బతుకు బౌల్డ్‌ | ipl betting in chittoor district | Sakshi
Sakshi News home page

బతుకు బౌల్డ్‌

Published Tue, Apr 25 2017 9:43 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

ipl betting in chittoor district

► జిల్లాలో జోరుగా క్రికెట్‌ బెట్టింగులు!
► రూ.10నుంచి వెయ్యి వరకు సాగుతున్న పందేలు
► నిమిషాల్లో చేతులు మారుతున్న నగదు
► బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో భారీగా జరిగిన బెట్టింగ్‌లు
► రోడ్డున పడుతున్న కుటుంబాలు

ఐపీఎల్‌  క్రికెట్‌ పుణ్యమా అని జిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు శ్రుతి మించాయి. నిమిషాల వ్యవధిలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్‌ ఉచ్చులో పడి యువత, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు, చిరు వృత్తులవారు చిత్తవుతున్నారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు సైతం ఈ జూదంపై ఆసక్తి చూపుతున్నారు.

పలమనేరు: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే నడుస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ సంస్కృతి నేడు మండల కేంద్రాలు, గ్రామాలకు సైతం వ్యాపించింది. క్రికెట్‌ గ్యాంబ్లింగ్‌పై సరైన చట్టాలు లేకపోవడంతో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. గత కొద్దిరోజులుగా ఐపీఎల్‌ క్రికెట్‌మ్యాచ్‌ సాగుతోంది. కొందరు టీవీల్లోనూ మరికొందరు  స్మార్ట్‌ ఫోన్‌లోనూ లైవ్‌ మ్యాచ్‌ను చూస్తూ బెట్టింగులకు పాల్పడుతున్నారు. బాల్‌ టు బాల్, ఓవర్‌ బై ఓవర్, ఎక్స్‌ట్రాస్, ఫోర్, సిక్స్, వికెట్‌.. ఇలారకరకాల బెట్టింగులు ప్రస్తుతం నిత్యకృత్యంగా మారాయి.

చిన్న జట్లపై మూడుకొకటి బెట్టింగ్‌లు వేస్తున్నారు. సాయంత్రం మ్యాచ్‌లకన్నా రాత్రి 8గంటలకు మొదలై 11కు ముగిసే మ్యాచ్‌లకే బెట్టింగ్‌లు ఎక్కువ. ఐపీఎల్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటుండగా హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, ముంబ యి టీమ్‌లపైనే భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. మొన్న జరిగిన బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో జిల్లాకు సంబంధించి రూ.30 లక్షలదాకా బెట్టింగ్‌లు సాగినట్టు  కర్ణాటకకు చెందిన ఓ బెట్టింగ్‌ బ్రోకర్‌ తెలిపాడు.

నలుగురు కలిస్తే బెట్టింగ్‌లే
క్రికెట్‌ బెట్టింగ్‌ చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, రోజువారీ పనులకేళ్లే వారు, ఆటోడ్రైవర్లు, చిరువృత్తులవారు ఈ మత్తులోనే వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు. వీరు ధరించిన బంగారు ఆభరణాలు, మొబైల్‌ఫోన్లు, బైక్‌లు సైతం పందెలో పోగొట్టుకుంటున్నారు.

ఇదిగో సాక్ష్యం
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరులలోపాటు మారుమూల గ్రామాల్లో సైతం బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం రహస్య ప్రదేశాలు, దాబాలు అడ్డాలుగా మారాయి. వీటి నిర్వహణ కోసం పదుల సంఖ్యలో ఏజెంట్లు, బుకీలు సైతం స్థానికంగా తతయారయ్యేరంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. మొత్తం ఫోన్ల ద్వారానే ఈ ముఠా కార్యకలాపాలను నడిపిస్తోంది. గెలిచినవారికి ఆన్‌లైన్‌లోనే నగదును జమచేస్తున్నారు. పోలీసులు బెట్టింగ్‌ జరిగే చోట్లకు వెళ్లినా ఎటువంటి ఆధారాలుండవు కాబట్టి వారు ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది.

ఆందోళనలో తల్లిదండ్రులు
క్రికెట్‌ జూదానికి బానిసలుగా మారిన ఎందరో యువకులను ఎలా దారిలో పెట్టాలో అర్థం గాని తల్లిదండ్రులు, ఇలాంటి వ్యసనానికి ఆలవాటు పడిన భర్తలను ఏం చేయాలో దిక్కుతోచని భార్యలు జిల్లాలో ఎందరో ఉన్నారు. కొందరైతే పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఏదేమైనా క్రికెట్‌ బెట్టింగులతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement