‘ఏకం’లో కల్కి భగవాన్‌ గుట్టు? | IT Raids: Kalki Bhagavan Couple Goes Underground! | Sakshi
Sakshi News home page

‘ఏకం’లో కల్కి భగవాన్‌ గుట్టు?

Published Thu, Oct 17 2019 5:06 PM | Last Updated on Thu, Oct 17 2019 8:23 PM

IT Raids: Kalki Bhagavan Couple Goes Underground! - Sakshi

సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక ముసుగులో  కల్కి ఆశ్రమం పేరిట  భారీగా ఆస్తులను కూడబెట్టిన ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం చేపట్టిన తనిఖీలు గురువారం రెండోరోజు కూడా కొనసాగాయి.  ఈ రెండు రోజుల్లో కల్కి భగవాన్, ఆయన కుమారుడు కృష్ణాజీ నుంచి రూ.24 కోట్ల నగదు, రూ.9.80 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ..మొత్తం రూ.35 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

కాగా కల్కి భగవాన్‌ ఆశ్రమమే ఓ మిస్టరీ. అక్కడ ఏం జరుగుతుందో బయటి వారికి తెలియదు. వారేం చేస్తారో చెప్పరు. బయటకు మాత్రం ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు.. గ్రామాల అభివృద్ధి. ఐదెకరాల నుంచి ప్రారంభమైన కల్కి ఆశ్రమం.. వేలాది ఎకరాలకు విస్తరించింది. అయితే కొంత కాలంగా కల్కి పేరు మారింది. ఇప్పుడు ‘ఏకం’. ఇదొక్కటే కాదు.. రకరకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్కి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఇన్నేళ్లుగా ఆశ్రమం వైపు చూడని ఐటీ అధికారులు అకస్మాత్తుగా ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 

విజయ్‌కుమార్‌ నాయుడు అలియాస్‌ కల్కి భగవాన్‌ తొలినాళ్లలో బీమా సంస్థలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి 1989లో కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద జీవాశ్రమం పేరుతో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అది కాస్త దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్‌ కుమార్‌ వరదయ్యపాళెంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఐదెకరాల్లో కల్కి ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత కొన్నాళ్లకు రామకుప్పం వద్ద ఉన్న జీవాశ్రమం ‘సత్యలోకం’గా మారింది. ప్రధాన కార్యాలయం తమిళనాడు చెన్నైలో ఏర్పాటు చేసుకున్నారు. విజయకుమార్‌ భార్య పద్మావతి, కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతి ఉన్నారు.

భారీగా వసూలు చేసేవారని ప్రచారం
కల్కి భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయకుమార్‌ ఆశ్రమ కార్యకలాపాలను ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు. కల్కి భగవాన్‌ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్‌ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు వసూలు చేసేవారని ప్రచారం జరుగుతోంది. ఆధ్యాత్మికం, ధ్యానం శిక్షణ కార్యక్రమాల పేరుతో తరగతులు నిర్వహించేవారు. రెండు, మూడు రోజుల కాలపరిమితిని పెట్టి శిక్షణ ఇచ్చేవారు. ఇలా ఆశ్రమంలో రకరకాల కార్యక్రమాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని, భూముల కొనుగోళ్లపై అక్రమాలు జరిగాయని కల్కి భగవాన్‌పై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటు కల్కి కుమారుడు కృష్ణాజీపైనా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

‘కల్కి’ కనుమరుగు
2008లో వరదయ్యపాళెం బత్తలవల్లంలో నిర్మించిన ‘గోల్డెన్‌ సిటీ’ ప్రారంభం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు పైగా మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొన్ని రోజులు ఆశ్రమం మూతపడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించారు. ఆశ్రమం చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో ‘కల్కి’ పేరు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. కల్కి ఆలయాన్ని గోల్డెన్‌ సిటీగా ఆ తర్వాత ‘వన్నెస్‌’గా మార్చారు. ప్రస్తుతం ‘ఏకం’ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. సేవా కార్యక్రమాల కోసం కల్కి రూరల్‌ డెవలప్‌మెంట్‌ పేరు పెట్టారు. దాన్ని ‘వన్‌ హ్యుమానిటీ కేర్‌’ పేరుగా మార్చారు. ‘వన్నెస్‌’ యూనివర్సిటీ పేరిట ధ్యాన తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘ఓ అండ్‌ ఓ’ అకాడమీగా మార్చారు. ఆర్థిక లావాదేవీలన్నీ మొదట కల్కి ట్రస్ట్‌ పేరుతో జరిగేవి. అయితే కొన్ని రోజులకు ‘గోల్డెన్‌ షెల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో లావాదేవీలు నెరుపుతున్నారు.

చెల్లింపులు ఆపేయ్యడంతో..
కల్కి ఆశ్రమంలో సుమారు 1,500 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరందరికీ నెలనెలా వేతనాలు చెల్లించేవారు. విరాళాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీ రిటర్న్స్‌ చూపించేవారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కూడా చెల్లించేవారు. సుమారు మూడేళ్లుగా పన్నులు చెల్లించడం మానేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఐటీ రిటర్న్స్‌ కూడా చెయ్యకపోవడంతో ప్రభుత్వం కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టింది.  కల్కి ఆశ్రమానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం తమిళనాడులో ఉండడంతో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమానికి సంబంధించిన కార్యాలయాలు, భూ కొనుగోళ్లు, విరాళాలపై విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి.

పోలీసుల పహారాలో ప్రధాన ఆశ్రమం
వరదయ్యపాళెంలోని కల్కి భగవాన్‌ ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. దాడులు సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి కానీ అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవన్‌ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్‌  నిర్వహకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది.

అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సుమారు రూ.40 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక కల్కి భగవాన్ ఆశ్రమంలో రెండోరోజు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి వరదాయపాలెంలో కల్కి ఆశ్రమంలో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ, కల్కి ఆశ్రమాలు, కంపెనీల్లో మరికొన్ని రోజులు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నందున అధికారికంగా వివరాలు ఏవీ ప్రకటించలేమని చెప్పారు.


చదవండి:

కల్కి ఆశ్రమాల్లో కొనసాగుతున్న తనిఖీలు

 ‘కల్కి భగవాన్‌’ పై ఐటీ దాడులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement