తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే.. హైదరాబాద్ను కొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే, సీమాంధ్ర ప్రాంతానికి పదేళ్లు లేదా ఐదేళ్ల పాటు హైదరాబాద్లో ప్రత్యేక పాలనా కేంద్రం అవసరం అవుతుంది. ఇప్పటికే ఉన్న సచివాలయంలో కొంత భాగాన్ని 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రానికి రాజధానిగా చేస్తారా.. లేక కొత్త భవనాన్ని వెతుకుతారా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని కొత్త సచివాలయంగా మారే అవకాశం కనిపిస్తోంది.
వాస్తవానికి 1976లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ను ఏర్పాటుచేశారు. దాన్నే 1998లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థగా మార్చి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇచ్చే సమున్నత కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ విభాగాల్లోని అన్ని శాఖలకు సంబంధించిన శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్థను దేశంలోనే అత్యున్నత సంస్థగా భావిస్తారు. ఈ సంస్థకు ఐఎస్ఓ 9001:2000 గుర్తింపు కూడా లభించింది. శిక్షణ, కన్సల్టెన్సీ, పరిశోధన ప్రచురణ రంగాల్లో ఈ సంస్థ నాణ్యత అసమానం అని చెబుతుంటారు. కాలక్రమేణా ఈ సంస్థ భవనంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశారు.
అన్ని రాష్ట్రాల్లోను ఇలాంటి శిక్షణ సంస్థలు ఉన్నాయి గానీ, ఇక్కడి సదుపాయాలు, సౌకర్యాలకు మరేదీ సాటి రాదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ సూచనల మేరకు ఈ కేంద్రాలను నెలకొల్పారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ప్రాంతంలోని 30 ఎకరాల సువిశాల స్థలంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉంది.
ఈ భవనంలో ఉన్న సౌకర్యాలివీ..
- లెక్చర్ హాళ్లు
- ఆడిటోరియం
- సెమినార్ హాళ్లు/ కాన్ఫరెన్స్ గదులు
- కంప్యూటర్ శిక్షణ ల్యాబ్లు
- గ్రంథాలయం
- హెలిప్యాడ్
- సిబ్బంది కోసం నివాస సదుపాయం
- అతిథిగృహం