బట్టబయలైన ఐఎస్‌ఐ కుట్ర
సోషల్ మీడియాతో నగర యువతకు గాలం
‘ఉగ్ర’శిక్షణకు వెళ్లిన 15 మంది హైదరాబాదీలు
బంగ్లా సరిహద్దులో చిక్కిన నలుగురు వారే
మిగతా వారి ఆచూకీ కోసం దర్యాప్తు
హైదరాబాద్: ఉగ్రవాదం ైవె పు హైదరాబాద్ యువతను మళ్లించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ. కొత్త అస్త్రాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియాతో నగర యువతకు గాలమేసి వారిని ‘ఉగ్ర’శిక్షణలో రాటుదేల్చేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఉగ్రవాద శిక్షణ కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతుండగా హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు కోల్‌కతా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో నగరానికి చెందిన యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఐఎస్‌ఐ పన్నిన కుట్ర బట్టబయలైంది. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్‌లలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు ‘ఖైదత్ అల్ జిహాద్’ను ఏర్పాటు చేస్తున్నట్లు అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరి ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఉగ్రవాద శిక్షణ పొందేందుకు నగరం నుంచి 15 మంది యువకులు వెళ్లినట్లు సమాచారం. ఇందులో నలుగురు మాత్రమే బంగ్లా సరిహద్దులో పట్టుబడ్డారు.
మిగతా వారు బంగ్లాదేశ్‌కు చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరే కాకుండా ఇంకా ఎంత మంది ఇక్కడి నుంచి వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో అదృశ్యమైన యువత గురించి ఆరా తీస్తున్నారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొని జైలు నుంచి విడుదలైన వారిపై కూడా నిఘా పెట్టారు. కాగా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కిన నలుగురు యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే, సోషల్‌మీడియాతో నగర యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న వారిపై నిఘా పెట్టారు. అంతేకాకుండా పిల్లలు కనిపించకుండా పోతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. అలా సమాచారం అందజేస్తే వారి కదలికలపై నిఘా పెట్టి వారిని ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూస్తామన్నారు. గతంలో కూడా బంగ్లాదేశ్ సరిహద్దులో పట్టుబడిన వారికి కూడా ఇలాగే కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
సోషల్ మీడియాతో గాలం...
నగర యువతను ఐఎస్‌ఐ ఉగ్రవాదులు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ఆకర్షిస్తున్నారు. వాట్స్‌యాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా అమాయక యువతను జీహాద్ పేరుతో రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చాలనేది వారి లక్ష్యం. ఈ మేరకు నగరానికి చెందిన యువతను ముందుగా ఢిల్లీకి పిలిపించుకుని అక్కడి నుంచి కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్ సరిహద్దులు దాటిస్తున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన శిబిరాల్లో ఉగ్రవాదులుగా మార్చేందుకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా నగరంలోనే పేదకుటుంబాలకు చెందిన యువతనే వీరు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా ఆదుకుంటామని నమ్మించి ఇలాంటి కుటుంబాలలోని యువతను ఉగ్రవాద శిక్షణకు ఎంపికచేస్తున్నట్లు సమాచారం.