నిబంధనలకు మందొదిలారు
మళ్లీ లొల్లి అడ్డగోలుగా వైన్‌షాపుల ఏర్పాటు
గుడి, బడి నిబంధనలు కాగితాలకే పరిమితం
అనేక ప్రాంతాల్లో ఇళ్ల మధ్యే దుకాణాలు
వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు
అంతా సక్రమమే అంటున్న ఎక్సైజ్ అధికారులు
మద్యం షాపుల ఏర్పాటులో నిబంధనలకు నీళ్లొదిలారు. గుడి, బడికి 100 మీటర్లదూరం పాటించాలనే నిబంధనను
గాలికొదిలేస్తున్నారు. ఇళ్ల మధ్యే షాపులు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు
ఆందోళన బాట పడుతున్నారు.
విజయవాడ : జిల్లాలో వైన్ షాప్‌ల లొల్లి మళ్లీ మొదలైంది. ఇప్పటి వరకు షాపుల కోసం వ్యాపారుల మధ్య ప్రత్యక్ష పోరు సాగింది. అంతిమంగా లాటరీ ప్రక్రియతో షాపుల కేటాయింపు పూర్తవగా, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే దుకాణాలను ఇళ్ల మధ్య నుంచి తొలగించాలనే డిమాండ్‌తో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. షాపులు దక్కించుకున్న వ్యాపారులు గుడి, బడి నిబంధనలతో నిమిత్తం లేకుండా అడ్డగోలుగా షాపులు ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. ముఖ్యంగా విజయవాడలోనాలుగు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైన్ షాపులు తొలగించాలనే డిమాండ్‌తో ఉద్యమం మొదలైంది. జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది.
ఇష్టానుసారంగా దుకాణాల ఏర్పాటు...
మద్యం దుకాణాలను గుడి, బడి, చర్చి, మసీదు, ఆస్పత్రులకు 100 మీటర్ల లోపు దూరంలో ఏర్పాటు చేయకూడదనేది నిబంధన. దీనిలో అనేక సాంకేతికాంశాలు ఉండటంతో దానిని వ్యాపారులు పూర్తిగా గాలికొదిలేసి ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారుతోంది. జిల్లాలో 335 వైన్ షాపులకు గాను 33 షాపులను ఎక్సైజ్ శాఖ నేరుగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అంతా నూతన షాపులను ఏర్పాటు చేసే హడావుడిలో ఉన్నారు. షాపులు కేటాయించిన ప్రాంతాల్లో అద్దె షాపులు చూడటం మొదలుకొని అద్దె అగ్రిమెంట్ చేసుకొని మద్యం నిల్వలు తెప్పించి వ్యాపారం మొదలుపెట్టే కసరత్తులో ఉన్నారు. గురువారం జిల్లాలో 10 షాపులు ప్రారంభించారు. మిగిలిన 302 షాపులకు గాను లాటరీ ప్రక్రియలో వ్యాపారులు 294 దక్కించుకొని బుధవారం నుంచే వ్యాపారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాధారణంగా గుడికి, బడికి దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో ఇప్పటికే నాలుగు షాపులు ఇళ్ల మధ్య ఉండటంతో వాటిని తొలగించాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వారు విచారణకు ఆదేశించారు. ఇక జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు రాకపోవటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
జాతీయ రహదారుల పైనా...
జిల్లాలో 47వ నంబర్ జాతీయ రహదారి, జగదల్‌పూర్ జాతీయ రహదారి, 214 (ఎ) జాతీయ రహదారులు ఉన్నాయి. సుమారు జిల్లాలో 150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. గతంలో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు, పోలీసులు జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులకు అనుమతి ఇవ్వకుండా నిలుపుదల చేయాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. అప్పట్లో ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. జాతీయ రహదారుల వెంబడి ఉండే డాబాల్లో మద్యం అందుబాటులో ఉండటం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని రవాణా, పోలీసు శాఖల వాదన. అయితే అది తమ పరిధిలోని అంశం కాదని ఎక్సైజ్ అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మొదలుకొని జగ్గయ్యపేట వరకు పదికి పైగా వైన్ షాపులు జాతీయ రహదారి సమీపంలో ఉన్నాయి. జగదల్‌పూర్ జాతీయ రహదారి సమీపంలో కూడా సుమారు 15 వరకు వైన్ షాపులు ఏర్పాటుచేశారు.
ఎక్సైజ్ నిబంధనల్లో ఇలా...
గుడి అంటే దేవాదాయ శాఖ గుర్తింపు ఉన్న దేవాలయం. అంటే నగరంలో వంద ఆలయాలు ఉంటే 10 ఆలయాలకు మాత్రమే దేవాదాయ శాఖ గుర్తింపు ఉంటుంది. ఆస్పత్రి, పాఠశాలల విషయంలోనూ ప్రభుత్వ గుర్తింపు ఉన్నవాటికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. మసీదు అయిదే వక్ఫ్ బోర్డు గుర్తింపు, చర్చి అయితే దానికి గుర్తింపు ఉండాలి. అంటే కేవలం గుర్తింపు ఉన్న వాటికి 100 మీటర్ల దూరం పాటించాలి. ప్రభుత్వ షాపుల ఏర్పాటు హడావుడిలో ప్రస్తుతం తమ అధికారులు ఉన్నారని, రెండు రోజుల్లో ఫిర్యాదులు వచ్చిన షాపుల గురించి విచారణ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జ్ డెప్యూటీ కమిషనర్ బాబ్జీరావు ‘సాక్షి’కి తెలిపారు.