సాగునీటి పనులకు బ్రేక్
- భూ సేకరణకు సర్కారు అడ్డు
- కొత్త చట్టం వచ్చేదాకా భూమి తీసుకోరాదంటూ జీవో
- జూన్ తర్వాత కొత్త చట్టం
- నిలిచిన దేవాదుల, ఎస్సారెస్పీ పనులు
- కంతనపల్లిలో సర్వే పనులకే అనుమతి
హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది. పదేళ్లుగా సాగుతున్న దేవాదుల... ఏడేళ్లుగా కాల్వల్లోనే మగ్గుతున్న ఎస్సారెస్పీ పనులన్నీ నిలిచిపోయాయి. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడిప్పుడే అడ్డంకులన్నీ తొలగిపోతుండగా... కొత్త జీఓతో ఇక్కడ కేవలం సర్వే పనులకే పరిమితం చేశారు. ప్రాజెక్టుల భూ సేకరణ విషయం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్న తరుణంలో.. పార్లమెంట్‌లో కొత్త చట్టం రూపొందించడం, ఆమోదం తెలుపడంతో పనులన్నీ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం భూ సేకరణతో ముడిపడి ఉన్న పనులన్నీ ఆపాలని, ఎక్కడా సెంటు భూమిని కూడా వినియోగించరాదంటూ ఆదేశాలిచ్చారు. ఇప్పటి నుంచి చేసిన పనులకు బిల్లులు చెల్లించబోమని, పనులు చేయరాదని అధికారులకు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో త్వరలో పూర్తవుతాయనుకున్న పలు ప్రాజెక్టుల పనులు మరింత జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. పదేళ్ల కిందట మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టు పనులకు మొదటి, రెండో దశల్లో భూ సేకరణ ఇబ్బందులున్నాయి.
ధర్మసాగర్, తపాస్‌పల్లి, ఘన్‌పూర్, భీంఘన్‌పూర్ ప్రాంతాల్లోని ఉప కాల్వల నిర్మాణానికి కొంతమేరకే భూమిని సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల వందల గజాల్లోనే భూమిని తీసుకోవాల్సి ఉండగా... రైతులు, భూ యజమానులతో ఇప్పుడిప్పుడే చర్చలు జరిపి, పరిహారం చెల్లింపుల కోసం తిరిగి దరఖాస్తులు చేసే సమయానికే పనులు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మొదటి దశలో కాల్వల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ... ఉప కాల్వలు కొన్ని చోట్ల పూర్తికాకపోవడంతో వచ్చే ఖరీఫ్‌లో కూడా నీటిని అందించడం కష్టంగా మారనుంది.
రెండో దశలో కూడా ఆయా ప్రాంతాల్లో భూమిని సేకరించాల్సి ఉంది. అదే విధంగా ఎస్సారెస్పీ-2 కాల్వ పనులకు సైతం పాలకుర్తి, జనగామ, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో కొంత భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో సుమారు 46 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకునేందుకు ఇటీవలే అధికారులు చెల్లింపుల జాబితాను సిద్ధం చేశారు. కానీ, భూ సేకరణపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక.. చాలా ఏళ్ల తర్వాత కదిలిన కంతనపల్లికి అడ్డంకులు తొలుగుతున్నా భూ సేకరణ చట్టంతో మళ్లీ వెనకడుగు పడింది. తొలి దశ బ్యారేజీ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి.
టెండర్లు దక్కించుకున్న సంస్థ బ్యారేజీ సర్వే పనులు, అక్కడ కార్యాలయాల నిర్మాణానికి స్థల సేకరణలో నిమగ్నమైంది. కానీ... భూ సేకరణ చేయరాదని, కొత్త చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేంత వరకు ఎక్కడా చెల్లింపులు చేయరాదని కేంద్రం నుంచి నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కంతనపల్లి వద్ద నిర్మాణ పనులకు అడ్డుకట్ట పడింది. కొత్త భూ సేకరణ చట్టం జూన్ తర్వాత అమల్లోకి వస్తుదని, అప్పటి వరకు పనులు నిర్వహించరాదని నీటి పారుదల శాఖ ఆదేశాలిచ్చింది. అంటే మరో నాలుగు నెలల వరకు ఒక్క పనీ చేయరు.