గోవిందా.. వసూళ్ల దందా! | Irregularities In The TTD Scouts And Guides | Sakshi
Sakshi News home page

గోవిందా.. వసూళ్ల దందా!

Published Mon, Jul 22 2019 9:06 AM | Last Updated on Mon, Jul 22 2019 9:06 AM

Irregularities In The TTD Scouts And Guides - Sakshi

టీటీడీ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. అర్హత లేనివారిని అందలం ఎక్కిస్తున్నారు. శిక్షణ ఇచ్చినట్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దొడ్డిదారిలో తిరుమల శ్రీవారి సేవకులుగా నియమిస్తున్నారు. అడ్డదారుల్లో వసూళ్ల దందా సాగిస్తున్నారు. ఇందులో కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులు, మాజీ సీఎం బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ విషయాలపై విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చినట్లు తెలుస్తోంది. అయినా సంబం ధిత టీటీడీ, విద్యాశాఖ అధికారులు ఇంతవరకు నోరుమెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

సాక్షి, తిరుపతి : చిన్నారుల ఉజ్వల భవిష్య త్తు, ఉన్నత విలువలు పెంపొందించేందుకు తోడ్పడే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థను జిల్లాలో రెండు విభాగాలుగా ఏర్పాటు చేశారు. తిరుమలలో సేవల నిమిత్తం 1968లో టీటీడీ జిల్లా స్కౌట్స్‌ సంఘం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఒక నిబంధన ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో స్కౌట్స్‌ అధికారుల తీరు మరోలా ఉంది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనాలంటే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. తిరుపతి అర్బన్‌ పరిధిలోని 33 మండలాలకు చెందిన వారు మాత్రమే టీటీడీ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు అర్హులు.  నిర్వాహకులు ఈ నిబంధనను తుంగలో తొక్కేశారు. ఇతర జిల్లాకు చెందిన వారిని మాత్రమే తీసుకుంటున్నారు. పైగా వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే సేవలను వినియోగించుకుంటున్నారు. స్కౌట్‌ మాస్టర్స్‌ను వినియోగించాల్సి ఉన్నప్పటికీ వారికి ఇష్టమొచ్చిన వారిని రిక్రూట్‌ చేసుకుని పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు.

ఆధార్‌లో అడ్రస్‌ గల్లంతు
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నిర్వాహకులు కొందరు అర్హత లేకున్నా డబ్బులు తీసుకుని ఆధార్‌లో అడ్రస్‌లను మార్చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేకున్నా శిక్షణ ఇచ్చినట్లుగా సర్టిఫికెట్స్‌ జారీ చేస్తున్నారు. తర్వాత వారిని స్కౌట్‌ సేవకు పంపిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పైగా రిటైర్డ్‌ ఉద్యోగుల కనుసన్నల్లో స్కౌట్స్‌ సేవలు నడుస్తున్నాయి. ఎలాంటి శిక్షణ లేని, అనర్హులు టీటీడీ స్కౌట్స్‌లో తిష్ట వేసి ఉన్నా రు. నిర్వాహకులు కొందరు ఆధార్‌ కార్డుల్లో అడ్రస్‌లు మార్పు చేసి మరీ శ్రీవారి స్కౌట్స్‌ సేవలకు నియమిస్తున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి ఎలాంటి శిక్షణ లేకుండా స్కౌట్‌ సేవలకు అర్హత లేని వారిని నియమించి లబ్ధిపొందుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్కౌట్స్‌ స్టేట్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర సెక్రటరీ రామ్మెహన్‌రావు లాలూచీతో టీటీడీ స్కౌట్స్‌ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు సమాచారం.

శిక్షణ లేకున్నా..వారంలో సర్టిఫికెట్స్‌ జారీ
పైసలిస్తే... స్కౌట్స్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చేస్తున్నారు. లైఫ్‌ టైం సర్టిఫికెట్స్‌కు రూ.2,500, సాధారణ సర్టిఫికెట్‌కు రూ.1200 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఇలా వందలాది మంది నుంచి డబ్బులు వసూళ్లు చేసుకుని సేవకులుగా నియమిస్తున్నారు. వారం రోజులు తిరుమలలో స్కౌట్స్‌ శ్రీవారి సేవ అంటూ...ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలో ఏజెంట్ల ద్వారా యువతీయువకులను తిరుమలకు తరలిస్తున్నారు. వారికి ఎలాంటి శిక్షణ ఉండదు.. అప్పటికప్పుడు శిక్షణ సర్టిఫికెట్స్‌ ఇచ్చిపంపిస్తున్నారు. ఆ సర్టిఫికెట్స్‌లో పాత తేదీల్లో శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్స్‌ జారీ చేయడం చకచకా జరిగిపోతోంది. శ్రీవారు అంటే భక్తి ఉన్న వారు.. కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నవారు.. వారం రోజుల పాటు తిరుమలలో ఉన్న తమకు చాలు అనుకునే వాళ్లు.. సేవ ముసుగులో ప్రతి వారం తిరుపతి టీటీడీ స్కౌట్స్‌ జిల్లా కార్యాలయానికి చేరుకోవడం దొంగ సర్టిఫికెట్స్‌ చూపించడం, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో రిజిస్టర్‌ చేసుకుని తిరుమలకు చేరుకోవడం ఇట్టే జరిగిపోతోంది.

దొడ్డిదారిలో శ్రీవారి దర్శన భాగ్యం
తిరుమలలో శ్రీవారిని 40–70 అడుగులు దూరం నుంచి క్షణకాల దర్శనం కోసం ఎదురుచూసే భక్తులు లక్షల మంది ఉన్నారు. స్కౌట్‌ సేవల పేరుతో కొందరు దొడ్డి దారిలో వీ.ఐ.పీ బ్రేక్‌ దర్శనం సమయంలో, ఆర్జిత సేవల్లో శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వహించడం కోసం పోటీపడుతున్నారు. 4 గంటలు పాటు స్వామి సన్నిధిలో డ్యూటీ కోసం.. స్కౌట్‌ సేవకు ఎగబడుతున్నారు. ఆనందనిలయం సన్నిధిలో డ్యూటీ కోసం ఇక్కడ పోటీ పడి సేవకు సిద్ధమవుతున్నారు. టీటీడీలో పనిచేసే వారికీ దక్కని స్వామి సేవ స్కౌట్‌ ముసుగులో ఇక్కడ తిష్టవేస్తున్నారు. స్కౌట్స్‌ సేవల్లో పాల్గొన్న వారికి టీటీడీ భోజన వసతితో పాటు బస్‌ పాస్‌లు.. సేవ ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక్కొక్కరికీ మూడు లడ్డూలు అందిస్తుంది. 

నిద్దరోతున్న టీటీడీ విద్యాశాఖ 
తిరుమలలో సేవ కోసం వచ్చిన వారిలో ఎక్కువ మంది ఎలాంటి శిక్షణ లేని వాళ్లని తెలిసినా.. టీటీడీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. వారికి కావాల్సిందల్లా శ్రీవారి సేవకులు. అందు కోసం నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. టీటీడీ స్కౌట్స్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు తిష్టవేసి మరీ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర కమిషనర్‌ రెండు నెలలు క్రితం నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీచేశారు. కానీ వాటికి వక్రభాష్యం చెబుతూ సరికొత్త దారుల్లో స్కౌట్స్‌ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. 

ఎన్నికలు నిర్వహించరే..!
చిత్తూరు జిల్లా స్కౌట్స్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. టీటీడీ పరిధిలో స్కౌట్స్‌ మాస్టర్స్‌తో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అన్నీ తానై వ్యవహరించే రిటైర్డ్‌ ఉద్యోగులు అడ్డుపడుతున్నారు. ఎన్నికలు నిర్వహించమని రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేసినా మాజీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. టీటీడీ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో జరుగుతున్న తీరుపైన రాష్ట్ర కమిషనర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. టీటీడీ విజిలెన్స్‌ అధికారుల నుంచి నివేదిక కూడా తెప్పించినట్లు సమాచారం. సర్టిఫికెట్స్‌కు వేలకు వేలు బేరం ఆడిన ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా.. టీటీడీ ఉన్నతాధికారులు, విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక స్కౌట్‌ మాస్టర్‌లు, ఆర్గనైజర్‌లు న్యాయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement