ఇంతకీ కల్కి దంపతులు ఎక్కడ? | Kalki Bhagavan Couple go underground! | Sakshi
Sakshi News home page

ఇంతకీ కల్కి భగవాన్‌ దంపతులు ఎక్కడ?

Published Fri, Oct 18 2019 6:45 PM | Last Updated on Fri, Oct 18 2019 7:51 PM

Kalki Bhagavan Couple go underground! - Sakshi

సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక ముసుగులో భారీగా ఆస్తులను కూడబెట్టిన కల్కి భగవాన్‌ దంపతుల ఆచూకీ ప్రస్తుతం మిస్టరీగా మారింది. గత మూడు రోజులుగా కల్కి ఆశ్రమాలతో పాటు ప్రధాన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ కల్కి భగవాన్‌, ఆయన భార్య పద్మావతి జాడ తెలియడం లేదు. దీంతో వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే దానిపై ఐటీ అధికారుల బృందం కూపీ లాగుతోంది.

ఇక తమిళనాడులోని కల్కి ఆశ్రమంలో పాటు ఆయన కుమారుడు కృష్ణాజీకి చెందిన కార్యాలయంలో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున వజ్రాలు, బంగారం, స్వదేశీ, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అయిదు కోట్లు విలువ చేసే వజ్రాలు, రూ.26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, రూ.40,.39 కోట్ల నగదుతో పాటు రూ.18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం రూ.93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. అలాగే రూ.409 కోట్లుకు సంబంధించి ఐటీ అధికారులు ఆధారాలు అడుగుతున్నారు. 

కాగా వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన విజయకుమార్‌ నాయుడు చెన్నైలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. అయితే 1989లో తాను విష్ణుమూర్తి అవతారాల్లోని కల్కి భగవాన్‌ అని తనకు తానుగా ప్రకటించుకున్నారు. చెన్నై పూందమల్లి సమీపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆధ్యాత్మిక ప్రభోధనలతో అమాయక భక్తులను ఆకట్టుకోవడం ప్రారంభించారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో వందలాది ఎకరాల్లో నిర్మించుకున్న ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో శాఖలను విస్తరింపజేశారు. ఆశ్రమాల్లో ఏం జరుగుతోందో అంతరంగికులకు మినహా బయటి ప్రపంచానికి తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్తపడతారు.

ఆశ్రమానికి వచ్చిన పలువురు విదేశీ యువతులు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా దేశాల నుంచి చట్ట విరుద్దంగా ఆశ్రమానికి పెద్ద ఎత్తున డబ్బు ముడుతున్నట్లు చెబుతుంటారు. అలాగే ఆయా దేశాల్లో కల్కి భగవాన్‌ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులున్నాయి. స్విస్‌ బ్యాంక్‌లో కల్కి ఆశ్రమ నిర్వాహకుల పేరున కోట్లాది రూపాయలు డిపాజిట్టు చేసిఉన్నట్లు సమాచారం. తమిళనాడులో మాత్రమే బినామీ పేర్లతో వెయ్యి ఎకరాల భూములు, అనేక కంపెనీల్లో కోట్లాదిరూపాయల పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. 

అలాగే కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో రూ.1000 కోట్ల పెట్టుబడితో రియల్‌ఎస్టేట్‌ కంపెనీ, లాస్‌ఏంజెల్స్‌లో మరో కంపెనీలు నడుపుతున్న నేపథ్యంలో 400 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో 40 కల్కి కేంద్రాలపై బుధవారం నుంచి మెరుపుదాడులు ప్రారంభించారు. స్వదేశీ, విదేశీ నగదు కలుపుకుని మొత్తం రూ.500 కోట్లు ఐటీ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. కాగా కల్కి దంపతులు గత కొంతకాలంగా ఆశ్రమాల్లో ఉంటున్నట్లు అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు కల్కి భగవాన్‌ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి:
ఏకంలో కల్కి భగవాన్ గుట్టు?
కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం
అందుబాటులో లేని కల్కి భగవాన్..
కల్కి భగవాన్పై ఐటీ దాడులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement