వైఎస్ స్వర్ణయుగం సాధిద్దాం
- జగన్‌తోనే సాధ్యమన్న కొణతాల
- కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలోకి 400 మంది
- మాజీ కార్పొరేటర్ పట్నాయక్ ఆధ్వర్యంలో చేరిక
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రానికి మంచి రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే సాధ్యమని మాజీ మంత్రి, ఆ పార్టీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. మాజీ కార్పొరేటర్, నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పి.ఎల్.ఎన్.పట్నాయక్ పార్టీలో చేరిన సందర్భంగా తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు.
రాష్ట్రంలో మళ్లీ స్వర్ణయుగం రావాలంటే కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అన్నివర్గాల వారు నమ్ముతున్నారన్నారు. రాష్ట్ర విభజన జరగడానికి చంద్రబాబే కారణమన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. విశిష్ట అతిథి ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ సుస్థిర పరిపాలన అందించే సత్తా జగన్ మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు.
అనకాపల్లి లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం పి.ఎల్.ఎన్.పట్నాయక్, ఆళ్ల నరసింగరావు, రమేష్‌లకు కొణతాల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి, గండి బాబ్జీ, జి.వి.రవిరాజు, బీసీసెల్ కన్వీనర్ పక్కి దివాకర్, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల బీసీ సెల్ కో-ఆర్డినేటర్ గండ్రెడ్డి రమాదేవి, రవి, స్థానిక నాయకులు ఆళ్ల శ్రీనివాసరావు, సూరాబత్తుల తిరుపతిరావు, చొక్కాకుల రామకృష్ణ, గుడ్ల భాస్కరరెడ్డి, ముత్యం సూర్యారావు, పెదిరెడ్డి వెంకటరావు, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, బి.మహేష్, నీలకంఠం, చిన్నలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
400 మంది పార్టీలో చేరిక
జీవీఎంసీ 31 నుంచి 35 వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది పి.ఎల్.ఎన్.పట్నాయక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు.