సాక్షి, కరీంనగర్ : తెలంగాణ తొలిదశ పోరాటంలో కీలకమైన ముల్కీ ఉద్యమంలో అసువులుబాసిన విద్యార్థి అమరవీరులకు తెలంగాణవాదులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ జేఏసీ ఈ నెల ఒకటి నుంచి ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలో నూ స్థానికులకు విద్యా, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతుందని, స్థానికులకు ఈ అవకాశాలు దక్కాలన్న డిమాండ్‌లో ముల్కీ ఉద్యమం 1952 సెప్టెంబర్‌లో జరిగింది. గైర్‌ముల్కీ (స్థానికేతరులు) గోబ్యాక్ నినాదంతో ఉద్యమించిన విద్యార్థులపై సెప్టెంబర్ 3, 4 తేదీల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
వారిని గుర్తు చేసుకుంటూ ఏటా సెప్టెంబర్ మొదటివారంలో ముల్కీ అమరవీరుల సంస్మరణ జరుగుతుంది. హైదరాబాద్, అదిలాబాద్, నిజామాబాద్‌లలో టీజేఏసీ భారీ శాంతిర్యాలీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే బుధవారం కరీంనగర్‌లో శాంతిర్యాలీ జరుగనుంది. ర్యాలీ తర్వాత కలెక్టరేట్ వద్ద దీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 7న వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో సిటీ కళాశాల నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఈ ర్యాలీకి తెలంగాణవాదులు హాజరవుతారని జేఏసీ నేతలు అంటున్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఆందోళనలు మొదలుకావడం, విభజన ప్రక్రియను అడ్డుకుంటామని ఆ ప్రాంత నేతలు ప్రకటనలు చేయడం తెలంగాణవాదుల్లో సందేహాలను రేకెత్తిస్తోంది. కేంద్రం మళ్లీ వెనక్కు పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర ఆందోళనల నేపథ్యంలో టీజేఏసీ ఆధ్వర్యంలో రాజధానితో పాటు జిల్లాలో శాంతి, సద్భావన యాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ముల్కీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని చేపట్టింది.
బుధవారం జిల్లా కేంద్రంలో కోర్టుచౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు మధ్యాహ్నం 12 గంటలకు శాంతి ర్యాలీ జరుగుతుంది. కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు జి.దేవీప్రసాద్, కార్యదర్శి కారెం రవీందర్‌రెడ్డి, రసమయి బాల్‌కిషన్ తదితరులు పాల్గొంటున్నారు. టీజేఏసీ భాగస్వామ్య పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు తమ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హమీద్, కార్యదర్శి నరసింహస్వామి తెలిపారు.
ముల్కీ వీరుల సంస్మరణలో..
Published Wed, Sep 4 2013 5:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement