సాక్షి, మహబూబ్‌నగర్ : గ్రామపంచాయతీలకు నిధుల కొరత తీరినట్లే.. ఇకనుంచి అభివృద్ధి పనులు చురుగ్గా ముందుకు సాగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్దుల కింద కోట్ల రూపాయల నిధులు మంజూరుచేశాయి. వాటిని జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామాలకు విడుదల చేయనున్నారు. జిల్లాలో 1310 గ్రామ పంచాయతీలతో పాటు 3417అనుబంధ గ్రామాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా చాలా గ్రామ పంచాయతీలు నిధుల్లేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తగిన తాగునీటి వసతి లేక, రోడ్లు బాగులేక గ్రామీణులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేకగ్రాంట్లు నిలిచిపోయాయి.
ప్రస్తుతం ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతుండటంతో కేంద్రప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. 13 ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.18.87కోట్లు విడుదలయ్యాయి. వీటిని 2011 జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ నిధులు డీటీఓ(జిల్లా ట్రెజరీ కార్యాలయం) వద్ద సిద్ధంగా ఉన్నాయి. అలాగే వృత్తిపన్ను ద్వారా రెండు విడుతలుగా రూ.1.68 కోట్లు మంజూరయ్యాయి. మరో పద్దు తలసరి గ్రాంట్ ద్వారా కూడా రెండు విడతలుగా రూ.32.42లక్షలు మంజూరయ్యాయి. ఇలా మొత్తమ్మీద అన్ని పద్దుల కింద రూ.20.88 కోట్లు వచ్చాయి.
రూ.156 కోట్ల విద్యుత్ బకాయిలు
నిధుల లేమి కారణంతో గ్రామ పంచాయతీలు పుట్టెడు సమస్యల్లో కూరుకుపోయాయి. ముఖ్యంగా విద్యుత్ బకాయిల పద్దు కొండంత పేరుకుపోయింది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు కలిపి రూ.156 కోట్లు బకాయిలు పడ్డాయి. ఆరేళ్లుగా వీటిని చెల్లించకపోవడంతో కొండంత పేరుకుపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఈ నేపథ్యంలో 13 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులలో 50శాతం వరకు తక్షణం కరెంట్ బకాయిలు చెల్లించాలని జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. పైగా ఆర్థిక సంఘం నిధులు కూడా కేవలం నిర్వాహణకు మాత్రమే ఉపయోగించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పన్నుల వసూలులో వెనుకంజ
ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో గ్రామ పంచాయతీలు పూర్తిగా వెనుకబడిపోయాయి. ఇంటిపన్ను విషయంలోనే పాత బకాయిలు, ప్రస్తుతం ఉన్న పన్నులను కలుపుకుని మొత్తం రూ.21.12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.5.84 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ. 15.27కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అలాగే నాన్‌టాక్స్‌లు గతంతో కలుపుకొని మొత్తం రూ. 14.7 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.9కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. పనులు పూర్తిస్థాయిలో వసూలైతేనే అభివృద్ధి పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.
నిధులవరద
Published Thu, Dec 25 2014 1:15 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement