ఫోర్జరీ కేసులో ఉమేష్ కుమార్కు చుక్కెదురు
న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు ఎంఎ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఫోర్జరీ కేసులో ఉమేష్ కుమార్పై విచారణ నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే దిగువ కోర్టుకు చెప్పాలని ఉమేష్‌కుమార్‌ను ఆదేశించింది. డీజీపీగా దినేష్ రెడ్డిని నియమించడంతో 1977 బ్యాచ్‌కు చెందిన ఈ ఇద్దరు ఐపీఎస్ అదికారుల మధ్య గొడవ మొదలైంది.
దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిసిన వెంటనే ఉమేష్‌కుమార్ తన స్నేహితుడైన ఓ మాజీ జర్నలిస్టుతో కలిసి ఎంఎ ఖాన్ లెటర్‌హెడ్‌ను కొట్టేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దినేష్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ఒకరి మీద ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ కోర్టులకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినేష్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఉమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.