అండగా ఉంటాం | It'll be up | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం

Published Mon, Jan 5 2015 1:41 AM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

It'll be up

సాక్షి గుంటూరు/తాడేపల్లి రూరల్ : పచ్చని పల్లెల్లో పోలీసులు కార్చిచ్చు రగుల్చుతున్నారు. విచారణ పేరిట అమాయక  రైతులను అదుపులోకి తీసుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నడూ గొడవలు ఎరగని రైతులు పోలీసుల హడావుడితో వణికిపోతున్నారు.

ఎప్పుడు ఎవరిని విచారణ పేరుతో తీసుకెళ్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజ దాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) భరోసా ఇచ్చారు. ఆదివారం ఉదయం ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. వారి ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా తాము పడుతున్న ఇబ్బందులను రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. ఎన్నడూ పోలీసుస్టేషన్ గడప తొక్కని రైతులను సైతం తీసుకెళ్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు.

రెండవ తేదీ అర్ధరాత్రి పెనుమాకలో ముగ్గురు యువకులను తీసుకెళ్లి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. డిసెంబరు 29న రాజధాని ప్రాంతంలో జరిగిన దహనకాండను ఆసరా చేసుకుని ప్రభుత్వ పెద్దలు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులపై పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపే దిశగా పావులు కదుపుతున్నారు.అమాయకులను విచారణపేరుతో పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లి బెదిరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో రాజధాని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 మందికి పైగా రైతులను తీసుకెళ్లి విచారణ పేరుతో వేధించినట్లు తెలుస్తోంది.  అయితే ముగ్గురు యువకులను మాత్రం వదిలిపెట్టకుండా తుళ్లూరు స్టేషన్‌లో ఉంచి జరిగిన సంఘటనకు తామే బాధ్యులుగా ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

రైతుల సమస్యలను విన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ‘ మీరు అధైర్యపడవద్దు, మీ వెంట నేను, పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తాం’ అని భరోసానిచ్చారు.  బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు, రైతులు అంతా కలసి హైదరాబాద్ వెళ్లి  సోమవారం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఇక్కడి పరిస్థితులను వివరిస్తామన్నారు.  

అనంతరం మానవహక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే రాజధాని రైతులు,కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులతోపాటు పార్టీలోని ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కూడా కలుస్తామని పేర్కొన్నారు.

నిజమైన దోషులను వదిలేసి అర్ధరాత్రి వేళ ప్రభుత్వ పెద్దలు పోలీసులను పంపి వేధిస్తున్నారన్నారు. ఈ దుశ్చర్యలను చూస్తే సంఘటనతో సంబంధం లేని రైతులను దోషులుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు.

మానవ హక్కుల కమిషన్, గవర్నర్‌ను కలిసేందుకు ఆదివారం రాత్రి పలువురు రైతులు, బాధిత కుటుంబ సభ్యులు తరలి హైదరాబాద్ వెళ్లారు. ఈ సమావేశంలో తాడేపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు కత్తిక రాజ్యలక్ష్మి, మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, దంటు గోవర్ధన్‌రెడ్డి, దంటు బాలాజీరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పాటిబండ్ల కృష్ణమూర్తి, బొక్కా ప్రసన్నకుమారి, పెనుమాక సొసైటీ అధ్యక్షుడు మేకా శివారెడ్డి పాల్గొన్నారు.

భారీగా తరలిన రైతులు, మహిళలు
తాడేపల్లి రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ఆదివారం రాత్రి బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో వీరంతా పయనమయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పాటిబండ్ల కృష్ణమూర్తి, తాడేపల్లి ఎంపీపీ క త్తిక రాజ్యలక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బురదగుంట కనకవల్లి, అన్ని గ్రామాల వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు, పార్టీ పెనుమాక కన్వీనర్ దామేశ్వర్‌రెడ్డి, దంటు గోవర్ధనరెడ్డి, దంటు బాలజీరెడ్డి, కొల్లి చంద్రారెడ్డి ఇంకా భారీ సంఖ్యలో మహిళలు, రైతులు తదితరులు జగన్‌ను కలిసేందుకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement