విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు.. పాఠశాల స్థాయి నుంచే బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల నిర్వహణ సందిగ్ధంలో పడింది. గ్రామీణపేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2009లో మోడల్ స్కూళ్లు ప్రారంభించింది. ఎంతో ఆర్భాటంగా నెలకొల్పిన ఈ విద్యాలయాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గతేడాది ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో కేవలం ఏడుచోట్ల మాత్రమే తరగతులు జరుగుతున్నాయి.
సాక్షి, మహబూబ్‌నగర్: మోడల్ స్కూళ్ల నిర్వహణ కోసం 70శాతం కేంద్రం, 30శాతం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. వీటి నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్రప్రభుత్వం ఈ బడ్జెట్‌లో స్పష్టీకరించింది. అయితే కేంద్రం ఆలోచన కారణంగా రాష్ట్ర సర్కారు సంకటస్థితిని ఎదుర్కొనుంది. అక్షరాస్యతపరంగా వెనకబడి న మహబూబ్‌నగర్ జిల్లాలో మోడల్ స్కూళ్ల పరిస్థితి ఇప్పటి అధ్వానంగా మారింది. జిల్లాలో 64 మండలాలు ఉంటే పట్టుమని పది స్కూళ్లు కూడా కొనసాగడంలేదు. జిల్లాకు మొదటి, రెండు విడతల్లో 47 స్కూళ్లు మంజూరయ్యాయి. అయితే వీటిలో ఏడు పాఠశాలల్లో మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. వీటిలో హాస్టల్ వసతి కూడా లేదు. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ వారి స్వస్థలాలకు లేదా స్థానికంగా అద్దెకు గదులు తీసుకుని చదువులు సాగిస్తున్నారు. మిగతా 40 స్కూళ్ల పరిస్థితి చూస్తే మరింత అధ్వానంగా మారింది. వీటిలో చాలావరకు భూసేకరణ కూడా జరగలేదు. అన్ని అనమతులు లభించిన వాటికి త్వర లో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వీటి పరిస్థితి ఏంటనేది రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ)కు అర్థం కావడం లేదు.
ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. 7స్కూళ్లలో రెండింటికీ పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ లేరు. ఇక అధ్యాపకుల విషయానికొస్తే మంజూ రైన వాటిలో సగం వరకు ఖాళీలే దర్శనమిస్తున్నాయి.
ఏడు స్కూళ్లకు పీజీటీ లు, టీజీటీలు మొత్తం 140 పోస్టులు మంజూరు కాగా, అందులో 67ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగు 13, ఇంగ్లిషు 16, హిందీ ఆరు, గణితం 14, సైన్స్ 10, సోషల్ సబ్జెక్టులకు ఎనిమిది పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి.
సీఎం కే.చంద్రశేఖర్‌రావు కేజీ టు పీజీ విద్య అందిస్తామని ఎన్నికల హామీల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకు ఆంగ్లంలో విద్యాబుద్ధులు నేర్పించాలనే ఆలోచనతో ప్రతి మండలంలో ఒక రెసిడెన్షియల్ స్థాయి స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. అందుకు అనుగుణంగా మోడల్ స్కూళ్లను ఉపయోగించుకోవాలని కేసీఆర్ సర్కారు ఆలోచన చేసింది. వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ విద్యాపథకాన్ని అమలుచేయాలని యోచిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర సర్కారు సంకటస్థితిని ఎదుర్కొనుంది.
సందిగ్ధంలో ఆదర్శ పాఠశాలల నిర్వహణ
Published Mon, Mar 2 2015 1:41 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement