ఇరిగేషన్‌లో అవినీటి పూడిక
► పర్సంటేజ్‌లకు ఫిక్స్‌డ్ రేట్లు
► పట్టుబడుతున్న అధికారులు
► తికమకపడుతున్న అధికారపార్టీ నాయకులు
► పనుల నాణ్యత గాలికి
ఇరిగేషన్‌శాఖలో పేరుకుపోయిన అవినీతి పూడికను తొలగించే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. కాలువల్లో పూడిక తొలగింపు పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న అధికారులు తాజాగా రెండో విడత నీరు-చెట్టు పనులకు సైతం తాము నిర్ణయించిన పర్సంటేజ్‌లు ఇస్తేనే పనులిస్తామని తేల్చి చెబుతున్నారని సమాచారం.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : తమకు పర్సంటేజీ కచ్చితంగా ఇవ్వాలని అధికారులు చెబుతుండడంతో నీరు-చెట్టు పనులు పొందిన నీటి సంఘాల యాజమాన్య సభ్యులు, అధికారపార్టీ నాయకులు విస్తుపోతున్నారు. పర్సంటేజ్‌ల వసూళ్లపై కచ్చితమైన పద్ధతిలో ఎస్‌ఈ దగ్గర నుంచి వ్యవహరించడంతో పనుల నాణ్యతను పట్టించుకోవడంలేదు. చేయని పనులకు సైతం బిల్లులు చేయించుకోవడంలో అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పొడచూపిన అభిప్రాయభేదాలతో అసలు విషయం బయటకు పొక్కింది.
నీరు-చెట్టు పనులకు రూ.147 కోట్లు మంజూరు
రెండో విడత నీరు - చెట్టు కింద జిల్లా వ్యాప్తంగా 1823 పనులకు రూ.147.60 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నామినేషన్ పనులను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు పెంచారు. నామినేషన్‌తో నిమిత్తంలేకుండా రూ.10లక్షల పనులు చేయవచ్చునన్న ఆశతో అధికారపార్టీ నాయకులు ఎగిరి గంతేశారు. ఇరిగేషన్ అధికారులు పర్సంటేజ్ మెలిక పెట్టారు. ఏకంగా పనుల్లో 30 శాతం వాటా ఇరిగేషన్‌శాఖ నొక్కేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బిల్లులు చేసేది తామే కావడంతో పనులు ఎలా చేసినా పట్టించుకునేదిలేదని, అడిగిన మొత్తం ఇచ్చేయాలనేది అధికారుల తీరైంది. దీంతో నీటి యాజమాన్య సంఘాల నాయకులు జిల్లాలోని టీడీపీ ప్రముఖ నేతల వద్దకు ఈ వివాదాన్ని తీసుకెళ్లారు.
ఫిక్స్‌డ్ పర్సంటేజ్‌ల వసూళ్లు తెలుసుకున్న టీడీపీ ఉన్నత శ్రేణినాయకులు ఏకంగా ఎస్‌ఈని మందలించినట్లు తెలుస్తోంది. జిల్లాలో నీరు-చెట్టు కింద పనులకు బిల్లులను చెల్లించే క్రమంలో పర్సంటేజ్‌లను తగ్గించుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఏఈల దగ్గర నుంచి ఈఈలు, డీఈలు, ఎస్‌ఈల వరకు ఫిక్స్‌డ్ పర్సంటేజ్‌లు ఇవ్వాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారపార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారంలో తామున్నప్పటికీ అధికారులు తమ హెచ్చరికలను పక్కనబెడుతుండడం వారికి ససేమిరా నచ్చడంలేదు.
చేసే పనుల నాణ్యత, తమకు అనుకూలంగా ఎస్టిమేషన్‌ను పెంచి పనులను నిర్ణయించి నీటి సంఘాల యాజమాన్యానికి అప్పనంగా ఇస్తున్నప్పుడు తమ పర్సంటేజ్‌ల వాటా తమకు రావాల్సిందేనని అధికారుల ఆలోచన. ఈ క్రమంలో సాక్షాత్తు ఎస్‌ఈ జిల్లాస్థాయి ఉన్నతాధికారికి సైతం 2 శాతం వాటా ఇవ్వాలని చెప్పడంతో నెల్లూరు, నెల్లూరు సెంట్రల్ డివిజన్, గూడూరు, కావలి ఈఈలు కిందిస్థాయి ఇంజనీర్లను పర్సంటేజ్‌లపై పట్టుబడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఎఫ్‌డీఆర్ పనులనే..
రెండో విడత నీరు - చెట్టు కార్యక్రమంలో చేసేసిన ఫ్లడ్ డ్యామేజ్‌డ్ రిపేర్లను(ఎఫ్‌డీఆర్) సైతం జాబి తాలో చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నియోజకవర్గాల వారీగా ఈ పనులను పథకం ప్రకారం చేర్చారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ పనిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచడంతో అధికారులు, టీడీపీ నాయకులు నీరు - చెట్టు పనులలో వాటాలు పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పర్సంటేజ్‌లు గుట్టు రట్టవడంతో అధికారులు నోరు మెదపడంలేదు.
నీటి యాజమాన్య సంఘాల నాయకులు మాత్రం పనులు తమకు వచ్చినప్పటికీ లాభమేముందని తలలుపట్టుకుంటున్నా రు. అయితే కాగితాలపై పనులు చేసినట్టు చూపించి బిల్లులు చేసుకునేందుకు ఆ మాత్రం ఇవ్వలేరా అని అధికారులు ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం. పర్సంటేజ్‌లపై అధికారుల, వాటాలపై అధికారపార్టీ నా యకులు పట్టు విడవకపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోయే అవకాశం ఉంది. కాలువలకు మరమ్మతులు, పూడిక తీత పనులలో పర్యవేక్షణ లేకపోవడం తో పనులు ఏ మేరకు జరిగాయో అంచనా వేయలేని పరిస్థితి. తాజాగా రెండో పంటకు నీరు విడుదల చేశా రు.
ఐఏబీ తీర్మానం ప్రకారం పెన్నార్ డెల్టా ఆయకట్టులో 1,76,000 ఎకరాలకు నీళ్లందించేలా చర్యలు చేపడతామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నీరు వదిలి వారం కావస్తున్నా నిర్ణీత ఆయకట్టు కాలువలకు ఆశించిన స్థాయిలో నీరందలేదని ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలను పర్యవేక్షించే లస్కర్లు సైతం లేకపోవడం ఇరిగేషన్‌శాఖ పనితీరుకు నిదర్శనం. ఇప్పటికైనా పర్సంటేజ్‌ల పట్టును అధికారులు వీడాలని, అధికారపార్టీ నాయకులు జేబులు నింపుకోవడం కోసం కాకుండా రైతులకు మేలు జరిగేలా పనులు చేసేలా చూడాలని రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అవన్నీ ఆరోపణలే :
పనులకు పర్సంటేజ్‌లా.. అవన్నీ ఆరోపణలే.. అటువంటిది ఏమీ లేదు. అలా అడిగితే నా దృష్టి తీసుకురండి. ఎంతటి వారిపైన అయినా కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. పనుల నాణ్యతలో తేడా వస్తే వారిని ఉపేక్షించేదిలేదు. పనులను ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించేందుకు ఇం జనీర్లను పురమాయిస్తున్నాం. క్షేత్రస్థాయిలో లస్కర్లను సైతం ఏర్పాటు చేస్తున్నాం. - పీవీ సుబ్బారావు, ఇరిగేషన్ ఎస్‌ఈ