శుక్రవారం జిల్లాలో ఎక్కడ చూసినా మొక్కలతో జనం సందడి కనిపించింది. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని మండలాల్లో మొక్కలు నాటారు. ఇళ్లు.. పాఠశాలలు.. ప్రభుత్వ కార్యాలయాలు పచ్చని మొక్కలతో కళకళలాడాయి. అంతటా పచ్చదనం పరుచుకుంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో హరితహార కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. పాలమూరు జిల్లాను పచ్చని వనంలా తీర్చిదిద్దాలని అధికారుల లక్ష్యానికి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం, ప్రజల ప్రోత్సాహం లభించింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కొల్లాపూర్‌లోని నీటిపారుదల శాఖ అతిథి భవనంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మొక్కలు నాటి హరితహారం ప్రాధాన్యతను వివరించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కొల్లాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించిందని మొక్కల పెంపకం ద్వారానే మానవజాతి మనుగడ ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. భావితరానికి ఈ హరితహారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్‌లోని బీసీ బాలికల వసతిగృహం, అగ్నిమాపక కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించరాదన్నారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృత రీతిలో ప్రచారం చేయడం ద్వారా జిల్లాలో హరితహారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపుదల ప్రజల చేతుల్లోనే ఉందని.. సమృద్ధిగా వర్షాలు పడాలన్నా, ఆహ్లాదకర వాతావరణం రావాలన్న మొక్కలు నాటాలన్నారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా హరితోద్యమానికి నాయకత్వం వహించేలా ఉండాలన్నారు. పాలమూరు హరితవనంగా విలసిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రాంకిషన్, డీఆర్‌ఓ భాస్కర్ తదితరులు మొక్కలు నాటారు. అలాగే మహబూబ్‌నగర్ పట్టణంలోని భగీరథకాలనీ, పాలమూరు యూనివర్సిటీల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కొత్తూరు మండలం చేగూర్‌లోని రామచంద్రమిషన్‌లో జిల్లా కలెక్టర్ శ్రీదేవి మొక్కలు నాటారు. జడ్చర్లలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్‌లు మొక్కలు నాటారు.
జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ద్వారా లక్ష మొక్కలను నాటి సంరక్షించేందుకు పోలీసులు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిన్నచింతకుంట మండలంలో మొక్కలు నాటారు. తొలిరోజు జిల్లాలోని గ్రామ, మండల, నియోజకవర్గ కేంద్రాలతో సహా దాదాపు లక్షన్నరకు పైగా మొక్కలు నాటారు.
హరిత తోరణం
Published Fri, Jul 3 2015 11:47 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement