మండపేట : వేసవి నష్టాల నుంచి గట్టెక్కుతున్నామన్న కోళ్ల రైతుల ఆనందాన్ని శ్రావణమాసం ఆవిరి చేస్తోంది. వినియోగం తగ్గి గుడ్డు ధర పతనమవుతోంది. ప్రస్తుత ధరను బట్టి రోజూ పరిశ్రమకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. త్వరలో చవితి రానుండటంతో మున్ముందు మరింత గడ్డు కాలమేనని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీల్లో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు సుమారు 1.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎండల తీవ్రతతో ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మేర పడిపోయిన గుడ్ల ఉత్పత్తి తొలకరి జల్లులతో సాధారణ స్థితికి చేరింది. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరిగింది. వేసవి ప్రభావంతో ఏప్రిల్‌లో రూ. 2.30కు పతనమైన గుడ్డు రైతు ధర జూన్‌లో ఎగుమతులు పుంజుకుని పెరుగుతూ వచ్చింది.
జూన్ 19 నాటికి రూ.3.94 అత్యధిక ధరను నమోదు చేసుకుంది. ఇంతలో శ్రావణ మాసం రాకతో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేక ధర పతనమవుతోంది. ఎగుమతులకు డిమాండ్ లేక గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ శనివారం నాటికి రైతు ధర రూ 2.86కు పతనమైంది. నిర్వహణ భారం దృష్ట్యా రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి అన్నారు. ఆ మేరకు జిల్లాలో పరిశ్రమకు రోజుకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లుతోందని అంచనా.
దిగిరాని చిల్లర ధర
తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. గుడ్డు రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా వ్యాపారులు చిల్లరగా అమ్ముతుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. రైతు ధర రూ.2.86 ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.4 వరకు అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించిన అనపర్తి, మండపేట పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రూ.4.50 నుంచి రూ.5 వరకు కూడా అమ్ముతుండటంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు జంకుతున్నారు. కాగా ఈ ధరాభారంతో స్థానిక వినియోగం తగ్గితే రైతు ధర మరింత పతనమవుతుందని పౌల్ట్రీ వర్గాలు కలవరపడుతున్నారుు.
వినియోగదారులకు ఊరటనిస్తున్న చికెన్ రేటు
కాగా రిటైల్ మార్కెట్‌లో చికెన్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఎండల తీవ్రతతో గత రెండు నెలల్లో చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. బ్రాయిలర్ లైవ్ కిలో రూ.90 ఉండగా మాంసం కిలో రూ.=200కు, స్కిన్‌లెస్ రూ. 220కు చేరి వినియోగదారుల్ని బెంబేలెత్తించాయి. కొత్త బ్యాచ్‌లు రావడం, శ్రావణమాసంతో వినియోగం తగ్గి ధర తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.58 ఉండగా, మాంసం రూ.120, స్కిన్‌లెస్ రూ. 140కు తగ్గిందని చెబుతున్నారు. గత నెలలో రూ.59గా ఉన్న లైవ్ కిలో లేయర్ కోడి ధర ప్రస్తుతం రూ.40కు తగ్గిపోయింది. తాము ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందని కోళ్ల రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ గడ్డు కాలం
Published Sun, Aug 23 2015 4:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM
Advertisement
Advertisement