రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి | road accident in Head constable died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

Published Mon, Jan 27 2014 3:25 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

road accident in Head constable died

 నకరికల్లు, న్యూస్‌లైన్: మండలంలోని చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందారు. కుంకలగుంట గ్రామానికి చెందిన పద్మా కోటేశ్వరరావు (50) గుంటూరులో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులను కలిసేందుకు స్వగ్రామం వచ్చారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఉదయం తన బావమరిది తాడువాయి శ్రీనివాసరావుతో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి గేదె ఒక్కసారిగా అడ్డురావడంతో ద్విచక్ర వాహనం దానిని ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. 
 
 ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ కె.ప్రభాకర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108లో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కోటేశ్వరరావు మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. కోటేశ్వరరావు మృతి సమాచారం తెలుసుకున్న ఏఆర్ సిబ్బంది, బంధువులు వైద్యశాలకు తరలివచ్చారు. మృతుడి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కోటేశ్వరరావు మృతదేహానికి స్వగ్రామం కుంకలగుంటలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కె.ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement