
'అనంత రైతులకు సాగు నీరు ఇవ్వండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలోని తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఉన్న ఆయకట్టకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురంలో మాట్లాడుతూ.. హెచ్ఎల్సీ, జీబీసీలో భారీగా నీరు ఉన్న... సాగు నీరు విడుదల చేయకపోవడంపై ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ రెండు కాలువల కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలలో సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతులు ఆందోళన బాట పడతారని హెచ్చరించారు.