Revenue employ
-
వంకకు ఎసరు!
అనంతపురం రూరల్: అది అత్యంత విలువైన ప్రభుత్వ భూమి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. దానిపై ముగ్గురు నాయకుల కన్ను పడింది. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దాన్ని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఓ రెవెన్యూ ఉద్యోగి కూడా వారికి సహకారం అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం కురుగుంట మరువ కాలువ సమీపంలో సర్వే నంబర్ 83లో చాలా వరకు ప్రభుత్వ భూమి (08) ఉంది. ఇది ఎంత తక్కువ ధర అనుకున్నా ఎకరా రూ.పది లక్షలకు పైగా పలుకుతుంది. అత్యంత విలువైన భూమి కావడంతో 3.40 ఎకరాలను కబ్జా చేసేందుకు ముగ్గురు నాయకులు ప్లాన్ వేశారు. వారిలో ఒకరు దళిత సంఘం నేత కాగా, మరొకరు యువజన కాంగ్రెస్, ఇంకొకరు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు. వీరు ముగ్గురూ కలిసి ఆరు నెలల క్రితం ఆ భూమిని దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ముందుగా పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కొందరితో అక్కడ గుడిసెలు వేయించారు. మిగిలిన స్థలంలో ఎవరూ అడుగు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. విలువైన ఈ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. పైగా వారికి ఓ రెవెన్యూ ఉద్యోగి సహకరించారు. అందుకు గాను రూ.లక్ష వరకు తీసుకున్నట్లు మండల రెవెన్యూ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులు పెడతాం కురుగుంట కాలువ వంక పొరంబోకు స్థలం ప్రభుత్వానిది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలు ఇచ్చే ప్రసక్తే లేదు. భూమిని కబ్జా చేస్తున్నట్లు ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులందాయి. విచారణ మొదలుపెట్టి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడబోం. వీలైనంత త్వరలో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం. - తహశీల్దార్ లక్ష్మినారాయణ ప్రభుత్వ అనుమతి లేదు దళితులకు స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ భూమిని మా ఆధీనంలో పెట్టుకున్నాం. జనార్దన్‌రెడ్డి(యువజన కాంగ్రెస్)తో పాటు ధనుంజయ(జీవీఎస్)కు కూడా ఇందులో భాగమున్న మాట వాస్తవమే. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వ అనుమతి మా దగ్గర లేదు. - మలయ్య, దళిత సంఘం నేత -
తప్పుడు రికార్డులు సృష్టించి రూ.1.80 లక్షలు స్వాహా
మామిడాల (తిప్పర్తి), న్యూస్‌లైన్: ఇద్దరు రైతులకు మాయమాటలు చెప్పి తప్పుడు రికార్డులు సృష్టించి వారి పేరున రూ.1.80 లక్షలు బ్యాంకు రుణం కాజేసిన దళారీతో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెనికి చెందిన సుంకరబోయిన సైదులు మామిడాల సీబీఐలో 2010 సెప్టెంబర్ 27న ఖాతా తెరిచాడు. అదే గ్రామానికి చెందిన పాతకొట్ల రాములు గత ఏడాది జూలైలో ఖాతా తెరిచారు. తమ వ్యక్తిగత అవసరాల కోసం ఖాతాలు తెరిచినట్లు ఆ రైతులు తెలిపారు. అయితే ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన ఓ దళారి ఆ గ్రామ రెవెన్యూ అధికారి కలిసి ఈ ఇద్దరు రైతుల పేరున ఎల్లమ్మగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 490, 491/1లలో చెరో 10ఎకరాలు ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి పట్టాదారు పాస్‌పుస్తకాలు తయారు చేశారు. అంతటితో ఆగకుండా ఆ రైతుల పేరున సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రూ.1.80 లక్షల పంట రుణాన్ని డ్రా చేశారు. అయితే రైతులకు ఎలాంటి అనుమానం రాకుండా మాయమాటలు చెప్పి వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇచ్చి బ్యాంకు పాస్‌బుక్కులను మాత్రం దళారి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ తతంగం చూస్తుంటే ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయట పడిందిలా.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న సైదులు, రాములు ఇద్దరికి ఉపాధి పథకం ద్వారా బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం రూ.4 వేల చొప్పున జమ చేయాల్సి ఉంది. కానీ బ్యాంకు పాస్‌బుక్‌లు వీరి వద్ద లేవు. దీంతో వీరు దళారి వద్దకు వెళ్లి తమ బ్యాంకు ఖాతా బుక్‌లు ఇవ్వాలని నిలదీశారు. ఆ దళారి వారం పదిరోజులు తిప్పించుకొని ఆ బ్యాంకు ఖాతా పాస్ బుక్కులను ఆ రైతులకు ఇచ్చాడు. పనికాగానే తిరిగి వాటిని తనకు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన రాములు తనకొడుకుకు తాఖా బుక్ చూపించారు. అందులో డబ్బులు జమ అయి డ్రా అయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే రైతు.. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించగా రైతులిద్దరి పేర పంట రుణం రూ.1.80 లక్షలు ఇచ్చామని చెప్పాడు. దీంతో రైతులు దళారిని, గ్రామ రెవెన్యూ అధికారిని నిలదీశారు. దీంతో వారు బేరసారాలకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ రుణం వచ్చిందని రూ.10 వేలు ఇచ్చాడు నాకు ప్రభుత్వ రుణం రూ.10 వేలు వచ్చింది తిరిగి కట్టనవరసం లేదు మాఫీ అవుతుందని చెప్పాడు. పలు రికార్డుల్లో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత రూ.10 వేలు ఇచ్చాడు. మమ్మల్ని మోసం చేశారు. - సుంకరబోయిన సైదులు, బాధితుడు బ్యాంకు అప్పు రూ.90 వేలు కట్టాలంటున్నారు నాకు మాయమాటలు చెప్పి బ్యాంకుకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకున్నారు. తరువాత రూ.10 వేలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ. 90 వేల పంట రుణం కట్టాలంటున్నారు. మమ్మల్ని మోసం చేశారు. న్యాయం చేయాలి. - పాతకోట్ల రాములు, బాధితుడు -
రెవెన్యూ అంటే అంతే..
కాటారం, న్యూస్‌లైన్ : రెవెన్యూ అధికారులంటేనే అవినీతి జలగలను తలపిస్తున్నారు. జిల్లాలో వారానికి ఒకరిద్దరిని లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంటున్నా అవినీతి అధికారుల్లో మార్పు రావ డం లేదు. ఎలాంటి జంకూ లేకుండా మామూళ్ల కోసం సామాన్యులను పీడిస్తూనే ఉన్నారు. రైతును రూ.లక్ష డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగిని ఏసీబీ అధికారులు గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మహాముత్తారం మండలం ములుగుపల్లికి చెందిన చకినాల పెద్ద రవి, చకినాల చిన్న రవి అనే రైతులకు ములుగుపల్లి శివారులోని సర్వేనంబర్ 59/బీలో 1-25 ఎకరాల చొప్పున భూమి ఉంది. పహణిలో సర్వే నంబర్ 59/డి అని నమోదైంది. పెద్ద రవి బ్యాంకు రుణం కోసం వెళ్లగా సర్వే నంబర్ తప్పుగా ఉందని మార్పు చేయించుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. దీంతో మహా ముత్తారం ఆర్ఐ అబ్దుల్ రహీంను సంప్రదించాడు. సర్వే మార్పు చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే పట్టా వేరొకరికి చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ రవి ఆర్ఐ అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకుని రూ.55 వేల వరకు ముట్టజెప్పాడు. అయినా ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో విసుగు చెందిన రవి వారం రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి ప్రణాళిక ప్రకారం గురువారం రూ.10 వేలు ఇస్తానని ఆర్ఐకి ఫోన్ చేశాడు. దీంతో ఆర్ఐ రహీం, రవిని ఉదయం కాటారంలోని తన గదికి రమ్మన్నాడు. కాస్త అనుమానంతో ఉన్న ఆర్ఐ ఉదయం నుంచి బాధితుడిని తిప్పిస్తూ చివరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రధాన కూడలి వద్దకు రమ్మన్నాడు. అక్కడ డబ్బులు తీసుకుంటుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. అతడినుంచి నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుడు రవిని అభినందించారు. అవినీతి అధికారులను నిలదీయాలని, ఏసీబీకి పట్టించి వారి భరతం పట్టాలని డీఎస్పీ కోరారు. తమను 9440446150, 9440446139 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. డీఎస్పీ వెంట ఏసీబీ సీఐ వి.వి. రమణమూర్తి ఉన్నారు. లంచం అడిగిన అవినీతి అధికారిని సాక్షి పత్రిక సహకారంతోనే పట్టించినట్లు బాధితుడు రవి తెలిపాడు. పేపర్లో ఏసీబీ ఫోన్ నంబర్ చూసి వారికి ఫోన్ చేశానని పేర్కొన్నాడు. నాడు తహశీల్దార్.. నేడు ఆర్ఐ మహాముత్తారం : తన విధులు నిర్వర్తించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ ఏసీబీకి పట్టుబడడంతో కలకలం రేగింది. రెవెన్యూ కార్యాలయంలో పైసలు ముట్టజెప్పనిదే ఫైలు ముందుకు కదలడం లేదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో మహాముత్తారం తహశీల్దార్‌గా పనిచేసిన బాలకిషన్ 2009 జనవరిలో ఏసీబీకి పట్టుబడగా తాజాగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రహీం పట్టుబడడం గమనార్హం. -
సడలని సంకల్పం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సింహపురీయులు సడలని సంకల్పంతో పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే పట్టుదల వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమ నినాదాలు చేసీచేసి అలసిపోయిన మరో గుండె ఆగిపోయింది. రెవెన్యూ ఉద్యోగి అయిన సత్యనారాయణ సూళ్లూరుపేటలో శుక్రవారం వేకువజామున ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో 120 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. సత్యనారాయణ పురంలో రిలేదీక్షలను ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలిలో మానవహారం నిర్వహించారు. వీఆర్సీ, గాంధీబొమ్మ సెంటర్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధశాఖ ఉద్యోగులు ఎన్జీఓహోంలో రిలే దీక్షలు చేపట్టారు. బ్రాహ్మణులు మద్రాస్ బస్టాండ్ వద్ద మానవహారంతో నిరసన తెలిపారు. ఆర్యవైశ్యులు గాంధీబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పొదలకూరులో ముస్లింలు వంటావార్పు చేయడంతో పాటు రోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మనుబోలు, ముత్తుకూరులో బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లోని రిలేదీక్షల శిబిరంలో మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఫైనల్ఇయర్ ఈసీఈ విద్యార్థులు కూర్చున్నారు. సమైకాంధ్ర నిధి ఏర్పాటుచేసి విరాళాలు సేకరించారు. దుత్తలూరు, నందిపాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నేతలు మూయించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్ వద్ద ప్రైవేటు పాఠశాలల సిబ్బంది దీక్షలో కూర్చున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపైనే వడ్రంగి పనిచేసి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దిగ్విజయ్‌సింగ్, షిండేల దిష్టిబొమ్మలను ఆర్టీసీ కార్మికులు జేసీబీకి వేలాదీసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన బలిజ సంఘీయులు కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్ష చేశారు. గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు వాకాడులో జలదీక్ష నిర్వహించారు. సంగంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కావలిలో వ్యాపారుల సింహగర్జన జరిగింది. ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్ తన పాటలతో ప్రజల్లో సమైక్య స్ఫూర్తి పెంపొందించారు. మహిళా ఉపాధ్యాయులు ఉండమ్మా బొట్టు పెడతా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర రథానికి నాయుడుపేటలో ఘనస్వాగతం లభించింది. బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యభేరి హోరెత్తింది. కోవూరులోని ఎన్జీఓ హోంలో యువకులు, లేగుంటపాడులో గ్రామస్తుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.