పెళ్లికి జీఎస్‌టీ ‘బ్యాండ్‌’! | IT focus on heavy wedding expenses | Sakshi
Sakshi News home page

పెళ్లికి జీఎస్‌టీ ‘బ్యాండ్‌’!

Published Wed, Aug 2 2017 12:24 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

పెళ్లికి జీఎస్‌టీ ‘బ్యాండ్‌’! - Sakshi

పెళ్లికి జీఎస్‌టీ ‘బ్యాండ్‌’!

జీఎస్‌టీతో 20 శాతం వరకు పెరిగిన వ్యయం 
శ్రావణంలో భారీ వివాహ వ్యయాలపై ఐటీ కన్ను
 
శ్రావణ మాసం వచ్చింది. ఎప్పటిలాగే పెళ్లిళ్ల సీజన్‌ తెచ్చింది. వస్తూ వస్తూ ఈసారి జీఎస్‌టీని మోసుకొచ్చింది. ఇంకేముంది.. పెళ్లి ఖర్చు 15 నుంచి 20 శాతం వరకు పెరిగింది. దుస్తుల దగ్గర నుంచి ఆభరణాలు, ఫర్నిచర్, అలంకరణ, ఫొటోగ్రఫీ.. ఇలా వివాహానికి కావాల్సిన అన్నింటిపైనా జీఎస్‌టీ తన ప్రభావం చూపిస్తోంది. అంతే కాకుండా గోరుచుట్టుపై రోకలిపోటులా వివాహానికి పెట్టే ఖర్చులపై ఐటీ శాఖ కూడా కన్నేసింది. దీంతో అన్ని వర్గాలవారు ఆడంబరాలకు దూరంగా పెళ్లిళ్లు జరిపించేస్తున్నారని ఈవెంట్‌ మేనేజర్లు అంటున్నారు.
 
సాక్షి, అమరావతి: పెళ్లిళ్లపై జీఎస్‌టీ బ్యాండ్‌ బాజా మోగిస్తోంది. జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పెళ్లిళ్ల వ్యయం భారీగా పెరిగిపోయింది. వివాహ ఖర్చుల్లో ప్రధానమైన లైటింగ్, అలంకరణ, ఫొటోగ్రఫీ వంటి సేవలతోపాటు దుస్తులు, ఆభరణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు వంటి కొనుగోళ్లపై పన్ను రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు పెళ్లిళ్లకు అందించే సేవలన్నీ వర్క్‌ కాంట్రాక్టు పరిధిలోకి వస్తున్నాయి. వీటిపై పన్ను 15 శాతం నుంచి 18 శాతానికి చేరింది. బంగారంపై పన్ను 1.8 శాతం నుంచి 3 శాతానికి, బట్టలు, చెప్పులు, ఫర్నీచర్‌ వంటి వాటిపై పన్నులు భారీగా పెరగడంతో పెళ్లివారి బడ్జెట్‌ తల్లకిందులవుతోంది.

‘రెండు నెలల క్రితం మా అమ్మాయి పెళ్లికి రూ.8 లక్షలు అవుతుందని అంచనా వేసుకున్నాం. ఇప్పుడు జీఎస్‌టీ పుణ్యమా అని బడ్జెట్‌ మరో రూ.1.50 లక్షలు పెరుగుతోంది. ఏం చేయాలో తోచడం లేదు’ అని విజయవాడకు చెందిన శ్రీరామ్‌ ప్రసాద్‌ వాపోయారు. గతంలో పెళ్లి అంటే కనీసం 1,000 నుంచి 1,500 మందికి భోజనాలను ఆర్డర్లు ఇచ్చేవారని, కానీ.. ఇప్పుడు ఎంత పెద్ద పెళ్లయినా ఈ సంఖ్య 500 దాటడం లేదని అక్షయ క్యాటర్స్‌ అధినేత కె. శ్రీనివాస్‌ తెలిపారు. గతంలో ధనవంతుల పెళ్లికి సుమారు 4,000 మందికి ఆర్డర్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఈ సంఖ్య 2,000కు పరిమితమైందని, అదే విధంగా ప్లేటు ఖరీదును రూ.650 నుంచి రూ.400కు తగ్గించుకుంటున్నారని కేఎంకే క్యాటర్స్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ తెలిపారు. జీఎస్‌టీ  భారం ఎలా పెరిగిందంటే..
 
దుస్తులు: పెళ్లి ఖర్చులో ప్రధానమైనవి దుస్తులు.  అందుకే పెళ్లి ఖర్చుల్లో 20 నుంచి 25 శాతం వాటా వీటిదే. మొన్నటి వరకు కేవలం రెడీమేడ్‌ దుస్తులపై మాత్రమే పన్ను ఉండేది. కానీ, జీఎస్‌టీ పరిధిలోకి చీరలు, పంచెలతోపాటు అన్ని టెక్స్‌టైల్‌ ఉత్పత్తులను తీసుకొచ్చారు. దీంతో రూ.1,000 లోపు దుస్తులపై 5 శాతం, ఆపైన 12 శాతం పన్ను చెల్లించాలి. దీనివల్ల అదనంగా 7 శాతం పన్ను పెరగ్గా, టెక్స్‌టైల్‌పై 5 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీంతో తమ వ్యాపారంలో 30 శాతం క్షీణత నమోదైందని విజయవాడ వస్త్రలతకు చెందిన ఓ వ్యాపారి వాపోయారు. 
 
ఫుట్‌వేర్‌: గతంలో రూ.500 లోపు పాదరక్షలపై పన్ను  5 శాతం ఉండగా రూ.500 మించి ఉన్న వాటిపై 10 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. దీంతో అదనపు భారం గ్యారంటీ.
 
ఆభరణాలు: పెళ్లిళ్ల వ్యయంలో అగ్రస్థానం బంగారానిదే. జీఎస్‌టీ రాక ముందు 1.8 శాతంగా ఉన్న పన్ను ఇప్పుడు 3 శాతానికి పెరిగింది. దీంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు అవసరమైన మేరకే ఆభరణాలు కొంటున్నారు. 
 
ఫర్నీచర్‌: పెళ్లికూతుర్ని కొత్త కాపురానికి పంపుతున్నప్పుడు ఇంటికి అవసరమైన ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్‌ తదితర వస్తువులను ఇస్తుంటారు. ఫర్నీచర్‌పై పన్ను భారం 12 శాతం నుంచి ఏకంగా 28 శాతానికి పెరిగింది. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కూడా పన్ను రేట్లు స్వల్పంగా పెరిగాయి.
 
సేవలు: క్యాటరింగ్, డెకరేషన్, మేకప్, లైటింగ్, కొరియర్, ఆతిథ్యం వంటి  సేవలపై పన్నును 15 నుంచి 18 శాతానికి పెంచారు.
 
క్యాటరింగ్‌: జీఎస్‌టీలో చాలా ఆహార ధాన్యాలపై పన్నును ఎత్తివేశారు. ఇంతకాలం వ్యాట్‌తోపాటు సేవా పన్ను కలిపి 24.5 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు 18 శాతం చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ట్యాక్స్‌ పరిధిలోకి రావడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరల ధరలు ఎక్కువగా ఉండడం, కూలీల రేట్లు పెరగడం, కేటరింగ్‌లో ఎక్కువగా వాడే కోవా రేటు పెరగడంవల్ల ఈ బడ్జెట్‌ కూడా పెరుగుతోంది.
 
ఐటీ నిఘా..
పెళ్లిళ్ల ఖర్చులపై ఐటీ శాఖ కన్నేసి ఉంచింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2 లక్షలు మించిన వాటిపై నగదు రూపంలో లావాదేవీలను ఆపేశారు. రూ.2 లక్షలు దాటితే చెక్కులు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారానే లావాదేవీలు జరపాలన్నది నిబంధన. కానీ, ఇప్పటికీ చాలామంది లావాదేవీలను నగదు రూపంలోనే జరుపుతుండడంతో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగం రంగంలోకి దిగింది. 
 
పెళ్లి ఖర్చుల్లో పెరుగుదల ఇలా..
ఒక మధ్య తరగతి అమ్మాయికి పెళ్లి చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు సుమారుగా రూ.11.15 లక్షలు. జీఎస్‌టీ రాకముందు చాలామంది బిల్లు లేకుండా ఎటువంటి పన్నులు చెల్లించకుండా వ్యాపారాలు చేసేవారు. కానీ, జీఎస్‌టీ వచ్చిన తర్వాత వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు దాటితే అందరూ పన్ను పరిధిలోకి వస్తున్నారు. దీంతో ప్రతిఒక్కరూ ఆ పన్ను భారాన్ని వినియోగదారుని మీద వేస్తుండటంతో ఆ మేర వ్యయాలు పెరుగుతున్నాయి. వివిధ సేవలు, కొనుగోళ్లపై పెరిగిన పన్ను భారాన్ని ఉజ్జాయింపుగా తీసుకొని లెక్కిస్తే  అదనంగా రూ.1.33 లక్షలు అంటే మొత్తం పెళ్లి వ్యయం రూ.12.48 లక్షలకు చేరింది. అదే స్టార్‌ హోటల్స్‌లో చేస్తే ఈ ఖర్చు మరింత పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement