కల్కి ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై/తిరుపతి: వెల్‌నెస్ కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న కల్కి ఆశ్రమం, కార్యాలయాల్లో మూడు రోజులుగా సాగుతున్న ఇన్‌కం టాక్స్ తనిఖీల్లో రూ.500 కోట్లకు పైగా వెల్లడించని ఆస్తులు వెలుగు చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఏకత్వం’ అనే తత్వంతో కల్గి భగవాన్ స్థాపించిన ట్రస్టు వెల్‌నెస్ కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాల పేరుతో ఏపీలోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా ఆశ్రమం ఎవరిదనే అంశాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించలేదు. ఆ ప్రకటనలోని వివరాలివీ. ‘ఆధ్యాత్మిక గురువు స్థాపించిన ఈ గ్రూపు క్రమంగా దేశ, విదేశాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణం, క్రీడలు వంటి అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూపును ఆధ్యాత్మిక గురువు, అతడి కుమారుడు నిర్వహిస్తున్నారు.
విదేశీయులు ఈ కోర్సుల్లో చేరడంతో ఈ గ్రూపు విదేశీ మారక ద్రవ్యాన్నీ సంపాదించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వరదయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయి. ఈ గ్రూపు ఆశ్రమాలు, విభిన్న ప్రాంతాల్లో వసూలు చేస్తున్న సొమ్మును లెక్కల్లో చూపకుండా మళ్లిస్తూ స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నట్టుగా కీలక ఉద్యోగుల నుంచి సాక్ష్యాలు లభించాయి. 2014–15 నుంచి లెక్క చూపని ఇలాంటి నగదు రూ.409 కోట్లుగా ఉన్నట్లు ఐటీ విభాగం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.43.90 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకుంది. ఇవికాకుండా విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేసింది. దీని విలువ రూ.18 కోట్లు. రూ.26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువ గల 1,271 క్యారెట్ల వజ్రాలను కూడా సీజ్ చేసింది. వీటి విలువ రూ.93 కోట్లు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి’ అని పేర్కొంది. ఇదే వివరాలతో ఆదాయ పన్ను శాఖ చెన్నైలో మరో ప్రకటన విడుదల చేసింది.
ఎవరీ ‘కల్కి’: విజయకుమార్ అలియాస్ కల్కి తాను విష్ణుమూర్తి 11వ అవతారమని ప్రజలను నమ్మించి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన స్వగ్రామం తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాతం. 1949 మే 7న జన్మించారు. 1977లో పద్మావతి అనే మహిళను వివాహమాడిన ఆయన 35 ఏళ్ల వయసులో కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పంలో ‘జీవాశ్రమం’ పేరుతో గుర్తింపు లేని పాఠశాల ఏర్పాటు చేశారు. ఆశించినంత ఆదాయం రాకపోవడంతో 1991లో దానిని మూసేశారు. ఆ తరువాత పాఠశాలను ‘సత్యలోకం’గా మార్చి కల్కి అవతారం ఎత్తారు. తన భార్య అమ్మా భగవాన్ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో ఐదెకరాల పొలం కొని కల్కి ఆశ్రమాన్ని స్థాపించారు.
తనతోపాటు తన భార్య దర్శనానికీ ధరలు నిర్ణయించారు. కేవలం పాదం మాత్రం చూడాలనుకునే వారు రూ.వెయ్యి, పాద పూజ చేయాలంటే రూ.5 వేలు, మాట్లాడాలంటే రూ.25 వేలు, ఆశ్రమంలోనే రెండు రోజుల దీక్ష చేయాలంటే రూ.50 వేలు వసూలు చేయటం ప్రారంభించారు. కొన్నాళ్లకు ‘మూలమంత్రం’ అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో ఉంచి, దానిని భారతీయులకు రూ.50 వేలు, విదేశీయులకు రూ.లక్ష చొప్పున విక్రయించటం ప్రారంభించారు. 2008లో వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో రూ.300 కోట్లతో ‘గోల్డె¯న్ టెంపుల్’ నిర్మించారు. ఆ తరువాత వివిధ రాష్ట్రాల్లో ఆశ్రమాలు, కార్యాలయాలు ప్రారంభించారు. కల్కితోపాటు ఆయన కుమారుడు కృష్ణాజీపైనా అనేక ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment