ఏ ప్రాంత ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత ఆ ప్రాంత అధికారులకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా అధికారుల కేటాయింపుపై ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంత ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను సంబంధిత ప్రాంత ఉద్యోగస్తులకే అప్పగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కిందిస్థారుు ఇంజనీర్ల నుంచి పైస్థాయిలో ఉన్న ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) వరకు జాబితాను రూపొందించారు. అయితే ఈ నెల 8న ప్రభుత్వం నుంచి విధివిధానాలు వెల్లడైన తర్వాత దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. కాగా, ప్రాజెక్టుల వారీగా పనిచేసే అధికారులను కూడా ఇప్పటికే గుర్తించి, బాధ్యతలను అప్పగించారు. ఏ ప్రాంత ప్రాజెక్టులకు ఆ ప్రాంత అధికారులనే కేటాయించారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ కార్యదర్శుల బాధ్యతల్లో కూడా మార్పులను తీసుకువచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం సీమాంధ్ర ప్రాజెక్టుల బాధ్యతలను ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి చూడనున్నారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నాగిరెడ్డి చూసేవారు. అయితే ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి కావడంతో ఈ మార్పు చేశారు. ఇకనుంచి నాగిరెడ్డి అంతర్‌రాష్ర్ట జలవనరుల విభాగం, కొత్తగా ఏర్పడే ప్రత్యేక బోర్డుల వంటి బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను ఆదిత్యనాథ్ దాస్ పర్యవేక్షించనున్నారు.