కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: పిల్లలకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పక్కదారి పట్టారు. అడ్డదారుల్లో బిల్లులను క్లెయిమ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ఉన్నతాధికారులు విషయాన్ని పసిగట్టి అక్రమార్కుల నుంచి సొమ్మును రికవరీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో 2008 సంవత్సరంలో విద్యాశాఖ నుంచి ఎల్‌టీసీ క్లెయిమ్ చేసిన వాటిలో 405 క్రమరహితంగా ఉన్నాయని రాష్ట్ర ఆడిట్ ఆఫీసర్, భారతీయ ఆడిట్, గణనశాఖ, ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్(జి/ఎస్‌ఎస్‌ఏ)హైదరాబాద్ వారు గుర్తించారు. ఆ సంబంధిత క్లెయిమ్‌దారుల నుంచి మొత్తం తిరిగి రాబట్టి, ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని, ఇందుకు సంబంధించిన ట్రెజరీ చలానాలను వెంటనే పంపించాలని ఆదేశించారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు జనవరి 21న ఈ మెయిల్ ద్వారా క్రమ రహిత ఎల్‌టీసీ క్లెయిమ్‌ల జాబితాను అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు పంపించారు. ఆయా మొత్తాన్ని డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా వసూలు చేయాలని డీఈవో కె. నాగేశ్వరరావు శనివారం ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాలో జమచేసిన నఖలు ట్రెజరీ చలానాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోగా పంపించాలన్నారు. క్లెయిమ్‌ను రికవరీ చేయాల్సిన బాధ్యత సంబంధిత విద్యాధికారులదేనన్నారు. ఇందులో ఏదైనా జాప్యం జరిగితే అందుకు ఆయా డ్రాయింగ్ ఆఫీసర్లే పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు. వీరిపై ఉన్నతాధికారులకు తదుపరి చర్యలు తీసుకునే విధంగా సిఫారసు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదేంది గురువా..!
Published Sun, Feb 2 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement