రూ.320 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్‌! | irregularities in pennar south canal modernisation tenders | Sakshi
Sakshi News home page

రూ.320 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్‌!

Published Sun, Apr 9 2017 7:55 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

irregularities in pennar south canal modernisation tenders

మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ టెండర్ల బరిలోకి దిగిన  9 సంస్థలు
బరిలో నుంచి తప్పుకోవాలని ఏడు సంస్థలను బెదిరిస్తున్న ‘అనంత’ ఎంపీ
ఏడు సంస్థలు వెనక్కి తగ్గకపోవడంతో రంగంలోకి దిగిన ‘ముఖ్య’నేత
వాటిపై ‘అనర్హత’ వేటు వేయాలని హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి


సాక్షి, అమరావతి: మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునీకరణ పనుల్లో ఇద్దరు ఎంపీల మధ్య విభేదాలను సెటిల్‌ చేసి, రూ.320.26 కోట్లు కాజేసేందుకు వేసిన ఎత్తును ఏడు సంస్థలు చిత్తు చేసేందుకు సిద్ధమవడంతో ‘ముఖ్య’నేత రగలిపోతున్నారు. బరిలో నుంచి తప్పుకోవాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీ ఒత్తిడి చేయగా ఆ సంస్థలు లెక్కచేయలేదు. దీంతో వాటిపై అనర్హత వేటు వేయాలంటూ హెచ్చెల్సీ అధికారులకు ‘ముఖ్య’నేత హుకుం జారీ చేశారు. అందుకే టెండర్‌ షెడ్యూల్‌ గడువు ముగిసినా కనీసం టెక్నికల్‌ బిడ్‌ను కూడా ఖరారు చేయలేకపోతున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అంచనా విలువ రూ.421.87 కోట్లకు పెంపు
మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునీకరణలో కేవలం రూ.101.61 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. వీటి అంచనా విలువను రూ.421.87 కోట్లకు పెంచేసి, పనులను సన్నిహిత కాంట్రాక్టర్‌కు అప్పగించి, రూ.320.26 కోట్లు కొట్టేయడానికి ‘ముఖ్య’నేత స్కెచ్‌ వేశారు. ఆ మేరకు కేవలం 2 సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించి, ఫిబ్రవరి 3న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ టెండర్లలో పర్సంటేజీలు పంచుకునే విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీకి, ‘ముఖ్య’నేత కోటరీలోని రాజ్యసభ సభ్యుడికి మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ విభేదాలను పరిష్కరించలేక టెండర్‌ గడువును మూడుసార్లు పొడగించారు. ఇద్దరు ఎంపీల మధ్య విభేదాలను ముఖ్యనేత ఇటీవల పరిష్కరించారు. దీంతో మార్చి 30న టెక్నికల్‌ బిడ్‌ను తెరిచారు. ‘ముఖ్య’నేత సూచించిన 2 సంస్థలతోపాటు మరో 7 సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి.  బరిలో నుంచి తప్పుకోవాలంటూ ఈ ఏడు సంస్థలను అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీ బెదిరించారు. కానీ, ఆ సంస్థలు తప్పుకోపోవడంతో ‘ముఖ్య’నేత రంగంలోకి దిగారు.

పాత కేసులు తవ్వి తీస్తున్న వైనం
తమ మాట వినని ఏడు సంస్థలపై ఎలాగైనా అనర్హత వేటు వేయాలంటూ హెచ్చెల్సీ అధికారులపై ‘ముఖ్య’నేత ఒత్తిడి తెస్తున్నారు. ఆ సంస్థలు గతంలో చేసిన పనులను పరిశీలించి, ఏదో ఒక సాకు చూపించి, వాటిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని హుకుం జారీ చేశారు. దాంతో ఆ ఏడు సంస్థలు చేసిన పనులు, నాణ్యత, విజిలెన్స్‌ కేసుల పూర్వాపరాలను తవ్వితీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 1న ప్రైస్‌బిడ్‌ తెరవాలి. కానీ, టెక్నికల్‌ బిడ్‌ను ఇప్పటికీ ఖరారు చేయకపోవడంతో ప్రైస్‌ బిడ్‌ను తెరవడాన్ని వాయిదా వేశారు.

జీబీసీ ఆధునీకరణ టెండర్లు మళ్లీ పొడగింపు
మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునీకరణ పనుల్లో ఇద్దరు ఎంపీల మధ్య కుదిర్చిన రాజీ ఫార్ములా మేరకు.. రూ.225.57 కోట్లతో చేపట్టిన గుంతకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ) ఆధునీకరణ పనులను తన కోటరీలోని ఎంపీకి కట్టబెట్టేందుకు ‘ముఖ్య’నేత అంగీకరించారు. మధ్య పెన్నార్‌ ఆధునీకరణ టెండర్లు ఖరారు కాకపోవడంతో జీబీసీ టెండర్ల గడువును మళ్లీ పొడగించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10వ తేదీ వరకూ షెడ్యూళ్లను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. టెక్నికల్‌ బిడ్, ప్రైస్‌ బిడ్‌ ఎప్పుడు తెరుస్తారన్నది గోప్యంగా ఉంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement