
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ నివాస్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కరోనా నివారణకు ఐసొలేషన్ ఉత్తమ మార్గమని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలో తాజా పరిస్థితులపై కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ వైరస్ వ్యాప్తికి విదేశాల నుంచి వచ్చిన వారే ప్రధాన కారణమని, అటువంటి వారిని ప్రత్యేకంగా ఉంచడంతోపాటు చుట్టు పక్కల ప్రదేశాల్లో నివసించే వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. కరోనాపై జిల్లా ప్రజల రక్షణకు అన్ని చర్యలూ తీసకుంటున్నామని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చేవారు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతమైందన్నారు. జిల్లాలో ఎక్కడా రద్దీ లేకుండా జనసంచారం తక్కువగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం ఒక్కరోజుతో అయ్యే పని కాదని, కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకూ ఇది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించే విధంగా వెసులుబాటు కల్పించిందన్నారు. సీఎం సూచన మేరకు దుకాణాలు మూయవద్దన్నారు. దుకాణాలు మూసివేస్తే ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. సినిమాహాళ్లు, మాల్స్, రద్దీగా ఉండే ప్రాంతాలు మూతవేయాలన్నారు.
జిల్లాలో 500 ప్రత్యేక గదులు ఏర్పాటు
ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అనుమానం కేసులపై ఉంచేందుకుగాను జిల్లాలో 500 ప్రత్యేక గదులు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేరుగా విమానాశ్రయం నుంచి ప్రత్యేక గదులకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటింటా సర్వే పూర్తయినందున సులువుగా ఇటువంటి వారిని గుర్తించడం వీలువుతుందన్నారు. తద్వారా వారికి తగు చర్యలు తీసుకోవడం, వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో రెండు సర్వేలియన్ల బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కోబృందంలో ఐదు బ్యాచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఈ బృందాలు ర్యాపిడ్ టీంలుగా విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ఒక్కో టీంలో ఫల్మనాలజిస్ట్, ఎనస్థీషియా, జనరల్ మెడిసిన్ డ్యూటీ డాక్టర్లు ఉంటున్నారని తెలిపారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వేలియన్స్ ప్రోగ్రాం కింద ఒక్కో డివిజన్‌కు 40 బృందాలు, ఒక్కో బృందంలో పురుష, మహిళ ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఉంటారని వివరించారు. 10 బృందాలకు ఒక వైద్యాధికారి నేతృత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ కేసులను ఈ బృందాలు గుర్తించి ఆ తీవ్రత ఆధారంగా వారు రిపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. 108 వాహనాలను కొన్నింటిని ప్రత్యేకంగా కరోనా కేసుల కోసం కేటాయించామని, వీటిని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బెడ్‌లను సిద్ధం చేస్తున్నాం...
జిల్లాలో ఇంతవరకు కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కలెక్టర్ వెల్లడించారు. మున్ముందు నమోదైతే ప్రభావిత ప్రాంతం మూడు కిలోమీటర్ల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. 10 కిలోమీటర్ల వరకూ బఫర్ జోన్ కింద పరిగణనలోకి తెచ్చి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం 40 బెడ్‌ల ఏర్పాటు ఉందని, మరో 50 బెడ్‌లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. టెక్కలి, పాలకొండ, రాజాం ప్రభుత్వాస్పత్రుల్లో ఐదేసి వంతున, సీతంపేటలో 1, బారువలో 4, రణస్థలంలో 3, బుడితిలో 3, కవిటిలో 2, పాతపట్నంలో 2, నరసన్నపేటలో 4, హరిపురంలో 6, కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం, సోంపేట, పలాసలలో రెండేసి వంతున ఐసొలేషన్ సదుపాయంతో బెడ్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో జెమ్స్ వైద్య కళాశాలలో 15, రాజాం జీఎంఆర్‌లో 16, కిమ్స్‌లో 10, గొలివి, సిందూర, అమృత, పీవీఆర్ ఆస్పత్రుల్లో రెండేసి వంతున ప్రత్యేక బెడ్‌లను సిద్ధం చేశామన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంచామని సూచించారు.
కరోనా అనుమానిత కేసు రిపోర్టు రావాలి...
వైద్యులకు పర్సనల్ పాజిటివ్ ప్రొటెక్షన్ ఎన్–95 మాస్క్‌లు సరఫరా చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు వరకూ జిల్లాకు 259 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, 14 రోజులు పూర్తయినవారు కూడా ఇందులో ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఒక్క కేసుకు సంబంధించి పరీక్షల నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.శ్రీనివాసులు, జేసీ–2 ఆర్.గున్నయ్య, డీఆర్‌వో బి.దయానిధి, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, బీసీ కార్పోరేషన్ ఈడీ రాజారావు, మత్స్యశాఖ ఏడీ కృష్ణమూర్తి, పంచాయితీ ఏడీ రవికుమార్, జెడ్పీ సీఈవో చక్రధరరావు, డీఎంహెచ్‌వో ఎం.చెంచయ్య, డీసీహెచ్‌ఎస్ సూర్యరావు, కరోనా ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment