్రాంత రైతులకు కొండంత భరోసా ఇచ్చారు.

రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులను కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వమూ మనలేదని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల వద్ద తీసుకున్న భూమిని పువ్వుల్లో పెట్టి ఇస్తామని ప్రకటించడంతో రైతులకు ధీమా ఇచ్చినట్టు అయ్యింది. భూము లు ఇచ్చినవారు, ఇవ్వలేక భయందోళనలు చెందుతున్నవారందరికీ జగన్‌మాటలతో ధైర్యం వచ్చింది.

 29న బంద్ జయప్రదానికి పిలుపు...
 రైతుల కోసం చేపట్టిన ధర్నా వేదిక నుంచి ప్రజలకు ఈ నెల 29న బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బంద్ తన కోసం కాదని, రాష్ట్రంలోని యువత, ప్రజల కోసం అని తెలిపారు. యువతకు విద్య, ఉపాధి, రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు రావాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని, దాన్ని పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతకుముందు రైతులు, కూలీలు, నేతలు ఉద్వేగపూరితంగా మాట్లాడారు. రాష్ట్ర నేతలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ప్రసంగించారు. వారి మాటల్లో భూసేకరణపై ఆందోళన, రైతుల పరిస్థితిపై ఆవేదనతో పాటు చంద్రబాబు సర్కారుపై ఆక్రోశం పెల్లుబికింది. మొత్తానికి ధర్నాతో రాజధాని రైతులకు, ప్రజలకు కొండంత అండగా వైఎస్సార్‌సీపీ ఉందని చాటిచెప్పారు.

 పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు...
 భూసేకరణకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా చేపట్టిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కోన రఘుపతి, మహ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, పేర్ని నాని, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము, కార్యదర్శి కాజ రాజ్‌కుమార్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుట్టా రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, గుంటూరు జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, నా యకులు సింహాద్రి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్, దూలం నాగేశ్వరరావు,అరుణ్‌కుమార్, కావటి మనోహరనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement