సూపర్‌ సిక్సర్‌ | ISRO Success To Launch GSLV 3D2 | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్సర్‌

Published Thu, Nov 15 2018 1:28 PM | Last Updated on Thu, Nov 15 2018 1:28 PM

ISRO Success To Launch GSLV 3D2 - Sakshi

నింగిలోకి దూసుకెళ్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ2

డిజిటల్‌ ఇండియాదే! ఇస్రో సూపర్‌ సిక్సర్‌ కొట్టింది. రెండు దశాబ్దాలుగా అవిరళ కృషితో ఐదు జీఎస్‌ఎల్‌వీలను విజయవంతంగా నింగిలోకి పంపిన శాస్త్రవేత్తలు విజయగర్వంతో ఆరో ప్రయోగాన్ని సఫలీకృతం చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2 ప్రయోగం విజయవంతం కావడంతో  డిజిటల్‌ ఇండియా ఆవిష్కృతానికి కీలక అడుగు వేసినట్టయింది. అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి రానున్నాయి.  భారత సైనిక అవసరాలకు కూడా దోహదపడుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అనుసంధానం చేస్తుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. జయహో ఇస్రో.

నెల్లూరు  ,సూళ్లూరుపేట:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్న రాకెట్ల ద్వారా అత్యంత తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాల నుంచి పెద్ద ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టి దేశ ప్రజలకు అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా నిరంతరాయంగా కృషి చేస్తోంది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబం«ధించి మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్‌ దశను దేశీయ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో రూపొందించే ప్రక్రియలో భాగంగా సాంకేతికపరమైన ఇబ్బందులన్నీ ఎదుర్కొని పరిపక్వతను సాధించారు. మామూలు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్‌ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 తరహా రాకెట్‌లో 25 టన్నుల క్రయో ఇంధనం అవసరమవుతుంది. దీన్ని రూపొందించేందుకు కొంత కాలం సమయం తీసుకుంది.

వరుసగా ఐదు జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు విజయవంతం చేయడంతో పాటు బుధవారం నాటి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ2 ప్రయోగంలో సీ–25 అద్భుతంగా పని చేయడంతో క్రయోజనిక్‌ టెక్నాలజీలో పరిపక్వతను సాధించారు. సౌండింగ్‌ రాకెట్ల స్థాయి నుంచి ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ల స్థాయికి ఎదిగి, 40 కిలోల ఉపగ్రహం నుంచి అంచెలంచెలుగా 3,500 కిలోల బరువు కలిగిన భారీ ఉపగ్రహం జీశాట్‌–29 ప్రయోగించి విజయం సాధించడంతో అగ్రదేశాలతో సమాన స్థాయిలో నిలిచింది.   సమాచారం రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను దేశవాళికి అందించేందుకు అత్యంత బరువైన సమాచార ఉపగ్రహలను పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతోంది. ఇందులో భాగంగా 2 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష పరిశోధనా సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి వాళ్ల రాకెట్ల ద్వారా కక్ష్యలోకి పంపిస్తూ వచ్చారు. ఇక నుంచి ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇక్కడి నుంచే పంపించే వెసులు బాటు కలిగింది. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకు అప్పర్‌ స్టేజీలో రష్యా దేశం సహకారంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు ఉపయోగించి ఆరు ప్రయోగాలు చేశారు.

జీఎస్‌ఎల్‌వీ డీ2 పేరుతో 2001 ఏప్రిల్‌ 18న మొట్ట మొదటి ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 2 వేల కిలోల బరువు కలిగిన జీశాట్‌–01 సమాచారం ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. ఆరు ప్రయోగాలకు రష్యా దేశపు క్రయోజనిక్‌ ఇంజిన్లను వాడుకున్నారు. ఒక్క ప్రయోగానికి మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగా తయారు చేసిన క్రయోదశను ఉపయోగించగా దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. 2010 ఏప్రిల్‌ 15న జీఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగంలో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్లుతో చేసిన ప్రయోగం ఘోర పరాజయం పాలైంది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్‌ 25న రష్యా సాంకేతిక సహకారంతో కొనుగోలు చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో రెండేళ్లు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల జోలికే పోలేదు. 2001 నుంచి 2010 వరకు చేసిన ఏడు ప్రయోగాల్లో నాలుగు ప్రయోగాలు విజయవంతం కాగా మూడు ప్రయోగాలు అపజయం పాలయ్యాయి.

ఈ ఇంజిన్‌లో ఉపయోగించే లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ హైడ్రోజన్‌ ఇంధనం మైనస్‌ 220, 270 డిగ్రీల అతి శీతలమైన వాతావరణంలో తయారు చేయాల్సి ఉండడంతో ఇందులో బాలారిష్టాలను దాటేందుకు మన శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్లతో చేసిన ఐదు  ప్రయోగాలు వరుసగా విజయాలనే నమోదు చేసుకున్నాయి. బుధవారం చేసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ2 ప్రయోగం కూడా విజయవంతం కావడంతో ఇస్రో తిరుగులేని శక్తిగా మారింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1, డీ2 రాకెట్లు వరుసగా పూర్తి స్థాయిలో విజయం సాధించడం, ఎస్‌–200, ఎల్‌–110, సీ–25 దశలన్నీ అద్భుతంగా పనిచేయడంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుని అంతరిక్ష విజయాల వినువీధిలో విజయకేతనం ఎగుర వేశారు. ఇక నుంచి అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను ఇతర దేశాల మీద ఆధార పడకుం డా మనమే పంపించడమే కాకుండా మానవ సహితయాత్ర చేసే అంతరిక్ష దేశంగాభారత్‌ ఆవిర్భవించనుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.

సూళ్లూరుపేట:  భారత అంతరిక పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్థానంలో బుధవారం సాయంత్రం 5,08 గంటలకు నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ2 ప్రయోగం చరిత్రాత్మకమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు అన్నారు. ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఉద్యోగులు పాత్ర ఉన్నప్పటికీ ముఖ్యంగా కొద్దిమంది శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రయోగం జరిగింది. ఇస్రో చరిత్రలో రెండో సారి అతి భారీ ప్రయోగాన్ని నిర్వహించి గ ‘ఘన’ విజయం సాధించిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరేమన్నారంటే..

ఇస్రోకు చరిత్రాత్మకమైన విజయం
ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. ఇస్రో చరిత్రలో అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి తొలిప్రయత్నంలోనే రెండు భారీ విజయాలను సాధించినందుకు ఇస్రో టీంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ2 విజయంలో ప్రముఖపాత్ర పోషించిన క్రయోజనిక్‌ దశ అత్యంత అద్భుతంగా పనిచేయడంతో పాటు ఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్లు, ఎల్‌–110 ద్రవ ఇంధనం దశలు అత్యంత సమర్థవంతంగా పనిచేయడంతో మార్వ్‌లెస్‌ ప్రయోగంగా అభివర్ణించారు.  ఈ విజయం ఇస్రోలో పనిచేస్తున్న అందరికి దక్కుంతుంది.                 – డాక్టర్‌ కైలాసవాడివో శివన్, ఇస్రో చైర్మన్‌

ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం
ఇస్రో చరిత్రలో బుధవారం నిర్వహించిన జీశాట్‌–29 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించాం. రాకెట్‌లోని అన్ని దశలు అత్యంత అద్భుతంగా పనిచేయడంతో ఇంత గొప్ప విజయం. సాధించిగలిగాం. ఈ విజయం షార్‌లో పనిచేసిన అందరికీ దక్కుతుంది. దేశంలోని అన్ని ఇస్రో సెంటర్లు కలిసి కట్టుగా 18 ఏళ్లు శ్రమించి  చేసిన పరిశోధనలు ఫలించి రెండు భారీ ప్రయోగాలను వరుసగా విజయం సాధించినందుకు సంతోషంగా వుంది.– ఎస్‌ పాండ్యన్, షార్‌ డైరెక్టర్‌   

రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేశాయి
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ2 రాకెట్‌లో ఎస్‌–200, ఎల్‌–110, సీ–25 దశలు అద్భుతంగా పని చేయడంతో ఇస్రో చరిత్రలో తిరుగులేని విజయాన్ని సాధించాం. ఇన్ని రోజులు సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం మనం ప్రపంచం వైపు చూశాం. ఈ ప్రయోగంతో ప్రపంచమే మన వైపు చూడడం ప్రారంభించింది. వెహికల్‌ ముందుగా నిర్ణయించిన మేరకు సక్రమంగా పని చేసింది. 3,423 కిలోల బరువు కలిగిన అతిపెద్ద ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టి చరిత్రను సృష్టించాం.– బీ జయకుమార్, వెహికల్‌ డైరెక్టర్‌

చరిత్రలో నిలిచిపోయే విజయమిది
చరిత్రలో నిలిచిపోయే విజయమిది. రాకెట్‌ సంబం«ధించిన అన్ని దశలను వీఎస్‌ఎస్‌సీలోనే రూపొందించాం. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయోగాన్ని నిర్వహించి  చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పని చేశాయి. నిర్ణీత సమయానికే జీశాట్‌ 29 ఉపగ్రహా అత్యంత జాగ్రత్తగా జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశ పెట్టగలిగాం. భవిష్యత్‌ తరాలకు అత్యంత ఆధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అడ్వాన్స్‌డ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీశాట్‌ 29 ఉపగ్రహాన్ని అందుబాటులోకి తెచ్చాము. దీంతో క్రయోజనిక్‌ టెక్నాలజీలో పూర్తి సాంకేతిక పరమైన పరిపక్వతను సాధించాము. రాకెట్‌ విడిభాగాలు అందించడంలో ప్రయివేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని అయన అభినందించారు.– ఎస్‌ సోమనాథ్‌. వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌

చరిత్రలో నిలిచిపోయిన రోజు ఇది
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ2 ప్రయోగ విజయం చరిత్రలో నిలిచిపోయిన రోజు ఇది. అత్యంత బరువు కలిగిన జీశాట్‌ 29 ఉపగ్రహాన్ని క్రయోజనిక్‌ దశ (సీ25) సునాయాసంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మార్క్‌–3 ప్రాజెక్ట్‌ కోసం పదిహేడేళ్లుగా శ్రమించాం. 2014 నుంచి క్రయోజనిక్‌ దశను రూపొందించేందుకు అనేక రకాలు ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో క్రయో ఇంజిన్లను తయారు చేసుకున్నాం. ఈ దశ ఎంతో సంక్లిష్టమైంది కావడంతో 2014 నుంచి అనేక రకాలుగా భూస్థిర పరీక్షలు చేసి సామర్థ్యాన్ని నిర్థారించుకున్నాక పూర్తిస్థాయి ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఈ రాకెట్‌కు సంబంధించి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకున్నాం.– టీ మూకయ్య, ఐపీఆర్‌సీ డైరెక్టర్‌

ఉపగ్రహాన్ని అత్యంత అధునాతనంగా తయారు చేశాం
బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలోని ఉపగ్రహాన్ని తయారు చేశాం. ఇస్రో చరిత్రలో ఇదే అతి పెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్స్‌ను అమర్చి పంపాం. ఈ పేలోడ్స్‌తో దేశంలో మారుమూల గ్రామాల్లో ఇంటర్కెట్‌ కనెక్టివిటిని అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement