అక్రమ కట్టడంలో ఐటీ కంపెనీ!  | IT Company in the illegal construction | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడంలో ఐటీ కంపెనీ! 

Published Fri, Jun 29 2018 5:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

IT Company in the illegal construction - Sakshi

ఆరో అంతస్థులో అక్రమంగా నిర్మించిన కట్టడం

సాక్షి, గుంటూరు:  నివాస గృహాల సముదాయం కోసం అనుమతులు తీసుకున్నారు. కానీ, వాణిజ్య సముదాయాలకు వీలుగా ఉండేలా కట్టారు. అలాగే, ప్లానులో ఐదంతస్తులు అని చూపెట్టారు.. అడ్డగోలుగా ఆరో అంతస్తును కట్టేశారు. ఇదేదో చాటుమాటుగా జరిగిన వ్యవహారం కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శుక్రవారం గుంటూరు నగరంలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఓ ఐటీ కంపెనీ భవన నిర్మాణంలో అడుగడుగునా చోటుచేసుకున్న అక్రమాల పర్వం ఇది. కంచె చేను మేసిన చందంగా అనధికారిక నిర్మాణాలను, అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులు, ప్రభుత్వ పెద్దలే ఈ అక్రమానికి సహకరిస్తున్న విచిత్ర పరిస్థితి గుంటూరు నగరంలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. 

గుంటూరు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో గల ఓ భవనంలో నూతనంగా ఇన్‌ వెకాస్‌ అండ్‌ వేదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో ఏర్పాటుచేసిన ఐటీ కంపెనీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే భవనానికి పక్కాగా అన్నీ అనుమతులు ఉండాలనే కనీస ధర్మాన్ని గాలికొదిలేశారు. ఎటు చూసినా అక్రమ పద్ధతిలో నిర్మించిన పరిస్థితి. 618.39 చదరపు గజాల స్థలంలో 31.97 చదరపు గజాల స్థలం రోడ్డుకు వదిలేసి 586.42 చదరపు గజాల్లో సిల్ట్‌తో పాటు గ్రౌండ్‌ ఫ్లోర్, మరో నాలుగు అంతస్తుల నివాస యోగ్యమైన భవనం నిర్మించుకునేలా గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల నుంచి అనుమతులు పొందారు. అయితే, వాణిజ్య సముదాయాలకు వీలుగా ఉండేలా భవనాన్ని నిర్మించడంతో పాటు, ఆరో అంతస్తు నిర్మాణాన్నీ చేపట్టారు. ఇదంతా నగరపాలక సంస్థ అధికారులకు తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రారంభోత్సవానికి వస్తుండటంతో ఏం చేయలేక మిన్నకుండిపోయారు. అనధికార నిర్మాణమని తెలిసినా నోటీసులు ఇచ్చేందుకు కూడా సాహసించలేదు.  

అడుగడుగునా అతిక్రమణలు 
- నివాస ప్రాంతాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటుచేయాలంటే కనీసం వెయ్యి చదరపు గజాల స్థలంలో భవనం నిర్మించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న భవనం కేవలం 586.42 చదరపు గజాల స్థలంలో మాత్రమే ఉంది. 
- నివాస గృహాలకు ప్లాన్‌ అనుమతులు తీసుకుని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కానీ, బిల్డర్, ఐటీ కంపెనీ నిర్వాహకులకు ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఈ అక్రమాలేవీ ఎవరికీ కనిపించలేదు. పైగా ఐటీ కంపెనీ నిర్మించేందుకు వీలుగా  మినహాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు.  
- అలాగే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చారో లేదో తెలియని పరిస్థితి.  
- సదరు స్థలంలో గతంలో ఉన్న చిన్న ఇంటికి సుమారు రూ.2 వేలు పన్ను ఉండేది. ప్రస్తుతం ఆరు అంతస్తుల భవనానికి లక్షల్లో పన్ను వేయాల్సి ఉన్నా రెవెన్యూ అధికారులు పాత పన్నునే కొనసాగిస్తున్నారు. 

అక్రమార్కులకు అండాదండా 
ఇదంతా ఒక ఎత్తయితే.. రాజధాని నగరంలో అనధికారిక, అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు భవన యజమానికి కొమ్ముకాస్తున్నారు. అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకే అక్రమ కట్టడంలో ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే ప్రభుత్వమే అక్రమాలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి చూసిన తరువాత నగరంలో ఇక అక్రమ కట్టడాలను అడ్డుకునే పరిస్థితి నగరపాలక సంస్థ అధికారులకు ఉంటుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

నా దృష్టికి రాలేదు 
విద్యానగర్‌ ఒకటో లైనులో ఇన్‌ వెకాస్‌ అండ్‌ వేద ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రారంభోత్సవం జరుగుతున్న భవనంలో అనధికారిక నిర్మాణం చేసినట్లు నా దృష్టికి రాలేదు. పరిశీలించి అలాంటివి ఏమైనా ఉంటే తొలగిస్తాం.  – శ్రీకేష్‌ లఠ్కర్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement