నిన్నటి వరకూ ‘రూలంటే రూలే’ అని బిగుసుకున్న అధికార యంత్రాంగం ఇప్పుడు వాటిని గట్టుమీద పెట్టి బిల్లులను క్లియర్‌చేసే పనిలో పడింది. ఇప్పటి వరకూ వాటితో మాకేటి సంబంధం అని అటువైపే చూడని నేతాశ్రీలు ఎన్నికల సైరన్ మోగనుండడంతో ‘ వామ్మో ఎంత అన్యాయం...మీరిలా కొర్రీలు ఏస్తే వారేం కావాలి..నో పనికానిచ్చేయండి’ అంటూ అధికారుల వెంట పడుతున్నారు. ఇన్నాళ్లూ ఆఫీసుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులు కాస్త కుదుటపడుతున్నారు. ఇదీ జిల్లాలో చేపట్టిన వ్యక్తిగత గృహస్థ మరుగుదొడ్ల పథకం తీరు. ఎలక్షణాల్లో మారిన సీను.
సాక్షి,మహబూబ్‌నగర్: నాగరికతకు చిహ్నంగా చెబుతూ...నిత్యం రకరకాల ప్రకటనలతో ప్రచారానికి ఎక్కిన ‘వ్యక్తిగత గృహస్థ మరుగుదొడ్ల’ నిర్మాణ పథకం నిన్నటి వరకూ రకరకాల కారణాలతో మందకొడిగా సాగింది. ఇప్పుడు ‘ఎలక్షణాలు’ ముంచుకు వస్తుండడంతో దీన్ని మనం ఎందుకు వినియోగించుకోకూడదూ ఇది కూడా ఓట్లు కురిపించే తురుపుముక్కే కదా అని తాజాగా నాయకులు రంగంలోకి దిగారు.
లెక్కలు,గిక్కలు జాన్తానై ముందు కట్టినోళ్లకు కట్టినంత బిల్లులు ఇచ్చేయండంటూ అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. లబ్ధిదారుల బాధను తమ భుజానకెత్తుకొని తెగ హంగామా చేస్తున్నారు. వాస్తవానికి సాంకేతికంగా ఈ పథకానికి ఎదురవుతున్న ఇబ్బందులను వాస్తవంగా గుర్తించి న్యాయం చేయాలని లబ్ధిదారులు ఎప్పటినుంచో కోరుతున్నా పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో తెగ హడావుడి ృష్టిస్తున్నారు.
పలురీతుల్లో నిధులు...
ప్రభుత్వం పంచాయితి రాజ్,గామీణాభివృద్ది సంయుక్త శాఖల అధ్వర్యంలో జిల్లాలో ఈ పథకాన్ని 2012 ఆగస్టులో ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సన్నకారురైతు,వ్యవసాయ కూలీల కుటుంబాలు వ్యక్తిగత గృహస్థ మరుగు దొడ్లను నిర్మించుకొనేందుకు లబ్ధిదారునుని వాటా ధనం రూ.900 కలుపుకొని రూ.10,000ల వంతున యూనిట్ ధరగా నిర్ణయించారు. ఈ నిధులు కూడా వివిధ పథకాల ద్వారా కేటాయింపులు చేసినవే. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3200, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1400, ఉపాధిహామీ పథకం ద్వారా రూ.4500 లబ్ధిదారునికి చెల్లిస్తున్నారు.
పథకం నిబంధనల ప్రకారం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం ముగ్గుపోసి గుంతలు తీసి రింగులు వేశాక రూ.2235, ఆన్‌లైన్ ద్వారా అందజేస్తారు. నిర్మాణం పూర్తయ్యాక మిగతా మొత్తాన్ని అందజేస్తున్నారు.
వాస్తవానికి భిన్నంగా...
ఈ నిర్మాణాలకు మంజూరు చేస్తున్న నిధులు మార్కెట్ ధరలతో పోలిస్తే కేటాయింపులకు, వ్యయానికీ వ్యత్యాసం ఉంటోంది. నిబంధనల ప్రకారం మూడున్నర అడుగుల వెడల్పు, నాలుగు ఫీట్ల లోతుతో రెండు గుంతలను తీయాల్సి ఉంటుంది. వాటిలో ఎనిమిది రింగులను ఏర్పాటుచేయాల్సి ఉంది. మరుగుదొడ్డి కోసం గదిని మూడడుగుల వెడల్పు, నాలుగు ఫీట్ల పొడవుతో నిర్మించాలి.
ఈ నిబంధనలు ఉన్నట్లయితేనే లబ్ధిదారునికి ప్రభుత్వం రూ..9100 చెల్లిస్తోంది. ఈ మొత్తం మార్కెట్ లెక్క ప్రకారం చాలడంతో అదనంగా రూ.3 వేల నుంచి రూ.4 వేలు లబ్ధిదారుడే భరించాల్సి వస్తోంది. ఈ అదనపు భారాన్ని భరించే స్థితి వారికి లేదు. దీంతో వారు వెనుకంజ వేస్తున్నారు. ఏదోలా ముందుకు వచ్చి నిర్మాణం చేపట్టే వారికి సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. రింగుల ధర రూ.850 నుంచి రూ.1200లకు, ఇక ఇసుక, ఇటుకల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వీటిని తామెలా భరించాలన్నది లబ్ధిదారుల వాదన.
లక్ష్యానికి దూరంగా...
ఇలా జిల్లాకు 1,09,227 యూనిట్లకు పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు రూ.103.31 కోట్ల నిధులను విడుదల చేశారు. పథకం 2012 ఆగష్టులో ప్రారంభమైనా ఇప్పటి వరకు 3,331 మాత్రమే పూర్తిచేయగలిగారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.2.89 కోట్లు ఖర్చుచేశారు. 10,493 నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.5.28 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పుడేం జరుగుతోంది...
వాస్తవాన్ని లబ్ధిదారులు నిన్నటిదాకా విన్నవించినా అధికారులు తామేం చేయలేం ‘అంతా రూల్స్’ ప్రకారమే అని హఠం వేశారు. తాజాగా ఎన్నికల పుణ్యమా అని నేతలు రంగంలోకి దిగడంతో పథకం మళ్లీ నిబంధనలు తూచ్ అంటూ ఏదో విధంగా కదిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాయకుల ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం కూడా కన్నుచేరేసి ఈ బిల్లులకు మోక్షం కల్పించేందుకు చురుగ్గా కదులుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ నిర్మాణం వేగం పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిన్న కొర్రీ... నేడు హర్రీ..!
Published Sun, Feb 9 2014 2:41 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement