Varadayapalem
-
‘కల్కి’ ఆస్తులు రూ.500 కోట్లు పైనే!
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై/తిరుపతి: వెల్నెస్ కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న కల్కి ఆశ్రమం, కార్యాలయాల్లో మూడు రోజులుగా సాగుతున్న ఇన్‌కం టాక్స్ తనిఖీల్లో రూ.500 కోట్లకు పైగా వెల్లడించని ఆస్తులు వెలుగు చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఏకత్వం’ అనే తత్వంతో కల్గి భగవాన్ స్థాపించిన ట్రస్టు వెల్నెస్ కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాల పేరుతో ఏపీలోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా ఆశ్రమం ఎవరిదనే అంశాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించలేదు. ఆ ప్రకటనలోని వివరాలివీ. ‘ఆధ్యాత్మిక గురువు స్థాపించిన ఈ గ్రూపు క్రమంగా దేశ, విదేశాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణం, క్రీడలు వంటి అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూపును ఆధ్యాత్మిక గురువు, అతడి కుమారుడు నిర్వహిస్తున్నారు. విదేశీయులు ఈ కోర్సుల్లో చేరడంతో ఈ గ్రూపు విదేశీ మారక ద్రవ్యాన్నీ సంపాదించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వరదయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయి. ఈ గ్రూపు ఆశ్రమాలు, విభిన్న ప్రాంతాల్లో వసూలు చేస్తున్న సొమ్మును లెక్కల్లో చూపకుండా మళ్లిస్తూ స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నట్టుగా కీలక ఉద్యోగుల నుంచి సాక్ష్యాలు లభించాయి. 2014–15 నుంచి లెక్క చూపని ఇలాంటి నగదు రూ.409 కోట్లుగా ఉన్నట్లు ఐటీ విభాగం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.43.90 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకుంది. ఇవికాకుండా విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేసింది. దీని విలువ రూ.18 కోట్లు. రూ.26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువ గల 1,271 క్యారెట్ల వజ్రాలను కూడా సీజ్ చేసింది. వీటి విలువ రూ.93 కోట్లు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి’ అని పేర్కొంది. ఇదే వివరాలతో ఆదాయ పన్ను శాఖ చెన్నైలో మరో ప్రకటన విడుదల చేసింది. ఎవరీ ‘కల్కి’: విజయకుమార్ అలియాస్ కల్కి తాను విష్ణుమూర్తి 11వ అవతారమని ప్రజలను నమ్మించి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన స్వగ్రామం తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాతం. 1949 మే 7న జన్మించారు. 1977లో పద్మావతి అనే మహిళను వివాహమాడిన ఆయన 35 ఏళ్ల వయసులో కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పంలో ‘జీవాశ్రమం’ పేరుతో గుర్తింపు లేని పాఠశాల ఏర్పాటు చేశారు. ఆశించినంత ఆదాయం రాకపోవడంతో 1991లో దానిని మూసేశారు. ఆ తరువాత పాఠశాలను ‘సత్యలోకం’గా మార్చి కల్కి అవతారం ఎత్తారు. తన భార్య అమ్మా భగవాన్ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో ఐదెకరాల పొలం కొని కల్కి ఆశ్రమాన్ని స్థాపించారు. తనతోపాటు తన భార్య దర్శనానికీ ధరలు నిర్ణయించారు. కేవలం పాదం మాత్రం చూడాలనుకునే వారు రూ.వెయ్యి, పాద పూజ చేయాలంటే రూ.5 వేలు, మాట్లాడాలంటే రూ.25 వేలు, ఆశ్రమంలోనే రెండు రోజుల దీక్ష చేయాలంటే రూ.50 వేలు వసూలు చేయటం ప్రారంభించారు. కొన్నాళ్లకు ‘మూలమంత్రం’ అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్లో ఉంచి, దానిని భారతీయులకు రూ.50 వేలు, విదేశీయులకు రూ.లక్ష చొప్పున విక్రయించటం ప్రారంభించారు. 2008లో వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో రూ.300 కోట్లతో ‘గోల్డె¯న్ టెంపుల్’ నిర్మించారు. ఆ తరువాత వివిధ రాష్ట్రాల్లో ఆశ్రమాలు, కార్యాలయాలు ప్రారంభించారు. కల్కితోపాటు ఆయన కుమారుడు కృష్ణాజీపైనా అనేక ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. -
ఇంతకీ కల్కి దంపతులు ఎక్కడ?
సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక ముసుగులో భారీగా ఆస్తులను కూడబెట్టిన కల్కి భగవాన్ దంపతుల ఆచూకీ ప్రస్తుతం మిస్టరీగా మారింది. గత మూడు రోజులుగా కల్కి ఆశ్రమాలతో పాటు ప్రధాన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ కల్కి భగవాన్, ఆయన భార్య పద్మావతి జాడ తెలియడం లేదు. దీంతో వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే దానిపై ఐటీ అధికారుల బృందం కూపీ లాగుతోంది. ఇక తమిళనాడులోని కల్కి ఆశ్రమంలో పాటు ఆయన కుమారుడు కృష్ణాజీకి చెందిన కార్యాలయంలో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున వజ్రాలు, బంగారం, స్వదేశీ, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అయిదు కోట్లు విలువ చేసే వజ్రాలు, రూ.26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, రూ.40,.39 కోట్ల నగదుతో పాటు రూ.18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం రూ.93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అలాగే రూ.409 కోట్లుకు సంబంధించి ఐటీ అధికారులు ఆధారాలు అడుగుతున్నారు. కాగా వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన విజయకుమార్ నాయుడు చెన్నైలో ఎల్ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అయితే 1989లో తాను విష్ణుమూర్తి అవతారాల్లోని కల్కి భగవాన్ అని తనకు తానుగా ప్రకటించుకున్నారు. చెన్నై పూందమల్లి సమీపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆధ్యాత్మిక ప్రభోధనలతో అమాయక భక్తులను ఆకట్టుకోవడం ప్రారంభించారు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో వందలాది ఎకరాల్లో నిర్మించుకున్న ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో శాఖలను విస్తరింపజేశారు. ఆశ్రమాల్లో ఏం జరుగుతోందో అంతరంగికులకు మినహా బయటి ప్రపంచానికి తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్తపడతారు. ఆశ్రమానికి వచ్చిన పలువురు విదేశీ యువతులు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా దేశాల నుంచి చట్ట విరుద్దంగా ఆశ్రమానికి పెద్ద ఎత్తున డబ్బు ముడుతున్నట్లు చెబుతుంటారు. అలాగే ఆయా దేశాల్లో కల్కి భగవాన్ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులున్నాయి. స్విస్ బ్యాంక్‌లో కల్కి ఆశ్రమ నిర్వాహకుల పేరున కోట్లాది రూపాయలు డిపాజిట్టు చేసిఉన్నట్లు సమాచారం. తమిళనాడులో మాత్రమే బినామీ పేర్లతో వెయ్యి ఎకరాల భూములు, అనేక కంపెనీల్లో కోట్లాదిరూపాయల పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో రూ.1000 కోట్ల పెట్టుబడితో రియల్ఎస్టేట్ కంపెనీ, లాస్ఏంజెల్స్లో మరో కంపెనీలు నడుపుతున్న నేపథ్యంలో 400 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో 40 కల్కి కేంద్రాలపై బుధవారం నుంచి మెరుపుదాడులు ప్రారంభించారు. స్వదేశీ, విదేశీ నగదు కలుపుకుని మొత్తం రూ.500 కోట్లు ఐటీ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. కాగా కల్కి దంపతులు గత కొంతకాలంగా ఆశ్రమాల్లో ఉంటున్నట్లు అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు కల్కి భగవాన్ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘ఏకం’లో కల్కి భగవాన్ గుట్టు? కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం అందుబాటులో లేని కల్కి భగవాన్.. ‘కల్కి భగవాన్’ పై ఐటీ దాడులు -
‘ఏకం’లో కల్కి భగవాన్ గుట్టు?
సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక ముసుగులో కల్కి ఆశ్రమం పేరిట భారీగా ఆస్తులను కూడబెట్టిన ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం చేపట్టిన తనిఖీలు గురువారం రెండోరోజు కూడా కొనసాగాయి. ఈ రెండు రోజుల్లో కల్కి భగవాన్, ఆయన కుమారుడు కృష్ణాజీ నుంచి రూ.24 కోట్ల నగదు, రూ.9.80 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ..మొత్తం రూ.35 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కల్కి భగవాన్ ఆశ్రమమే ఓ మిస్టరీ. అక్కడ ఏం జరుగుతుందో బయటి వారికి తెలియదు. వారేం చేస్తారో చెప్పరు. బయటకు మాత్రం ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు.. గ్రామాల అభివృద్ధి. ఐదెకరాల నుంచి ప్రారంభమైన కల్కి ఆశ్రమం.. వేలాది ఎకరాలకు విస్తరించింది. అయితే కొంత కాలంగా కల్కి పేరు మారింది. ఇప్పుడు ‘ఏకం’. ఇదొక్కటే కాదు.. రకరకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్కి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఇన్నేళ్లుగా ఆశ్రమం వైపు చూడని ఐటీ అధికారులు అకస్మాత్తుగా ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విజయ్‌కుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ తొలినాళ్లలో బీమా సంస్థలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి 1989లో కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద జీవాశ్రమం పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అది కాస్త దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్ కుమార్ వరదయ్యపాళెంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఐదెకరాల్లో కల్కి ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత కొన్నాళ్లకు రామకుప్పం వద్ద ఉన్న జీవాశ్రమం ‘సత్యలోకం’గా మారింది. ప్రధాన కార్యాలయం తమిళనాడు చెన్నైలో ఏర్పాటు చేసుకున్నారు. విజయకుమార్ భార్య పద్మావతి, కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతి ఉన్నారు. భారీగా వసూలు చేసేవారని ప్రచారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయకుమార్ ఆశ్రమ కార్యకలాపాలను ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు. కల్కి భగవాన్ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్ఆర్ఐలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు వసూలు చేసేవారని ప్రచారం జరుగుతోంది. ఆధ్యాత్మికం, ధ్యానం శిక్షణ కార్యక్రమాల పేరుతో తరగతులు నిర్వహించేవారు. రెండు, మూడు రోజుల కాలపరిమితిని పెట్టి శిక్షణ ఇచ్చేవారు. ఇలా ఆశ్రమంలో రకరకాల కార్యక్రమాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని, భూముల కొనుగోళ్లపై అక్రమాలు జరిగాయని కల్కి భగవాన్‌పై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటు కల్కి కుమారుడు కృష్ణాజీపైనా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ‘కల్కి’ కనుమరుగు 2008లో వరదయ్యపాళెం బత్తలవల్లంలో నిర్మించిన ‘గోల్డెన్ సిటీ’ ప్రారంభం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు పైగా మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొన్ని రోజులు ఆశ్రమం మూతపడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించారు. ఆశ్రమం చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో ‘కల్కి’ పేరు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. కల్కి ఆలయాన్ని గోల్డెన్ సిటీగా ఆ తర్వాత ‘వన్నెస్’గా మార్చారు. ప్రస్తుతం ‘ఏకం’ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. సేవా కార్యక్రమాల కోసం కల్కి రూరల్ డెవలప్మెంట్ పేరు పెట్టారు. దాన్ని ‘వన్ హ్యుమానిటీ కేర్’ పేరుగా మార్చారు. ‘వన్నెస్’ యూనివర్సిటీ పేరిట ధ్యాన తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘ఓ అండ్ ఓ’ అకాడమీగా మార్చారు. ఆర్థిక లావాదేవీలన్నీ మొదట కల్కి ట్రస్ట్ పేరుతో జరిగేవి. అయితే కొన్ని రోజులకు ‘గోల్డెన్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో లావాదేవీలు నెరుపుతున్నారు. చెల్లింపులు ఆపేయ్యడంతో.. కల్కి ఆశ్రమంలో సుమారు 1,500 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరందరికీ నెలనెలా వేతనాలు చెల్లించేవారు. విరాళాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీ రిటర్న్స్ చూపించేవారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కూడా చెల్లించేవారు. సుమారు మూడేళ్లుగా పన్నులు చెల్లించడం మానేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ కూడా చెయ్యకపోవడంతో ప్రభుత్వం కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టింది. కల్కి ఆశ్రమానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం తమిళనాడులో ఉండడంతో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమానికి సంబంధించిన కార్యాలయాలు, భూ కొనుగోళ్లు, విరాళాలపై విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసుల పహారాలో ప్రధాన ఆశ్రమం వరదయ్యపాళెంలోని కల్కి భగవాన్ ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. దాడులు సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి కానీ అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వరదయ్యపాలెం, బీఎన్ కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్ నిర్వహకుడు లోకేష్ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సుమారు రూ.40 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక కల్కి భగవాన్ ఆశ్రమంలో రెండోరోజు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి వరదాయపాలెంలో కల్కి ఆశ్రమంలో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ, కల్కి ఆశ్రమాలు, కంపెనీల్లో మరికొన్ని రోజులు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నందున అధికారికంగా వివరాలు ఏవీ ప్రకటించలేమని చెప్పారు. చదవండి: కల్కి ఆశ్రమాల్లో కొనసాగుతున్న తనిఖీలు ‘కల్కి భగవాన్’ పై ఐటీ దాడులు -
సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ
తిరుపతి : చిత్తూరు జిల్లా వరదాయపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు గత రాత్రి గ్యాస్ కట్టర్లతో కిటికీలు తొలగించి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు నిర్థారించారు. అయితే ఎంత నగదు చోరీకి గురైందనే విషయంపై మాత్రం బ్యాంక్ సిబ్బంది పెదవి విప్పటం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్‌తో రైతును ఢీకొట్టి హత్య
చిత్తూరు: ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. తమకు అడ్డొచ్చిన వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా ఓ రైతు ప్రాణాలను బలితీసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతును ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. వరదాయపాలెం మండలం సాకంబేడు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వాప్తంగా ఇసుక మాఫియా ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులను సైతం చంపేందుకు వెనుకాడడం లేదు. బరితెగిస్తున్న ఇసుక మాఫియాకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. -
బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై దాడి, వాహనం ధ్వంసం
రాయలసీమ నేత, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడంతో తిరుపతి సమీపంలోని వరదాయపాలెంలో స్థానికులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళుతున్న ఆటో సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఆటో డ్రైవర్ ను బైరెడ్డి డ్రైవర్ చితకబాదారు. డ్రైవర్ పై దాడి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు బైరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్ ను స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. స్థానికులు జరిపిన దాడిలో బైరెడ్డి డ్రైవర్ కు తీవ్రగాయలైనట్టు సమాచారం. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపైనా స్థానికులు దాడి చేసినట్టు తెలుస్తోంది.