ఇది ‘ప్రగతి’ డిస్కౌంట్ | It is 'Pragati' discount | Sakshi
Sakshi News home page

ఇది ‘ప్రగతి’ డిస్కౌంట్

Published Sun, Nov 2 2014 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

ఇది ‘ప్రగతి’ డిస్కౌంట్ - Sakshi

ఇది ‘ప్రగతి’ డిస్కౌంట్

సామాన్యులకు అందుబాటులో ఉండి..సురక్షిత ప్రయాణాన్ని అందించే ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా చార్జీల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రమాద బీమా కూడా అందించడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశం. నిత్యం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఆర్థికంగా కాస్త వెసులు బాటు క లుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగులకు ప్రత్యేక సేవలున్నాయి.      -అద్దంకి
 
వనితా కార్డు
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ కార్డు పొందేందుకు అర్హులు. కార్డు జెరాక్స్ కాపీ, పాస్‌పోర్టుసైజు ఫొటోలు అవసరమవుతాయి. రూ. 100 చెల్లించాలి. కార్డు పొందిన రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు టికెట్ ధరలో 10 శాతం రాయితీ లభిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. లక్ష ప్రమాద బీమా లభిస్తుంది.
 
యాద్‌ఆన్..
కుటుంబంలో ఉన్నవారు గరిష్టంగా నలుగురు కూడా ఈ కార్డు తీసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ. 20 చొప్పున రూ. 80 చెల్లిస్తే నాలుగు వనితా కార్డులిస్తారు. వీటిని యాద్‌ఆన్ కార్డులంటారు. వీరంతా కలిసి ప్రయాణిస్తన్న సమయంలో ప్రతి టికెట్‌లో పది శాతం రాయితీ లభిస్తుంది. కార్డు పొందే సమయంలో కుటుంబ సభ్యులంతా పాస్ పోర్టు ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాయితీ పొందవచ్చు.
 
నవ్యా క్యాట్ కార్డు
ఈ కార్డు తీసుకున్నవారికి ఏడాదిపాటు ప్రయాణంలో పది శాతం రాయితీ ఇస్తారు. అయితే దీనికి రూ. 250 చెల్లించాలి. ఏసీ బస్సులు మినహా అన్ని రకాల బస్సుల్లో ఈ కార్డుపై రాయితీ లభిస్తుంది. నలుగురు కుటుంబ సభ్యులు తీసుకోవాలంటే ఒక్కొక్కరు రూ. 100 చెల్లిస్తే కార్డు మంజూరు చేస్తారు. పది శాతం రాయితీ లభిస్తుంది. ప్రమాద వశాత్తు మరణిస్తే రూ. 1.70 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏడాది తర్వాత రూ. 150 చెల్లిస్తే రెన్యువల్ అవుతుంది. రెన్యువల్ అనంతరం ప్రమాదంలో మరణిస్తే రూ. 2 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది.
 
బీహారీ కార్డు
ఇది టూర్ ప్యాకేజీగా చెప్పవచ్చు. ఏసీ బస్సు మినహా రాష్ర్టంలోని ఏ ప్రాంతానికైనా అన్ని రకాల బస్సుల్లో ఏడు రోజుల ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. టికెట్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ పొందేందుకు అర్హత ఉంటుంది.

వికలాంగుల కోసం
వైకల్యంతో ఉన్నవారికి ప్రత్యేక కార్డు లభిస్తుంది. ప్రయాణ ధరలో ఏడాది కాలం పాటు యాభై శాతం రాయితీ పొందవచ్చు. ఇది పొందేందుకు రూ. 15 చెల్లిస్తే సరిపోతుంది. వికలత్వ ధ్రువీకరణ పత్రంతోపాటు, వికలత్వం కనిపించేలా ఉన్న రెండు ఫొటోలు డిపోలో అందించాల్సి ఉంటుంది.
 
మంత్లీ సీజన్ కావాలా?
నెల రోజుల ప్రయాణం కోసం 20 రోజుల చార్జీని ముందుగానే చెల్లిస్తే సీజన్ పాస్ లభిస్తుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.

శుభకార్యాలకు బస్సులు తీసుకెళ్లవచ్చు  
వివాహాలకు కోసం అవసరమైన బస్సులను ఆర్టీసీ నుంచి అద్దెకు తీసుకోవచ్చు. పల్లె వెలుగు బస్సుకైతే కిలోమీటరుకు రూ. 35, ఎక్స్‌ప్రెస్ బస్సుకైతే రూ. 41, డీలక్స్ బస్సుకైతే రూ. 37, సూపర్ లగ్జరీ బస్సుకైతే రూ. 38 చార్జి వేస్తారు. 330 కిలోమీటర్లు కనీస దూరంగా లెక్కిస్తారు. అంత కన్నా తక్కువ దూరమైనా ధర చెల్లించాల్సిందే!
 
విద్యార్థులకు ఉచిత పాస్..
విద్యాభ్యాసం చేస్తున్న 18 ఏళ్లలోపు బాలికలకు, 12 ఏళ్ల లోపు బాలురకు 35 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది.  ఈ పాస్‌ను ప్రతి సంవత్సరం సెప్టంబర్ నెలలో ఇస్తారు.
 
65 శాతం రాయితీతో స్టూడెంట్స్‌కు..
గమ్యం ఆధారంగా 65 శాతం రాయితీ లభిస్తుంది. 5 కిలోమీటర్లకు 85 రూపాయలు. 10 కిలోమీటర్లకు రూ.105.. పదిహేను కి.మీకు రూ. 135.. ఇరవై కిలోమీటర్లకు రూ. 180.. ఇరవై ఐదు కి.మీలకు రూ. 205..ముప్పై కిలోమీటర్లయితే రూ. 250 చెల్లించాలి. ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒక సారి రెన్యువల్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement