Nekarikallu
-
రసాభాస
నకిరేకల్, న్యూస్‌లైన్: నకిరేకల్‌ను నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ రసాభాసగా మారింది. సభకు డీఎల్పీఓ యాదయ్య, ఎంపీడీఓ కత్తుల సత్తెమ్మ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఈఓఆర్డీ కమలాకర్‌రావు, పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శి చంద్రశేఖర్‌లు హాజ రయ్యారు. నకిరేకల్‌ను గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేశారు. అయితే, స్థానిక పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మరికొంతమంది నాయకులు నగర పంచాయతీగా కొనసాగించాలని పట్టుబట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గామ పంచాయతీ కావాలంటున్న ప్రజలంతా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవద్దని మరోవర్గం నినాదాల చేయడంతో ఆ రెండువర్గాల మధ్య ఘర్షణ జరి గింది. ఈ సంఘటనలో పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు గాయపడ్డారు. నకిరేకల్ సీఐ శ్రీనివాసరావు, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు ప్రసాదరావు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పక్కకు తోసే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. గంటపాటు ఇరువర్గాల మధ్య గందరగోళం నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారి కమలాకర్‌రావు నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ కోసం ఇరువర్గాల నుంచి వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించామని, వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటున్నామని ప్రకటించి వెళ్లిపోతున్న అధికారులు వెళ్తుండగా ఆందోళనకారులు వారిని అడ్డగించారు. వెంటనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి అధికారులను పంపించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నకిరేకల్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పట్టణంలోని మూసి రోడ్డులో ఉంటున్న బంటు రేణుక, వనం భవానీలు గాయపడ్డారు. పారి శుద్ధ్య సిబ్బంది కావాలనే గ్రామ పంచాయతీ కోసం డిమాండ్ చేస్తున్న తమపై దాడి చేసి గాయపరిచారని పోలీస్ స్టేషన్ ఎదుట వారు ధర్నా చేశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
నకరికల్లు, న్యూస్‌లైన్: మండలంలోని చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందారు. కుంకలగుంట గ్రామానికి చెందిన పద్మా కోటేశ్వరరావు (50) గుంటూరులో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులను కలిసేందుకు స్వగ్రామం వచ్చారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఉదయం తన బావమరిది తాడువాయి శ్రీనివాసరావుతో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి గేదె ఒక్కసారిగా అడ్డురావడంతో ద్విచక్ర వాహనం దానిని ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ కె.ప్రభాకర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108లో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కోటేశ్వరరావు మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. కోటేశ్వరరావు మృతి సమాచారం తెలుసుకున్న ఏఆర్ సిబ్బంది, బంధువులు వైద్యశాలకు తరలివచ్చారు. మృతుడి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కోటేశ్వరరావు మృతదేహానికి స్వగ్రామం కుంకలగుంటలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉసురు తీసిన ఇంకుడు గుంత
అడ్డరోడ్డు(నకరికల్లు), న్యూస్‌లైన్: ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఇంకుడు గుంత మింగేసింది. కూలి పనికి వెళ్లి వచ్చిన తల్లులు నీటి గుంతలో విగజీవులుగా కనిపించిన బిడ్డలను చూసి గుండెలు బాదుకున్నారు. భర్త మరణించగా ఒకరు, ఉపాధికోసం మరొకరు పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెళ్లకు కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన సోమవారం మడలంలోని అడ్డరోడ్డు గ్రామంలో విషాదం నింపింది. గురజాల మండలం పులిపాడుకు చెందిన బాణావతు పద్మకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో కొద్దికాలం కిందట అడ్డరోడ్డులోని పుట్టింటికి వచ్చింది. పద్మ సోదరి, కారంపూడికి చెందిన మూఢావత్ సాలిబాయి కూడా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చింది. అడ్డరోడ్డులో వరినాట్లు పనులు ముమ్మరంగా ఉండడంతో ఉపాధి కోసం వచ్చి నాలుగు రోజులుగా పనులకు వెళ్తుంది. అక్కాచెల్లెళ్లు పనులకు వెళ్తూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. పద్మ కుమార్తె రమ్య(7), సాలిబాయి కుమారుడు సమ్మియేలు (6)లు పాఠశాలకు పంపి అక్కాచెల్లెల్లు కూలిపనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి చిన్నారులు కన్పించలేదు. ఆడుకోవడానికి వెళ్లుంటారని పొద్దుపోయేవరకు చూసిన తల్లులు ఎంతకు రాకపోయేసరికి వెదకడం ప్రారంభించారు. ఈలోగా చిన్నారుల అమ్మమ్మ వాళ్లు ఇంటి నిర్మాణ పనులు నిమిత్తం తీసిన ఇంకుడుగుంతలో మృతదేహాలు గుర్తించారు. ఏడడుగుల లోతు గల గుంతలో నిండా నీరు ఉంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలోపడటంతో చిన్నారులు ఊపిరాడక మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.