ఉసురు తీసిన ఇంకుడు గుంత
Published Tue, Sep 3 2013 6:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
అడ్డరోడ్డు(నకరికల్లు), న్యూస్‌లైన్: ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఇంకుడు గుంత మింగేసింది. కూలి పనికి వెళ్లి వచ్చిన తల్లులు నీటి గుంతలో విగజీవులుగా కనిపించిన బిడ్డలను చూసి గుండెలు బాదుకున్నారు. భర్త మరణించగా ఒకరు, ఉపాధికోసం మరొకరు పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెళ్లకు కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన సోమవారం మడలంలోని అడ్డరోడ్డు గ్రామంలో విషాదం నింపింది. గురజాల మండలం పులిపాడుకు చెందిన బాణావతు పద్మకు ఇద్దరు పిల్లలు.
భర్త చనిపోవడంతో కొద్దికాలం కిందట అడ్డరోడ్డులోని పుట్టింటికి వచ్చింది. పద్మ సోదరి, కారంపూడికి చెందిన మూఢావత్ సాలిబాయి కూడా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చింది. అడ్డరోడ్డులో వరినాట్లు పనులు ముమ్మరంగా ఉండడంతో ఉపాధి కోసం వచ్చి నాలుగు రోజులుగా పనులకు వెళ్తుంది. అక్కాచెల్లెళ్లు పనులకు వెళ్తూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. పద్మ కుమార్తె రమ్య(7), సాలిబాయి కుమారుడు సమ్మియేలు (6)లు పాఠశాలకు పంపి అక్కాచెల్లెల్లు కూలిపనులకు వెళ్లారు.
సాయంత్రం తిరిగి వచ్చేసరికి చిన్నారులు కన్పించలేదు. ఆడుకోవడానికి వెళ్లుంటారని పొద్దుపోయేవరకు చూసిన తల్లులు ఎంతకు రాకపోయేసరికి వెదకడం ప్రారంభించారు. ఈలోగా చిన్నారుల అమ్మమ్మ వాళ్లు ఇంటి నిర్మాణ పనులు నిమిత్తం తీసిన ఇంకుడుగుంతలో మృతదేహాలు గుర్తించారు. ఏడడుగుల లోతు గల గుంతలో నిండా నీరు ఉంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలోపడటంతో చిన్నారులు ఊపిరాడక మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Advertisement
Advertisement