సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సింహపురీయులు సడలని సంకల్పంతో పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే పట్టుదల వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమ నినాదాలు చేసీచేసి అలసిపోయిన మరో గుండె ఆగిపోయింది. రెవెన్యూ ఉద్యోగి అయిన సత్యనారాయణ సూళ్లూరుపేటలో శుక్రవారం వేకువజామున ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో 120 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. సత్యనారాయణ పురంలో రిలేదీక్షలను ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. వేదాయపాళెం సెంటర్‌లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలిలో మానవహారం నిర్వహించారు. వీఆర్‌సీ, గాంధీబొమ్మ సెంటర్‌లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
పశుసంవర్ధశాఖ ఉద్యోగులు ఎన్జీఓహోంలో రిలే దీక్షలు చేపట్టారు. బ్రాహ్మణులు మద్రాస్ బస్టాండ్ వద్ద మానవహారంతో నిరసన తెలిపారు. ఆర్యవైశ్యులు గాంధీబొమ్మ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. పొదలకూరులో ముస్లింలు వంటావార్పు చేయడంతో పాటు రోడ్డుపైనే ప్రార్థనలు చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మనుబోలు, ముత్తుకూరులో బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లోని రిలేదీక్షల శిబిరంలో మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఫైనల్‌ఇయర్ ఈసీఈ విద్యార్థులు కూర్చున్నారు. సమైకాంధ్ర నిధి ఏర్పాటుచేసి విరాళాలు సేకరించారు. దుత్తలూరు, నందిపాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నేతలు మూయించారు.
గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్ వద్ద ప్రైవేటు పాఠశాలల సిబ్బంది దీక్షలో కూర్చున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపైనే వడ్రంగి పనిచేసి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
దిగ్విజయ్‌సింగ్, షిండేల దిష్టిబొమ్మలను ఆర్టీసీ కార్మికులు జేసీబీకి వేలాదీసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన బలిజ సంఘీయులు కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్ష చేశారు. గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు వాకాడులో జలదీక్ష నిర్వహించారు. సంగంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కావలిలో వ్యాపారుల సింహగర్జన జరిగింది.
ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్ తన పాటలతో ప్రజల్లో సమైక్య స్ఫూర్తి పెంపొందించారు. మహిళా ఉపాధ్యాయులు ఉండమ్మా బొట్టు పెడతా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర రథానికి నాయుడుపేటలో ఘనస్వాగతం లభించింది. బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యభేరి హోరెత్తింది. కోవూరులోని ఎన్జీఓ హోంలో యువకులు, లేగుంటపాడులో గ్రామస్తుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
సడలని సంకల్పం
Published Sat, Sep 28 2013 3:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement