అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందాన జిల్లాలో అత్యధిక సాగునీటి వనరులు ఉన్నా.. సకాలంలో సక్రమంగా వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండడం లేదు. జిల్లా కేంద్రంగా నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు 33 ఏళ్లుగా ఫలించడంలేదు. ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ జాప్యానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి!
పీఎన్‌కాలనీ (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఐదు నీటిపారుదల డివిజన్లు విజయనగరం జిల్లా బొబ్బిలి నీటిపారుదల సర్కిల్ పరిధి నుంచి తొలగిస్తూ జిల్లాకు కొత్త నీటి పారుదల సూపరింటెం డింగ్ ఇంజినీరు (ఎస్‌ఈ)కార్యాలయం (సర్కిల్ కార్యాలయం) ఏర్పాటు చేసే విషయమై జిల్లా ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ అధికారులు చేస్తున్న విజ్ఞప్తులు ఫలించడంలేదు. అనేకసార్లు ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు) సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చారే తప్ప ఆచరణ దిశగా ఒక్కడుగూ వేయడంలేదు.
33 ఏళ్లుగా ఇదే తీరు. ఇదే విషయాన్ని హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లా పరిశీలనకు వచ్చిన రాష్ర్ట నీటిపారుదలశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వద్ద ఇరిగేషన్ శాఖాధికారులు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుతో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు విన్నవించా రు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఆయన హామీఇచ్చా రు. రాష్ట్రం మొత్తం మీద కేవలం శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే ఈ సమస్య వేధించడం, దీనిని పరిష్కరించే దిశగా హామీలిచ్చిన మంత్రు లు సైతం మిన్నకుండ డంతో జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..!
శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్‌శాఖకు సంబంధించి ఐదు డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇవి ఇరిగేషన్ డివిజ న్ శ్రీకాకుళం, ఎస్‌ఈ డివిజన్ శ్రీకాకుళం, ప్రత్యేక నిర్మాణ విభాగం మడ్డువలస, ఎస్‌ఎంఐ డివిజన్ సీతంపేట, తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు(టీబీపీ-2) రాజాం డివిజన్‌గా సేవలందిస్తున్నారు. ఈ ఐదు డివిజన్ల పరిధి నుంచి జిల్లా వ్యాప్తంగా 2,92,250లక్షల ఎకరాల్లో సాగునీరు అందించేందుకు ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. నాగావళి నదీ పరీవాహక పరిధిలో తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 39,544 ఎకరాలు, మరో ప్రధాన ప్రాజెక్టు నారాణయపురం ద్వారా 76,597 ఎకరాలు సాగవుతోంది. మైనర్ ఇరిగేషన్ స్కీం ద్వారా మరో 11,988 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇన్ని ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఎండమావిగానే మిగిలింది. దీనంతటికీ కార ణం ఉన్నతస్థాయి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన సర్కిల్‌కార్యాలయం ఈ ప్రాంతంలో లేకపోవడమేనని రైతు సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అధికం
శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వనరులకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు 60శాతం పైబడి వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్నారు. 1983 నుంచి జిల్లాలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వాలు 33 ఏళ్లుగా సాగదీస్తూ వస్తున్నారు. దీంతో విజయనగరం జిల్లా బొబ్బిలి వెళ్లి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఇటు అధికారులకు, రైతులకు దాపురించింది.
సర్కిల్ కార్యాలయంతో జిల్లాకు మరింత మేలు
జిల్లాలో అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో అధికంగా పనులు జరుగుతున్నా యి. కానీ సర్వీస్ పనులు, ఫైళ్ల క్లియరెన్సు.. ఇలా ప్రతి చిన్న, పెద్ద పనులకు మాత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. పనులు మరింత వేగవంతం చేయాలంటే జిల్లాలో సర్కిల్ కార్యాలయం తప్పని సరి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తే ఫలితం ఉంటుంది.
-బి.అప్పలనాయుడు,ఎస్‌ఈ, వంశధార
ఇరిగేషన్ సర్కిల్ రానట్టేనా?
Published Sat, Feb 20 2016 11:51 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement