బాధితుల నుంచి వివరాలను సేకరిస్తున్న శింగరాజు వెంకట్రావు
సాక్షి, ఒంగోలు సిటీ: అగ్రిగోల్డ్ బాధితుల గోడు అరణ్య రోదనగానే మిగిలిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా కన్వీనర్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అన్నారు. స్థానిక అగ్రిగోల్డ్ బాధితుల శిబిరం వద్ద మంగళవారం బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఎవ్వరికీ పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల కోసం జగన్‌మోహన్‌రెడ్డి వారి పక్షాన నిలిచి అనేక ధర్నాలు, ఆందోళనలను చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. అయితే బాధితులకు ఈ నిధుల పంపిణీలో ఒక పద్ధతి లేదన్నారు. రూ.10 వేలు లోపు కట్టిన వారికి చెల్లింపులు చేస్తున్నారని, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారు 35 శాతం వరకు ఉంటారని తెలిపారు.
దీనికితోడు బాధితులు మొత్తాన్ని ఒంగోలుకు రావాలని ఒకే పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. బాధితులకు సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు. పశ్చిమ ప్రకాశం యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, పుల్లలచెరువు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రావాల్సి వస్తోందన్నారు. సుమారు 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడకు వస్తున్నా సరైన సమాచారం ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది లబ్ధిదారుల బాండ్లు వారి పిల్లల పేర్లపై ఉంటే శిబిరంలో పిల్లలను తీసుకురమ్మని, బాండ్లు ఎవరి పేరిట ఉంటాయో వారిని తీసుకురమ్మని తిరిగి వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.10 వేల లోపు బాండ్లు ఉన్న వారికి డబ్బు చెల్లించాలంటే రూ.364 కోట్లు అవసరమని కానీ ప్రభుత్వం వెచ్చించింది కేవలం రూ.250 కోట్లు మాత్రమేనన్నారు. అగ్రిగోల్డ్‌కు డబ్బు కట్టిన వారి బాధ అరణ్య రోదనగానే మిగిలిందన్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో, డివిజన్, నియోజకవర్గాల కేంద్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఈ ప్రయాణ ఖర్చులు తగ్గించి వెంటనే పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ఇచ్చే సమాచారాన్ని సక్రమంగా వారికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో బాధితుల వివరాలు సేకరించి కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment