మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు తప్పుడు పద్ధతుల్లో నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి విద్యాశాఖను బురిడీ కొట్టించి డబ్బు డ్రాచేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదేశాలు జారీచేసినా విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు. వారి మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొందరు ఉపాధ్యాయులు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించి జిల్లాలో రూ.23.97లక్షలు స్వాహాచేసిన విషయం తెలిసిందే.
ఈ అవినీతి వ్యవహారం 2010 అక్టోబర్‌లో బయటపడటంతో అప్పట్లో వారిపై సస్పెన్షన్ వేటువేశారు. 34మంది ఉపాధ్యాయుల్లో ఇప్పటికే 9 మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ కాగా మరో 25మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారినుంచి డబ్బులు రికవరీ చేసిన అనంతరం 2011 జూన్ 18న వారికి తిరిగి పోస్టింగ్స్ ఇచ్చారు.
ఇందులో భాగంగానే ఎన్.మధుసూదన్‌రెడ్డి, కె.అంజ్య, పి.హన్మంతు, ఎల్. రామచంద్రయ్య, పి.నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, నాగేందర్, డి.గోపాల్, కె.రవీందర్, జె.ప్రవీణ్‌కుమార్, డి.నరసింహులు,ఆర్.క్రిష్ణ, ఆర్.రామచంద్రుడు, ఎం.వనిత, ఆయూబ్, ఆర్.రాజేందర్, బి.శంకర్, సాయులు, డి.దామోదర్‌రెడ్డి, వి.భాను చందర్ తదితరులు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించి డబ్బులు స్వాహా చేశారనే ఆరోపణలు రావడంతో వారి నుంచి ఇప్పటికే డబ్బులు రికవరీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో నకిలీ బిల్లులు సమర్పించినట్లే రాష్ట్రంలోని కౄ్ణ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పలువురు ఉపాధ్యాయులు నకిలీ వైద్యబిల్లులు సమర్పించి డ్రా చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు
. అయితే 34 మంది ఉపాధ్యాయులు తప్పుడు బిల్లులు సమర్పించి అక్రమంగా డబ్బు దండుకున్న వారిని గతంలో సస్పెండ్ చేసి డబ్బు రికవరీ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారు.
చర్యలకు విద్యాశాఖ వెనకడుగు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో తప్పుడు బిల్లులు సమర్పించిన 34 మంది టీచర్లపై సెప్టెంబర్ 22వ తేదీలోగా క్రిమినల్ కేసులు నమోదుచేయాలని విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ జి.వాణిమోహన్ నుంచి గతనెల 21న అర్జెంట్, పర్సనల్ అడెన్షన్ పేరిట జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ నుంచి ఆదేశాలు వచ్చి 14 రోజులైనా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. క్రిమినల్ కేసులునమోదు చేయకుండా రక్షించేందుకు ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. ఓ వైపు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకోవడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వెనకడుగు వేయడం వెనక మతలబు ఏమిటని పలువురు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ విద్యాశాఖ అధికారుల్లో చలనం కలగకపోవడంతో ఈ తతంగం వెనక డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కేసు నమోదుకు చర్యలు: డీఈఓ
బాధ్యులైన టీచర్లపై క్రిమినల్ కేసులు నమోదుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. కాగా సెప్టెంబర్ 22వ తేదీలోపు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని వివరణగా కోరగా వాటికి సరైన సమాధానం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పారు.
అక్రమార్కులకు అండదండలు
Published Sun, Oct 6 2013 3:35 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement