సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీస్ వెపన్‌తో రెండుసార్లు కాల్పులు జరిపారు.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి ఎలా ఫైరింగ్ చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రి కాల్పులు జరిపిన ఆయుధం ఎస్‌ఎల్‌ఆర్ అని ముందు ప్రచా రం జరిగింది. ఆ తర్వాత ఇన్సాస్ వెపన్ అని పోలీస్ అధికారులు చెప్పారు.
దీనిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘సాక్షి‘తో మాట్లాడుతూ తాను ఎవరి వద్దా గన్ తీసుకోలేదని, ఎస్పీనే స్వయంగా ఇస్తే కాల్చానని వివరణ ఇచ్చారు. గతంలో వరంగల్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఫైరింగ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాల్చానన్నారు.
ఆ అధికారం నాకుంది: ఎస్పీ
దీనిపై మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లును ఫోన్‌లో సంప్రదించగా బుల్లెట్లు లేని బ్లాంక్ అమ్యూనేషన్‌ను ఉత్సవాల సందర్భంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఉపయోగించింది ఎస్‌ఎల్‌ఆర్ వెపన్ కాదు.. దేశీతయారీ ఇన్సాస్ వెపన్. దీనికి అనుమతి ఇచ్చే అధికారం ఎస్పీగా నాకు ఉంది. ప్రభు త్వం ద్వారా నిర్వహించే ఉత్సవాలు, ర్యాలీ లు, క్రీడల ప్రారంభ సమయంలో బ్లాంక్ అమ్యునేషన్‌ను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది.
బ్లాంక్ అమ్యునేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీటిని వినియోగించడం చట్టబద్ధమే’ అని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని చెప్పారు. ఈ నెల 11న వరంగల్‌లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఇన్సాస్ బ్లాంక్ అమ్యునేషన్ మాత్రమే వినియోగించినట్లు ఒక ప్రకటనలో వివరించారు. తుపాకీని మంత్రి వినియోగించారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారులపై చర్యలు ఉంటాయని పోలీస్‌శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విచారణ జరుపుతున్నాం: అదనపు డీజీపీ జితేందర్
మంత్రి గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై పోలీస్ శాఖ విచారణ జరుపుతోందని శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.
అది గిట్టని వారి ప్రచారం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
‘ఫ్రీడం ర్యాలీ’ ఘటనపై మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ శనివారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలోనూ తనపై ఈ తరహా దుష్ప్రచారాలు అనేకం జరిగాయని, రాజకీయంగా గిట్టనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. ‘ర్యాలీలు జరిగినప్పుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ (ఖాళీ తుపాకీ)తో గాల్లోకి కాల్చడం సర్వసాధారణం.
బుల్లెట్లు లేని గన్ పేల్చినప్పుడు శబ్దం మాత్రం వస్తుంది. అందులో కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉండవు. జిల్లా ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉంది. నేను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని కూడా. తుపాకులు, బుల్లెట్ల గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది’ అని శ్రీనివాస్‌గౌడ్ వివరణ ఇచ్చారు. ‘క్రీడా శాఖ మంత్రిగా నాకు కొన్ని అధికారాలున్నాయి.
వరంగల్‌లో లేని వివాదం మహబూబ్‌నగర్‌లో ఎందుకు వచ్చిందో గమనించాలి. రాజకీయాల్లో నేను ఎదగడాన్ని కొందరు ఓర్చుకోలేక పోతున్నారు. వజ్రోత్సవాలను హైలైట్ చేయకుండా చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరిస్తున్నారు. బురద జల్లే పద్ధతి సరికాదు’ అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాగా, రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయినా, స్పోర్ట్స్ మంత్రి అయినా.. ఇన్సాస్ రైఫిల్‌ను జనాల్లో ఫైర్ చేయడం తప్పని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment