బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపే పూర్తిచేయాలన్న నిబంధన ఉంది. జిల్లాలోని అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ రెవెన్యూ శాఖలో మాత్రం ఇప్పటివరకు పూర్తి కాని పరిస్థితి. ప్రస్తుతం నిర్వహించిన బదిలీల్లో అవకతవకలు, చేతివాటం జరిగిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బదిలీల తీరును చూసి తోటి రెవెన్యూ సిబ్బందే ముక్కున వేలు వేసుకుంటున్నారు. అదేవిధంగా డీటీల పదోన్నతుల్లో కూడా అవకవతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెవెన్యూ బదిలీలు పూర్తయిపోయాయి. అయితే ఈ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు బదిలీలు పూర్తి కాని దుస్థితి. కలెక్టరేట్ అధికారులు నిబంధనలను పాటించకపోవడం, ఇష్టానుసారంగా బదిలీల పోస్టింగ్‌లు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. దీంతో ఇప్పటికీ రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు బదిలీలు పూర్తికాని పరిస్థితి. కలెక్టరేట్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లాలో రెవెన్యూ బదిలీలు ఎప్పటికి పూర్తవుతాయో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.
పాత తేదీలు వేసి..
బదిలీల ఉత్తర్వుల్లో పాత తేదీలు వేసి, రోజుకో ఉత్తర్వులను విడుదల చేస్తున్నారు. కలెక్టరేట్ అధికారులు రోజుకో ఉత్తర్వులను విడుదల చేస్తుండడంతో ఉద్యోగుల్లో గందరగోళం మొదలైంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చిన వారికి, ఇష్టానుసారంగా పోస్టింగ్‌లను కేటాయిస్తున్నారు. బదిలీలకు గడువు ముగిసి 15 రోజులవుతోంది. అయితే ఇప్పటికీ బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం జిల్లా యంత్రాంగం వైఫల్యమేనని తెలుస్తోంది.
పదోన్నతుల్లో అవకతవకలు
జిల్లాలోని సీనియర్లుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు డీటీలుగా పదోన్నతి కల్పించారు. అందులో మొదటి విడతలో 34 మందికి, ఈ నెల 25న 20 మందికి డీటీగా పదోన్నతులు ఇచ్చారు. ఈ పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24న ఇచ్చిన పదోన్నతుల్లో పలమనేరులో ఆర్‌ఐగా పనిచేస్తున్న రిషివర్మకు పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే ఆయనకంటే జూనియర్ అయిన సోమల ఆర్‌ఐ బాబ్జికి పదోన్నతి కల్పించారు. ముడుపులు తీసుకుని అర్హత లేనివారికి పదోన్నతులు కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై రిషివర్మ శుక్రవారం కలెక్టరేట్‌లోని అధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు బాబ్జిని సంప్రదించి తన పదోన్నతిని వెనక్కి తీసుకుంటున్నానని లిఖితపూర్వకంగా రాసిఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కలెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం చేస్తున్న తప్పిదాలకు అర్హులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ బదిలీలను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పారదర్శకత లోపం
రెవెన్యూ బదిలీల్లో పారదర్శకత ఏమాత్రం లేదని కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బదిలీలకు అర్హత ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి చేపట్టాల్సిన బదిలీలు తమకు ఇష్టమొచ్చినట్లు నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ముడుపులు స్వీకరించి పోస్టింగులిస్తున్నారనే చర్చ మొదలైంది. గత 15 రోజులుగా బదిలీలు పూర్తికాకపోవడంతో దాదాపు 700 మంది పలు కేడర్ల ఉద్యోగులు ఎటూ కాకుండా గాల్లో ఉన్నారు. జిల్లా యంత్రాంగం చేసిన తప్పిదాలకు ఆ ఉద్యోగులకు బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు జీతాన్ని ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment