మామిడాల (తిప్పర్తి), న్యూస్‌లైన్: ఇద్దరు రైతులకు మాయమాటలు చెప్పి తప్పుడు రికార్డులు సృష్టించి వారి పేరున రూ.1.80 లక్షలు బ్యాంకు రుణం కాజేసిన దళారీతో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెనికి చెందిన సుంకరబోయిన సైదులు మామిడాల సీబీఐలో 2010 సెప్టెంబర్ 27న ఖాతా తెరిచాడు. అదే గ్రామానికి చెందిన పాతకొట్ల రాములు గత ఏడాది జూలైలో ఖాతా తెరిచారు. తమ వ్యక్తిగత అవసరాల కోసం ఖాతాలు తెరిచినట్లు ఆ రైతులు తెలిపారు.
అయితే ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన ఓ దళారి ఆ గ్రామ రెవెన్యూ అధికారి కలిసి ఈ ఇద్దరు రైతుల పేరున ఎల్లమ్మగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 490, 491/1లలో చెరో 10ఎకరాలు ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి పట్టాదారు పాస్‌పుస్తకాలు తయారు చేశారు. అంతటితో ఆగకుండా ఆ రైతుల పేరున సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రూ.1.80 లక్షల పంట రుణాన్ని డ్రా చేశారు. అయితే రైతులకు ఎలాంటి అనుమానం రాకుండా మాయమాటలు చెప్పి వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇచ్చి బ్యాంకు పాస్‌బుక్కులను మాత్రం దళారి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ తతంగం చూస్తుంటే ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బయట పడిందిలా..
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న సైదులు, రాములు ఇద్దరికి ఉపాధి పథకం ద్వారా బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం రూ.4 వేల చొప్పున జమ చేయాల్సి ఉంది. కానీ బ్యాంకు పాస్‌బుక్‌లు వీరి వద్ద లేవు. దీంతో వీరు దళారి వద్దకు వెళ్లి తమ బ్యాంకు ఖాతా బుక్‌లు ఇవ్వాలని నిలదీశారు. ఆ దళారి వారం పదిరోజులు తిప్పించుకొని ఆ బ్యాంకు ఖాతా పాస్ బుక్కులను ఆ రైతులకు ఇచ్చాడు. పనికాగానే తిరిగి వాటిని తనకు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన రాములు తనకొడుకుకు తాఖా బుక్ చూపించారు. అందులో డబ్బులు జమ అయి డ్రా అయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే రైతు.. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించగా రైతులిద్దరి పేర పంట రుణం రూ.1.80 లక్షలు ఇచ్చామని చెప్పాడు. దీంతో రైతులు దళారిని, గ్రామ రెవెన్యూ అధికారిని నిలదీశారు. దీంతో వారు బేరసారాలకు వచ్చినట్లు తెలిసింది.
ప్రభుత్వ రుణం వచ్చిందని రూ.10 వేలు ఇచ్చాడు
నాకు ప్రభుత్వ రుణం రూ.10 వేలు వచ్చింది తిరిగి కట్టనవరసం లేదు మాఫీ అవుతుందని చెప్పాడు. పలు రికార్డుల్లో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత రూ.10 వేలు ఇచ్చాడు. మమ్మల్ని మోసం చేశారు.
- సుంకరబోయిన సైదులు, బాధితుడు
బ్యాంకు అప్పు రూ.90 వేలు కట్టాలంటున్నారు
నాకు మాయమాటలు చెప్పి బ్యాంకుకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకున్నారు. తరువాత రూ.10 వేలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ. 90 వేల పంట రుణం కట్టాలంటున్నారు. మమ్మల్ని మోసం చేశారు. న్యాయం చేయాలి.
- పాతకోట్ల రాములు, బాధితుడు
తప్పుడు రికార్డులు సృష్టించి రూ.1.80 లక్షలు స్వాహా
Published Thu, Mar 13 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement