ఐదు జిల్లాల్లో ఐటీ సోదాలు | IT searches in five districts | Sakshi
Sakshi News home page

ఐదు జిల్లాల్లో ఐటీ సోదాలు

Published Sat, Oct 6 2018 3:58 AM | Last Updated on Sat, Oct 6 2018 4:57 AM

IT searches in five districts - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్‌ వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. అధికారులు బృందాలుగా విడిపోయి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. చేస్తున్న వ్యాపారం కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్న వారితోపాటు అనుమానిత రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న సదరన్, శుభగృహ సంస్థలతోపాటు వీఎస్‌ గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి.

ప్రకాశం జిల్లా కందూకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన సమీప బంధువులకు చెందిన సదరన్‌ డెవలపర్స్, సదరన్‌ ఆక్వా ప్రాసెసింగ్, సదరన్‌ గ్రానెట్‌ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నంబూరు శంకర్‌రావుకు చెందిన శుభగృహ డెవలపర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గుంటూరుకు చెందిన వీఎస్‌ లాజిస్టిక్స్, జగ్గయ్యపేటలోని ప్రీకాస్ట్‌ బ్రిక్స్‌ తయారు చేసే వీఎస్‌ ఎకో బ్రిక్స్‌ సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌గ్రూపులో రెండోరోజు కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుంచి రాక
తాజాగా చేపట్టిన సోదాల వివరాలను బయటపెట్టడానికి స్థానిక ఐటీ అధికారులు నిరాకరించారు. దాడులు పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం తెలియజేస్తుందని, ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ఐటీ అధికారులతో సంబంధం లేకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన సుమారు 10 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు అర్ధరాత్రి దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల మధ్యాహ్నం కల్లా సోదాలు పూర్తి చేశారు. వ్యాపార లావాదేవీలకు చెందిన విలువైన పత్రాలను ఐటీ అధికారులు తమవెంట తీసుకెళ్లారు.

ఖండించిన మంత్రి నారాయణ
రాష్ట్ర మంత్రి పి.నారాయణకు చెందిన విద్యాసంస్థలపై ఐటీ దాడులు మొదలైనట్లు మీడియాలో తొలుత ప్రచారం జరిగింది. తన సొంత జిల్లా నెల్లూరుతోపాటు విజయవాడ, హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థలపై దాడులు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ సంస్థల్లో ఆదాయపు పన్ను అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు.  

రాజధానిలో ఐటీ దాడుల కలకలం  
ఐటీ అధికారులు చేపట్టిన దాడులు రాజధానిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న సోదాల్లో ఐటీ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మొదట విజయవాడలోని నారాయణ కళాశాలకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోనగర్‌లోని ఐజీ, జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి బయల్దేరిన 10 ఐటీ బృందాలు ఏకకాలంలో లబ్బీపేట, భారతీనగర్, వినాయక థియేటర్, కరెన్సీనగర్, బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న సదరన్‌ డెవపలర్స్, వీఎస్‌ లాజిస్టిక్స్, శుభగృహ ప్రాజెక్టు కార్యాలయాల్లో దాడులు చేశాయి.

సదరన్‌ డెవలపర్స్‌ కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి చెందినవిగా గుర్తించారు. సదరన్‌ డెవలపర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి బంధువు ఈ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట పంచాయతీ పరిధిలో ఉన్న వీఎస్‌ ఎకో బ్లాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీ గుంటూరుకు చెందిన వల్లభనేని శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్‌ పేరిట నడుస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని వీఎస్‌ లాజిస్టిక్స్‌ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అలాగే ఆయా కంపెనీల ప్రతినిధుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు.

జగ్గయ్యపేటలో బంగారం దుకాణాలు మూత
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శుక్రవారం బంగారం వ్యాపారులు మూడు గంటలపాటు దుకాణాలను మూసివేశారు. ఐటీ అధికారులు జగ్గయ్యపేటకు వస్తున్నారనే సమాచారంతో వెంటనే అప్రమత్తమై దుకాణాలను మూసేశారు.
 
ఎమ్మెల్యే పోతుల సంస్థల్లో సోదాలు
ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంట వద్ద ఎమ్మెల్యేకు చెందిన సదరన్‌ ఇన్‌ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌పై ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం 6 గంటలకే దాడులు ప్రారంభించారు.  రెండు వాహనాల్లో వచ్చిన 10 మంది అధికారులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే సమీప బంధువు, కంపెనీ ఎండీ కార్తీక్‌ను అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఎమ్మెల్యేకు సంబంధించి టంగుటూరు మండలం కారుమంచి వద్ద, ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన రొయ్యలు వలిచే ఫ్యాక్టరీల వివరాలు ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.

వీటితోపాటు ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద సదరన్‌ రాక్‌ గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్, పేర్నమిట్ట వద్ద ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఫ్యాక్టరీలకు చెందిన ఉన్నతాధికారులను ప్రశ్నించి, కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోతుల రామారావు పన్నులు చెల్లించకుండానే పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై గురి  
విశాఖపట్నంలోని పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శుభగృహలో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థల బ్యాంక్‌ లాకర్లను సైతం తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీశారు. ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పత్రాలను కూడా పరిశీలించారు. విశాఖపట్నంలో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

వీఎస్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆఫీసుపై దాడులు
గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం పంచాయతీ పరిధిలోని వీఎస్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి దాకా కొనసాగుతూనే ఉన్నాయి.

భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపిన సంస్థలపై తనిఖీల్లో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. బిల్లులు, లావాదేవీల వివరాలను చూపాలని కోరారు. మండలంలోని  వీఎస్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంతోపాటు గుంటూరు నగరంలోని విద్యానగర్, కృష్ణనగర్, స్వర్ణభారతినగర్‌లో గల సంస్థ ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement