అనంతపురం రూరల్: అది అత్యంత విలువైన ప్రభుత్వ భూమి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. దానిపై ముగ్గురు నాయకుల కన్ను పడింది. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దాన్ని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఓ రెవెన్యూ ఉద్యోగి కూడా వారికి సహకారం అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం రూరల్ మండలం కురుగుంట మరువ కాలువ సమీపంలో సర్వే నంబర్ 83లో చాలా వరకు ప్రభుత్వ భూమి (08) ఉంది. ఇది ఎంత తక్కువ ధర అనుకున్నా ఎకరా రూ.పది లక్షలకు పైగా పలుకుతుంది. అత్యంత విలువైన భూమి కావడంతో 3.40 ఎకరాలను కబ్జా చేసేందుకు ముగ్గురు నాయకులు ప్లాన్ వేశారు. వారిలో ఒకరు దళిత సంఘం నేత కాగా, మరొకరు యువజన కాంగ్రెస్, ఇంకొకరు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు.
వీరు ముగ్గురూ కలిసి ఆరు నెలల క్రితం ఆ భూమిని దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ముందుగా పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కొందరితో అక్కడ గుడిసెలు వేయించారు. మిగిలిన స్థలంలో ఎవరూ అడుగు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. విలువైన ఈ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. పైగా వారికి ఓ రెవెన్యూ ఉద్యోగి సహకరించారు. అందుకు గాను రూ.లక్ష వరకు తీసుకున్నట్లు మండల రెవెన్యూ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్రిమినల్ కేసులు పెడతాం
కురుగుంట కాలువ వంక పొరంబోకు స్థలం ప్రభుత్వానిది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలు ఇచ్చే ప్రసక్తే లేదు. భూమిని కబ్జా చేస్తున్నట్లు ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులందాయి. విచారణ మొదలుపెట్టి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడబోం. వీలైనంత త్వరలో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం.
- తహశీల్దార్ లక్ష్మినారాయణ
ప్రభుత్వ అనుమతి లేదు
దళితులకు స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ భూమిని మా ఆధీనంలో పెట్టుకున్నాం. జనార్దన్‌రెడ్డి(యువజన కాంగ్రెస్)తో పాటు ధనుంజయ(జీవీఎస్)కు కూడా ఇందులో భాగమున్న మాట వాస్తవమే. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వ అనుమతి మా దగ్గర లేదు.
- మలయ్య, దళిత సంఘం నేత
వంకకు ఎసరు!
Published Wed, Jul 2 2014 2:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement