కాటారం, న్యూస్‌లైన్ : రెవెన్యూ అధికారులంటేనే అవినీతి జలగలను తలపిస్తున్నారు. జిల్లాలో వారానికి ఒకరిద్దరిని లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంటున్నా అవినీతి అధికారుల్లో మార్పు రావ డం లేదు. ఎలాంటి జంకూ లేకుండా మామూళ్ల కోసం సామాన్యులను పీడిస్తూనే ఉన్నారు. రైతును రూ.లక్ష డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగిని ఏసీబీ అధికారులు గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మహాముత్తారం మండలం ములుగుపల్లికి చెందిన చకినాల పెద్ద రవి, చకినాల చిన్న రవి అనే రైతులకు ములుగుపల్లి శివారులోని సర్వేనంబర్ 59/బీలో 1-25 ఎకరాల చొప్పున భూమి ఉంది. పహణిలో సర్వే నంబర్ 59/డి అని నమోదైంది.
పెద్ద రవి బ్యాంకు రుణం కోసం వెళ్లగా సర్వే నంబర్ తప్పుగా ఉందని మార్పు చేయించుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. దీంతో మహా ముత్తారం ఆర్‌ఐ అబ్దుల్ రహీంను సంప్రదించాడు. సర్వే మార్పు చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆర్‌ఐ డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే పట్టా వేరొకరికి చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ రవి ఆర్‌ఐ అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకుని రూ.55 వేల వరకు ముట్టజెప్పాడు. అయినా ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో విసుగు చెందిన రవి వారం రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి ప్రణాళిక ప్రకారం గురువారం రూ.10 వేలు ఇస్తానని ఆర్‌ఐకి ఫోన్ చేశాడు.
దీంతో ఆర్‌ఐ రహీం, రవిని ఉదయం కాటారంలోని తన గదికి రమ్మన్నాడు. కాస్త అనుమానంతో ఉన్న ఆర్‌ఐ ఉదయం నుంచి బాధితుడిని తిప్పిస్తూ చివరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రధాన కూడలి వద్దకు రమ్మన్నాడు. అక్కడ డబ్బులు తీసుకుంటుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐని పట్టుకున్నారు. అతడినుంచి నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుడు రవిని అభినందించారు.
అవినీతి అధికారులను నిలదీయాలని, ఏసీబీకి పట్టించి వారి భరతం పట్టాలని డీఎస్పీ కోరారు. తమను 9440446150, 9440446139 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. డీఎస్పీ వెంట ఏసీబీ సీఐ వి.వి. రమణమూర్తి ఉన్నారు. లంచం అడిగిన అవినీతి అధికారిని సాక్షి పత్రిక సహకారంతోనే పట్టించినట్లు బాధితుడు రవి తెలిపాడు. పేపర్లో ఏసీబీ ఫోన్ నంబర్ చూసి వారికి ఫోన్ చేశానని పేర్కొన్నాడు.
నాడు తహశీల్దార్.. నేడు ఆర్‌ఐ
మహాముత్తారం : తన విధులు నిర్వర్తించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్‌ఐ ఏసీబీకి పట్టుబడడంతో కలకలం రేగింది. రెవెన్యూ కార్యాలయంలో పైసలు ముట్టజెప్పనిదే ఫైలు ముందుకు కదలడం లేదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో మహాముత్తారం తహశీల్దార్‌గా పనిచేసిన బాలకిషన్ 2009 జనవరిలో ఏసీబీకి పట్టుబడగా తాజాగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రహీం పట్టుబడడం గమనార్హం.